త్వరలో గొర్రెలే ఇస్తామన్న పశుసంవర్ధక శాఖ ఆఫీసర్  

త్వరలో గొర్రెలే ఇస్తామన్న పశుసంవర్ధక శాఖ ఆఫీసర్  
  • గైడ్​లైన్స్​ రాకముందే అలా ఎలా చెప్తారన్న జడ్పీ చైర్మన్  
  • వాగ్వాదానికి దిగిన జడ్పీటీసీలు
  • మైక్​ విసిరికొట్టిన జడ్పీటీసీ నగేశ్​ 
  • యాదాద్రి సమావేశంలో గొడవ

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జడ్పీ మీటింగ్​లో గొర్రెల పంపిణీ స్కీంపై గొడవ జరిగింది. ఈ విషయంలో జడ్పీ చైర్మన్​ఎలిమినేటి సందీప్​రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్​తో చౌటుప్పల్, ఆలేరు జడ్పీటీసీలు చిలుకూరి ప్రభాకర్​రెడ్డి, డాక్టర్​ కుడుదుల నగేశ్​వాగ్వాదానికి దిగారు. మంగళవారం యాదాద్రి జడ్పీ మీటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే పశు సంవర్ధక శాఖపై చర్చ మొదలైంది. ఈ సందర్భంగా చౌటుప్పల్​జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్​రెడ్డి గొర్రెల స్కీం గురించి లేవనెత్తారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా గొర్రెల కాపరులకు నగదు బదిలీ చేస్తామంటూ ఇచ్చిన హామీని ప్రస్తావించారు. డబ్బులు వేసిన తర్వాత అకౌంట్లు ఫ్రీజ్​చేశారా?  ఇప్పుడు గొర్రెలు ఇస్తారా? లేక నగదు ఇస్తారా? అంటూ ప్రశ్నించారు.

దీంతో పశుసంవర్ధక శాఖ ఆఫీసర్ కృష్ణ మాట్లాడుతూ గొర్రెల కాపరుల అకౌంట్లు ఫ్రీజ్​చేసిన తర్వాతే నగదు జమ చేశామని, ఇప్పుడు గొర్రెలే ఇస్తామన్నారు. దీంతో జడ్పీ చైర్మన్ ​జోక్యం చేసుకొని గైడ్​లైన్స్​ రాకుండానే గొర్రెలు పంపిణీ చేస్తామని ఎలా చెబుతారంటూ ఆఫీసర్​ను ప్రశ్నించారు. జడ్పీటీసీలు కల్పించుకొని గైడ్​లైన్స్​ రాకుండానే నగదు బదిలీ చేస్తామని చెప్పి, గొర్రెల కాపరుల అకౌంట్లను ఫ్రీజ్​చేసి డబ్బులు ఎలా వేశారంటూ నిలదీశారు. గొర్రెల పంపిణీ స్కీంలో నగదు బదిలీ డిమాండ్​వచ్చినందున మునుగోడును పైలట్​ప్రాజెక్ట్​గా ఎంపిక చేసి గొర్రెల కాపరుల అకౌంట్లలో ప్రభుత్వం డబ్బులు వేసిందని జడ్పీ చైర్మన్​ సమాధానమిచ్చారు. ప్రతిపక్షాలు  అభ్యంతరం వ్యక్తం చేయడం వల్లే వారి అకౌంట్లను ఫ్రీజ్​చేశారన్నారు. దీనిపై జడ్పీటీసీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏదైనా ఉంటే రూల్స్​ ప్రకారం నడుచుకోవాలన్నారు. దీంతో తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్​ జోక్యం చేసుకొని ఏ ప్రభుత్వమున్నా..రూపొందించిన పాలసీల ప్రకారమే ఆఫీసర్లు నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. దీంతో జడ్పీటీసీ ప్రభాకర్​రెడ్డి మాట్లాడుతూ 'మనం ఉత్తర తెలంగాణలో లేము.

దక్షిణ తెలంగాణలో ఉన్నందునే వివక్ష చూపుతున్నారు' అని కామెంట్​ చేశారు. దీంతో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ మాట్లాడుతూ అందరం ఉత్తర భారత్​లో లేమని, దక్షిణ తెలంగాణలో ఉన్నామని, ఐటీలు, ఈడీలు ఎక్కడకు పోతున్నాయన్నారు. వివక్ష గురించి మాట్లాడితే చాలా మాట్లాడాల్సి ఉంటుందన్నారు. దీంతో పలువురు జడ్పీటీసీలు పైకి లేవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. గొర్రెల స్కీంపై ఆలేరు జడ్పీటీసీ నగేశ్​ మరోసారి ప్రశ్నిస్తూ గొర్రెలే ఇస్తారంటూ మీడియాలో వచ్చిన కథనాలను ప్రస్తావించడంతో జడ్పీ చైర్మన్ ​సందీప్​రెడ్డి ‘గైడ్​లైన్స్​ రాలేదు’ అని సమాధానమిచ్చారు. ‘సమాధానం చెప్పాల్సింది ఆఫీసర్​ మీరు కాదు’ అంటూ నగేశ్​ అసహనం వ్యక్తం చేశారు. దీంతో కేవలం ఫొటోలకు పోజులివ్వడానికి.. మీడియాలో రావడానికే మీటింగ్​లో పోటీపడి మాట్లాడుతున్నారని జడ్పీ చైర్మన్​ సందీప్​రెడ్డి కామెంట్​ చేయడంతో నగేశ్ ​వాగ్వాదానికి దిగారు. మైక్​ కట్​ చేయాలని సందీప్​రెడ్డి ఆదేశించడంతో..అసహనానికి గురైన నగేశ్​ చేతిలోని మైక్​ విసిరికొట్టి కూర్చున్నారు. దీంతో మైక్​విసిరి కొట్టడం మంచిది కాదంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్​ కామెంట్​ చేశారు.  

ఇంకా డిసైడ్​ చేసుకోలే

పింఛన్ల జాబితా నుంచి తొలగించిన పేర్లను తిరిగి చేర్చే విషయంలో ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని డీఆర్డీఓ ఉపేందర్​రెడ్డి తెలిపారు. పింఛన్లపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ నిబంధనలకు మించి భూమి ఉన్నవారి పేర్ల తొలగింపు విషయంలో వెలుసుబాటు కల్పించే అవకాశం లేదన్నారు. దళితబంధు స్కీమ్​లో చాలామంది ఫోర్ వీలర్ తీసుకుంటున్నారని, అయితే ఫోర్ వీలర్స్ వాడేవారిలో ఎక్కువగా ఉపాధి కోసమే తీసుకుంటున్నందున ఈ విషయంలో ప్రభుత్వం  కొంత ఆలోచన చేస్తున్నదన్నారు.