దెబ్బకు దెబ్బ.. ఇజ్రాయెల్ అణుకేంద్రాలపై ఇరాన్ మిసైళ్ల వర్షం.. 100 మందికిపైగా గాయాలు

దెబ్బకు దెబ్బ.. ఇజ్రాయెల్ అణుకేంద్రాలపై ఇరాన్ మిసైళ్ల వర్షం.. 100 మందికిపైగా గాయాలు

అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు రౌండప్ చేస్తున్నా ఇరాన్ ఎక్కడా తగ్గట్లేదు. దెబ్బకు దెబ్బ తీయడమే తమ లక్ష్యం అంటూ విరుచుకుపడుతోంది. లేటెస్టుగా ఇజ్రాయెల్ లోని కీలక అణు స్థావరాలపై మిసైల్ దాడులు చేసింది. డిమోనా, అరాద్ పట్ణాలపై మిసైళ్ల వర్షం కురిపించడంతో భారీ విధ్వంసం సంభవించింది. అణు స్థావరాలే లక్ష్యంగా జరిపిన దాడిలో దాదాపు వంద మంది గాయపడినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. 

ఇజ్రాయెల్ కీలక అణు స్థావరం అయిన డిమోనా పట్టణంతో పాటు అరాద్ టౌన్ పై కూడా మిసైళ్ల దాడులు జరిగాయి. శనివారం (మార్చి 21) నటాంజ్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేసిన వెంటనే.. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా అణుస్థావరాలపై విరుచుకుపడింది ఇరాన్. 


డిమోనా, అరాద్ లపై వందల కిలోల బరుబుతున్న రెండు వార్ హెడ్స్, మిసైళ్లతో దాడులు చేసింది ఇరాన్. ఈ దాడులపై ఇజ్రాయెల్ మెడికల్ ఎమర్జెన్సీ సంస్థ మజెన్ దేవిడ్ ఆడమ్ స్పందించింది. అరాద్ లో 84 మంది గాయపడగా 10 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. అదే విధంగా డిమోనాలో 33 మందికి గాయాలైనట్లు ఈ అంబులెన్స్, బ్లడ్ బ్యాంక్ సంస్థ పేర్కొంది. 

ఈ ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహూ.. ఇది చాలా కఠినమైన సాయంత్రం. ఈ దాడిని ఖండిస్తున్నాం. మా శత్రువుపై దాడులు కొనసాగిస్తాం. అన్ని వైపుల నుంచి దాడులు చేస్తూనే ఉంటాం.. అంటూ హెచ్చరికలు జారీ చేశారు. 

అంతకు ముందు శనివారం ఇరాన్ కీలక అణుకేంద్రం నటాంజ్ ను ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. టెహ్రాన్ కు 220 కిలీమీటర్ల దూరంలో ఉండే అణు స్థావరంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనికి ప్రతిగా ఇరాన్ రెండు అణుస్థావరాలను ధ్వంసం చేసే క్రమంలో రెండు పట్టణాలపై మిసైళ్ల దాడులు చేసింది.