ఎడతెరిపి లేని వాన..ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉప్పొంగిన వాగులు

ఎడతెరిపి లేని వాన..ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉప్పొంగిన వాగులు
  •     నిజామాబాద్​ జిల్లాలో అర్ధరాత్రి నుంచి పొద్దున వరకు..
  •     కామారెడ్డి​ జిల్లాలో తెల్లవారుజాము నుంచి రోజంతా..
  •     పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
  •     నిండుకుండల్లా మారిన జలాశయాలు
  •     కామారెడ్డి  జిల్లాలోని రామారెడ్డి మండలంలో 12 సెం.మీ. వాన

వెలుగు నెట్​వర్క్​: ఎడతెరపి లేని వానకు ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో వాగులు, వంకలు ఉప్పొంగాయి. చెరువులు అలుగు పారగా, వాగుల్లో జల ప్రవాహం రోడ్లను ముంచెత్తింది. ప్రాజెక్టులకు భారీగా నీరు చేరి నిండుకుండలా మారాయి. నిజామాబాద్​ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు వర్షం కురవగా... కామారెడ్డి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ప్రారంభమై  రోజంతా మోస్తరు వాన కురిసింది.

కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలంలో అత్యధికంగా 12 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. మద్నూర్​ మండలం సోమూర్​లో 8.9 సెం.మీ, గాంధారి మండలం రాంలక్ష్మన్​పల్లిలో 8.7 సెం.మీ, మహమ్మద్​నగర్​లో 7.1 సెం.మీ, తాడ్వాయిలో 6 సెం.మీ, కామారెడ్డిలో 5.8 సెం.మీ, లింగంపేటలో 5 సెం.మీ, రాజంపేటలో 4.2 సెంటిమీటర్ల వర్షం కొట్టింది. జుక్కల్​ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో కామారెడ్డి సబ్​  కలెక్టర్​ కిరణ్మయి పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించారు.

నిజామాబాద్​ జిల్లాలో అత్యధికంగా కోటగిరి మండలంలో 63.4 మిల్లీమీటర్లు, వర్నిలో 53.9 మి.మీ, మోపాల్​లో 45.8 మి.మీ, రుద్రూర్​ 43.1 మి.మీ, ఇందల్వాయిలో 33.1 మి.మీ, చందూర్​లో 32 మి.మీ, ఆర్మూర్​లో 21.5 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. బోధన్​ మండలం బిక్నెల్లి, కల్దుర్కి గ్రామాల్లో నాలుగు ఇండ్లు శిథిలావస్థలో ఉండగా అందులో నివసిస్తున్న 20 మందిని ప్రభుత్వ స్కూళ్లకు పంపారు.

ఇందల్వాయి మండలం సిర్నాపల్లి బ్రిడ్జి మీదుగా వరద పారడంతో అటు ఎవరూ వెళ్లకుండా ట్రాక్టర్​ ట్రాలీలు అడ్డుగా పెట్టారు. వర్ని మండలంలోని సైద్​పూర్​ రిజర్వాయిర్​ మీదుగా వెళ్లే వరద నీరు జలాల్​పూర్​ లోలెవల్​ బ్రిడ్జిని ముంచేసింది. వర్ని, రుద్రూర్​ మండలాల్లో లోతట్టు ప్రాంతాలను కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి, సబ్​ కలెక్టర్​ వికాస్​ మహా, సీపీ సాయిచైతన్య వేర్వేరుగా పరిశీలించారు. రోడ్లపై వరద ప్రవహిస్తున్న చోట దారులను మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

రాకపోకలు బంద్​..

భారీ వర్షంతో పలు మండలాల్లో రోడ్లు, కాజ్​వేలపై వరద నీరు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రామారెడ్డి మండలం కన్నాపూర్​-– గర్గుల్​ మధ్య, రెడ్డిపేట- – ఘన్​పూర్​ మధ్య,   సదాశివనగర్ మండలం అమర్లబండ- – ధర్మరావుపేట మధ్య, మద్నూర్​ మండలంలోని పలు ఏరియాల్లో వాగుప్రవాహం రోడ్లను ముంచెత్తడంతో రాకపోకలను నిలిపివేశారు. మద్నూర్​ మండలం చిన్న ఎక్లారాలో ఊరును ఆనుకొని వరద నీరు వచ్చింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌజింగ్​బోర్డు కాలనీ సమీపంలోని మెయిన్​రోడ్డు, స్టేషన్​రోడ్డు,  సిరిసిల్లా రోడ్డు జలమయమయ్యాయి. గవర్నమెంట్​ డిగ్రీ కాలేజీ ప్రహరీ కూలింది. కాకతీయ నగర్​ కాలనీ వైపు వెళ్లే రోడ్డుపై ఓ గోడ దెబ్బతిన్నది.