శంకర్పల్లి, వెలుగు: పొలం నుంచి రాత్రి ఇంటికి వెళ్తున్న మహిళ మెడలోని పుస్తెలతాడును స్కూటీపై వచ్చిన దుండగులు తెంపుకెళ్లిన ఘటన శంకర్పల్లి టౌన్లో చోటు చేసుకుంది. శంకర్పల్లి ఎస్ఐ సంతోష్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. సింగాపురానికి చెందిన మణెమ్మ(49) సోమవారం ఉదయం పొలం పనులకు వెళ్లింది. రాత్రి ఇంటికి వస్తుండగా.. ఎల్లో కప్ కేఫ్ వద్ద గుర్తు తెలియని ఇద్దరు దుండగులు స్కూటీపై వచ్చి మణెమ్మ మెడలోంచి మూడు తులాల పుస్తెలతాడు లాక్కొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి
దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ ఐ తెలిపారు.
మహిళపై దాడి చేసి నగలు చోరీ
షాద్ నగర్ ,వెలుగు: మహిళపై దాడి చేసిన కొందరు వ్యక్తులు బంగారు నగలను ఎత్తుకెళ్లిన ఘటన షాద్ నగర్ పీఎస్ పరిధిలో జరిగింది. బాలానగర్ మండలంలోని మోతిఘనాపూర్ గ్రామానికి చెందిన ఓ రుక్కమ్మ (55) అడ్డా కూలీగా పనిచేస్తోంది. మంగళవారం మధ్యాహ్నం ఏలికట్ట చౌరస్తా మీదుగా ఒంటరిగా వెళ్తున్న ఆమెపై కొందరు వ్యక్తులు ఆమెపై దాడి చేసి చెవి కమ్మలు, ముక్కు పుడక లాక్కుని పరారయ్యారు. దాడిలో గాయపడ్డరుక్కమ్మను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమెను షాద్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని శంషాబాద్ జోన్ డీసీపీ నారాయణ రెడ్డి, ఏసీపీ కుశల్కర్, సీఐ ప్రతాప లింగం పరిశీలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
================================================================
