
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందని పరీక్ష ఫీజు మినహాయింపు
పట్టణాల్లో ₹24 వేలు, పల్లెల్లో ₹20 వేల ఆదాయం ఉంటేనే..
ఈ ఆదాయంతో ఇన్‌కం సర్టిఫికెట్లివ్వని తహసీల్దార్లు
పదేండ్లుగా మారని రూల్స్
హైదరాబాద్, వెలుగు: టెన్త్ స్టూడెంట్లను ఇన్‌కం ఇబ్బందులు వెంటాడుతున్నాయి. పరీక్ష ఫీజు మినహాయింపు అందకుండా అడ్డుపడుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్లు పరీక్ష ఫీజు మినహాయింపు పొందాలంటే, పట్టణాల్లో ₹24 వేలు, పల్లెల్లో అయితే ₹20 వేలుగా సర్కారు ఆదాయ పరిమితిని విధించింది. కానీ, ఆ ఆదాయంతో ఇన్‌కం సర్టిఫికెట్లు ఇచ్చేందుకు తహసీల్దార్లు నిరాకరిస్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం తర్వాత పేద కుటుంబాల ఆదాయమూ పెరిగిందన్న సాకు చూపుతున్నారు. దీంతో ప్రభుత్వం పెట్టిన ఆ స్కీము స్టూడెంట్లకు అందకుండా పోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5 లక్షలకు పైగా స్టూడెంట్లు పదో తరగతి చదువుతున్నారు. వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్‌లో పరీక్షలు జరగనున్నాయి. ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 29 వరకు ₹125 పరీక్ష ఫీజును బోర్డు నిర్ణయించింది. వివిధ ఫైన్లతో డిసెంబర్ 11 వరకు గడువుంది. అయితే, పేద స్టూడెంట్లను ప్రోత్సహించడంలో భాగంగా సర్కారు ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్లకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపునిచ్చింది. ఫీజు మినహాయింపు పొందాలంటే ప్రభుత్వం పెట్టిన ఆదాయ నిబంధనకు తగ్గట్టు ఇన్‌కం సర్టిఫికెట్‌ను హెడ్మాస్టర్కు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇన్‌కం సర్టిఫికెట్‌ను అధికారులు ఇవ్వట్లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలేజీ స్టూడెంట్లు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పొందేందుకు సిటీల్లో అయితే ₹2 లక్షల లోపు, పల్లెల్లో అయితే ₹1.5 లక్షల వరకు ఆదాయ పరిమితిని పెట్టిన సర్కారు, టెన్త్ స్టూడెంట్ల విషయంలో మాత్రం చాలా తక్కువ మొత్తాన్ని రూల్‌గా పెట్టింది.
పదేండ్ల నుంచి మారలే..
టెన్త్ పరీక్ష ఫీజు మినహాయింపుకు 2009 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలో రూ.12 వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.20 వేల లోపు వార్షికాదాయం అర్హతగా ఉండేది. ప్రస్తుతం ఉన్న రూల్స్ 2009 తర్వాత పెట్టినవి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పరిమితిని పెంచలేదు. తెల్లరేషన్‌కార్డు పొందేందుకు కూడా ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షల వరకూ తెలంగాణ ప్రభుత్వమే పెంచింది. కానీ, టెన్త్ స్టూడెంట్ల ఫీజు మినహాయింపుకు మాత్రం పెంచట్లేదు. ఇటు ఇన్‌కం సర్టిఫికెట్ కోసం చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి ₹500 వరకు ఖర్చవుతున్నాయి. దీంతో సర్టిఫికెట్‌కు ఖర్చు పెట్టే బదులు ఫీజు కట్టడమే మేలని స్టూడెంట్లు అనుకుంటున్నారు. మినహాయింపును పొందేందుకు ఇష్టపడట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తెల్ల రేషన్‌కార్డు ఉన్నవాళ్లకు ఇన్‌కం సర్టిఫికెట్తో సంబంధం లేకుండా, ఫీజు మినహాయింపు ఇవ్వాలని టీచర్లు, స్టూడెంట్లు కోరుతున్నారు.
ప్రభుత్వానికి లెటర్ రాసినం
టెన్త్ పరీక్ష ఫీజు మినహాయింపుకు ప్రస్తుత ఆదాయ పరిమితిని పెంచాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాశాం. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. కానీ, సర్కారు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఒకవేళ సర్కారు నుంచి ఆదాయం పెంపు ఉత్తర్వులు వస్తే, దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం స్టూడెంట్స్ ఎలాంటి ఫైన్ లేకుండా 29 వరకు ఫీజు చెల్లించవచ్చు. – సుధాకర్, పరీక్షల విభాగం డైరెక్టర్