
వికారాబాద్, వెలుగు: పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్రం ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. బుధవారం నవాబుపేట మండలంలోని చించల్పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మొక్కలు నాటారు. నాటిన మొక్కల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అక్నాపూర్, అత్తాపూర్ లలో పర్యటించి, ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించారు.
లబ్ధిదారులందరూ తప్పనిసరిగా ఇండ్లు నిర్మించుకునేలా చూడాలన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8, 9,10వ తరగతుల విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, బుక్స్, యూనిఫాం అందరికీ అందాయా అని ఆరా తీశారు. ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. ప్రతీ ఇంటి ఆవరణలో ఒక్కొక్కరు రెండు మొక్కలు నాటాలన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. తహసీల్దార్ బుచ్చయ్య, ఎంపీడీవో అనురాధ, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కళాశాలల్లో వసతులు కల్పించాలి
వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు తాగునీరు, టాయిలెట్స్, లైట్లు, ఫ్యాన్లు తదితర వసతులు కల్పించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. బుధ వారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, కాలేజీల ప్రిన్సిపాళ్లతో వీడియో కాన్ఫరెన్స్నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గల ఈవీఎంల గోడౌన్ ను ఆయన తనిఖీ చేశారు. అడిషనల్కలెక్టర్(రెవెన్యూ) లింగ్యా నాయక్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ , ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నేమత్ అలీ తదితరులున్నారు.