VHT 2025-26: మోత మోగించిన మొఖాడే: విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో విదర్భ.. సెమీస్‌లో కర్ణాటకపై గెలుపు

VHT 2025-26: మోత మోగించిన మొఖాడే: విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో విదర్భ.. సెమీస్‌లో కర్ణాటకపై గెలుపు

విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ కు విదర్భ చేరుకుంది. గురువారం (జనవరి 15) జరిగిన తొలి సెమీ ఫైనల్లో విదర్భ డిఫెండింగ్ ఛాంపియన్ కర్ణాటకను ఆరు వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి ఫైనల్‌కుచేరుకుంది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన ఈ  మ్యాచ్‌లో విదర్బ విజయంలో ఓపెనర్ అమన్ మొఖాడే (122 బంతుల్లో 138: 12 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక 49.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్ లో విదర్భ 46.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసి గెలిచింది.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన కర్ణాటక జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. ఆరంభంలోనే ఆ జట్టు మయాంక్ అగర్వాల్ (9) వికెట్ ను కోల్పోయింది. కాసేపటికే సూపర్ ఫామ్ లో ఉన్న పడికల్ కేవలం 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. 20 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన కరుణ్ నాయర్, ప్రభాకర్ ఆదుకునే ప్రయత్నం చేశారు. మూడో వికెట్ కు 54 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. 28 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించిన ప్రభాకర్ కూడా ఔట్ కావడంతో కర్ణాటక 74 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో శ్రీజిత్ (54) తో కలిసి నాయర్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలు చేసి ఔటైన తర్వాత చివర్లో శ్రేయాస్ గోపాల్ (36), అభినవ్ మనోహర్ (26) కీలక పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. 

Also Read: వరల్డ్ కప్‌లో ఇండియా సూపర్ బోణీ.. 

285 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన విదర్భ కూడా ప్రారంభంలోనే అథర్వ థైడే వికెట్ ను కోల్పోయింది. అయితే ఈ దశలో ధృవ్ షోర్, అమన్ మొఖాడే రెండో వికెట్ కు 98 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. 47 పరుగులు చేసి షోరే ఔటైనా సమర్ద్ తో కలిసి మొఖాడే మరో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయం అంచుల వరకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో సమర్డు హాఫ్ సెంచరీ.. మొఖాడే తన సెంచరీ పూర్తి చేసుకున్నారు. మూడో వికెట్ కు ఈ జోడీ 147 పరుగులు జోడించడంతో విదర్భ విజయం ఖాయమైంది. సెంచరీ హీరో  మొఖాడే ఔటైనా సమర్ద్ (76) చివరి వరకు క్రీజ్ లో ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు.