'బలగం' చిత్రంతో తెలంగాణ పల్లె జీవితంలోని భావోద్వేగాలను ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడు వేణు యెల్దండి . తన మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తన రెండో ప్రయత్నంగా ‘ఎల్లమ్మ’ (Yellamma) అనే మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి సంక్రాంతి పండుగ వేళ ఒక అదిరిపోయే గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్ .
హీరోగా 'రాక్‌స్టార్' దేవిశ్రీప్రసాద్!
చాలా కాలంగా టాలీవుడ్‌లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) హీరోగా పరిచయం కాబోతున్నారని! ఆ ఊహాగానాలకు తెరదించుతూ ‘ఎల్లమ్మ’ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంతో డిఎస్పీ వెండితెరకు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. కేవలం సంగీతంతోనే కాకుండా, నటుడిగా కూడా మెప్పించేందుకు ఆయన సిద్ధమయ్యారు.
డప్పు కళాకారుడి పాత్రలో 'పర్షి'
ఈ చిత్రంలో దేవిశ్రీప్రసాద్ ‘పర్షి’ అనే డప్పు కళాకారుడి పాత్రలో కనిపిస్తున్నారు. విడుదలైన గ్లింప్స్‌లో డిఎస్పీ మాస్ లుక్, ఆయన మేకోవర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో డప్పు వాయిస్తూ ఆయన పండించిన ఎమోషన్స్ హైలైట్‌గా నిలిచాయి. తన సినిమాకు తనే సంగీతాన్ని సమకూర్చుకోవడం మరో విశేషం.
నాని, నితిన్ కాదన్నారు.. డిఎస్పీ ఒప్పేసుకున్నారు!
నిజానికి ఈ కథ ముందుగా నేచురల్ స్టార్ నాని, యువ హీరో నితిన్ దగ్గరకు వెళ్ళింది. కొన్ని కారణాల వల్ల వారు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో, వేణు యెల్దండి ఈ పాత్రకు దేవిశ్రీప్రసాద్ అయితేనే న్యాయం చేయగలరని భావించారు. ఒక సంగీత కళాకారుడి కథ కావడం, డిఎస్పీకి ఉన్న క్రేజ్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయని భావిస్తున్నారు.
భారీ నిర్మాణ విలువలు
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టి-సిరీస్ సంస్థ ఈ సినిమా మ్యూజికల్ రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుంది. ‘బలగం’ తర్వాత వేణు యెల్దండి తీస్తున్న సినిమా కావడంతో పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పల్లెటూరి మట్టి వాసనతో, డప్పు చప్పుళ్లతో ఈ ‘ఎల్లమ్మ’ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి!
