
హైదరాబాద్: బెట్టింగ్ యాప్ కేసులో విచారణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి ముమ్మరం చేసింది. 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు కంపెనీలపై కేసు నమోదు చేసింది. హీరో విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖిలపై కేసు నమోదు చేసింది. ఈడీ కేసు నమోదు చేసిన జాబితాలో ఇంకా పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఉండటం గమనార్హం. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు విచారణ చేస్తోంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై PMLA కింద ఈడీ విచారణ చేయనుంది.
పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్‌ఐఆర్ సహా బెట్టింగ్ యాప్స్ వివరాలను ఈడీ అధికారులు ఇప్పటికే సేకరించారు. ఈ రెండు కేసుల ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద హైదరాబాద్ జోనల్ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ నేతృత్వంలో అధికారులు దర్యాప్తు చేశారు. ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ ద్వారా నిర్వాహకులకు సమకూరుతున్న డబ్బు ఎక్కడికి వెళ్తుందనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ క్రమంలో సెలబ్రెటీలు ప్రమోట్ చేసిన 19 యాప్స్ నిర్వాహకులకు చెందిన బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా బెట్టింగ్ ట్రాన్సాక్షన్ల వివరాలను సేకరిస్తున్నారు. 2020, ఆగస్టులో సిటీ సీసీఎస్‌లో నమోదైన కలర్ ప్రిడిక్షన్ ఆన్‌లైన్ గేమ్ కేసును ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ కేసులో చైనా కంపెనీలతో లింకైన షెల్ సంస్థల అకౌంట్ల ద్వారా చైనాకు మనీలాండరింగ్ జరిగింది.
హవాలా ట్రాన్సాక్షన్స్ ద్వారా మొత్తం రూ.21 వేల కోట్లు విలువ చేసే 1.4 కోట్ల మనీ ట్రాన్సాక్షన్స్.. పేమెంట్ గేట్‌వేస్ ద్వారా జరిగినట్లు అప్పట్లో ఈడీ ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో వెల్లడించింది. ఈ కేసులో చైనాకు చెందిన ల్యాంబో అనే వ్యక్తి సుమారు 250 యాప్స్‌ను చైనా నుంచి ఆపరేట్ చేశాడు. గుర్గావ్లో ఆగ్లో, లియుఫాంగ్, నాబ్లూమ్, పిన్‌ప్రింట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీలు ఏర్పాటు చేశాడు. లిషాంగ్, ఆగ్లో కంపెనీల పేర్లతో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేశాడు. పేమెంట్ గేట్ వేస్, క్రిప్టో కరెన్సీ నెట్‌వర్క్ ద్వారా దుబాయ్, చైనాలకు మనీలాండరింగ్‌కి పాల్పడ్డాడు. ఈ కేసులో మొత్తం చైనాకు చెందిన 8 మందిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈడీ రూ.106 కోట్లు ఫ్రీజ్ చేసింది.