మొక్కల ద్వారా జీపీలకుఇన్ కమ్.. ఒక్కో మొక్కకు రూ.2 వేల నుంచి రూ.4 వేలు..!

మొక్కల ద్వారా జీపీలకుఇన్ కమ్.. ఒక్కో మొక్కకు రూ.2 వేల నుంచి రూ.4 వేలు..!
  • ఒక్కో మొక్కకు రూ.2 వేల నుంచి రూ.4 వేలు చెల్లింపు
  • 30 ఏండ్లు ఇచ్చేలా సర్కార్ తో ‘ఐయోరా’ అగ్రిమెంట్ 
  • ఇప్పటికే యాదాద్రి జిల్లాలో గ్రామసభల్లో తీర్మానాలు  
  • ‘ఉపాధి’లో నాటిన మొక్కలు, లొకేషన్ల గుర్తింపు సర్వే

యాదాద్రి, వెలుగు: పంచాయతీలకు అదనపు ఆదాయం వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీలో నాటిన మొక్కలకు ‘కార్బన్  క్రెడిట్’ పేరుతో  ఇన్ కమ్ అందనుంది. ఇందుకు గతేడాది రాష్ట్ర సర్కార్‎తో ‘హరిత సౌభాగ్యం’ ప్రాజెక్టు నిర్వహణకు న్యూఢిల్లీకి చెందిన ‘ఐయోరా’ ఎకలాజికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అగ్రిమెంట్ చేసుకుంది. 

 ఇది 30 ఏండ్ల పాటు అమల్లో ఉంటుంది.  2009లో ఏర్పాటైన ఐయోరా సంస్థ పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై దాదాపు 12 ఏండ్లలో 150పైగా ప్రాజెక్టులను చేపట్టింది. దేశ విదేశాల్లోనూ తన సేవలు అందిస్తోంది.  ఇప్పటికే యాదాద్రి జిల్లాలోని పంచాయతీల్లో మొక్కల రకాలు, లొకేషన్ల గుర్తింపు ప్రక్రియ  సర్వేను చేపట్టి కొనసాగిస్తోంది.  

గ్రామసభల్లో తీర్మానాలు

పంచాయతీల్లోని  మొక్కలకు ఏటా అదనపు ఆదా యం అందాలంటే.. ఇందుకు  ప్రాజెక్టు అమలుపై  ప్రతి పంచాయతీలో గ్రామసభ నిర్వహిస్తున్నారు.  సెక్రటరీతో పాటు హాజరైన ప్రజలతో   ఆ తీర్మాన పత్రంపై సంతకాలు తీసుకుంటున్నారు.  మొక్కలు నాటిన ప్రాంతాలు పంచాయతీ పరిధిలోనివేనని ధ్రువీకరిస్తూ  ఐయోరా సంస్థకు ఎన్వోసీ ఇస్తున్నారు.  అదేవిధంగా పంచాయతీ బ్యాంక్ అకౌంట్ కూడా అందిస్తున్నారు.  మరోవైపు పంచాయతీ భూముల్లో తోటలు పెంచడానికి, ఏవైనా కార్యకలాపాల నిర్వహణకు కూడా సంస్థకు అనుమతి లభిస్తుంది. 

మొక్కలకు జియో ట్యాగింగ్ సర్వే

ఉపాధి హామీలో భాగంగా పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలు, బృహత్ వనాలు, ప్రభుత్వ స్థలాలు, అవెన్యూ ప్లాంటేషన్, ప్రభుత్వ సంస్థల్లో మొక్కలు నాటిన విషయం  తెలిసిందే. ఆ మొక్కలు, లొకేషన్ల గుర్తింపునకు సర్వే చేసే విధానంపై ఐవోరా సంస్థ ప్రతినిధులు, ఉపాధి ఆఫీసర్లు సంయుక్తంగా సిబ్బందికి  ఒకరోజు క్షేత్రస్థాయి శిక్షణ ఇచ్చారు. అనంతరం పంచాయతీ సెక్రటరీ, ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ టీమ్ లు గ్రామాల్లో సర్వే చేస్తున్నాయి.

మొక్కలను గుర్తించి జియో ట్యాగింగ్ చేస్తూ , ఏయే రెవెన్యూ సర్వే నెంబర్లలో అవి ఎన్ని ఉన్నాయో..? వాటి రకాలు, లొకేషన్ల వివరాలు ‘ఎరీనా యాప్’లో  అప్ లోడ్ చేస్తున్నారు. తద్వారా ఒక్కో పంచాయతీ లో ఎన్ని మొక్కలు, ఎన్ని లోకేషన్లు ఉన్నాయనేదానిపై స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు యాదాద్రి జిల్లాలో 75 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు చేశారు. ఆయా పంచాయతీల్లో సర్వే చేసి 2,500 లొకేషన్లలో మొక్కలను 
గుర్తించారు. 

ఒక్కో మొక్కకు రూ. 4 వేల వరకు 

మొక్కల గుర్తింపు ప్రక్రియ ముగిసిన తర్వాత వాటిలోని 34 రకాల జాతులకు చెందిన మొక్కల ‘కార్బన్ రైట్స్’ ఐవోరా సంస్థకు  దక్కుతాయి. ఒక్కో మొక్కకు ఏటా రూ. 2 వేల నుంచి రూ. 4 వేల వరకు  సంస్థ 30 ఏండ్ల పాటు పంచాయతీలకు డబ్బులు చెల్లిస్తుంది. నేరుగా ఖాతాల్లోనే జమ చేస్తుంది.