జూన్ 30 వరకే డెడ్‌లైన్.. లింక్ చేయకపోతే ఈ సమస్యలు తప్పవు!

జూన్ 30 వరకే డెడ్‌లైన్.. లింక్ చేయకపోతే ఈ సమస్యలు తప్పవు!

పాన్ - ఆధార్ అనుసంధానానికి ప్రభుత్వం నిర్ధారించిన తుది గడువు సమీపిస్తోంది. ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ తమ పాన్ కార్డుతో ఆధార్ ను తప్పనిసరిగా లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ సూచిస్తోంది. లేనియెడల జులై 1వ తేదీ నుంచి బ్యాంకు లావాదేవీలన్నీ తాత్కాలికంగా నిలిపివేయబడతాయని.. ఆదాయ పన్ను సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. 

పాన్-ఆధార్ అనుసంధానానికి మార్చితో గడువు ముగియగా.. ఆదాయపు పన్ను శాఖ ఆ తేదీని జూన్ 30 వరకు పొడిగించింది. అయితే ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన కారణంగా.. 1,000 జరిమానా విధించింది. మరోసారి ఆ గడువును కోల్పోవద్దని ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు ట్విట్టర్ వేదికగా మరోసారి గుర్తు చేసింది. 

"ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం.. పన్ను మినహాయింపు పరిధిలోకి రాని పాన్ హోల్డర్లందరూ తమ పాన్‌ను 30.06.2023 లేదా అంతకు ముందే ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. దయచేసి ఈరోజే మీ పాన్ - ఆధార్‌ లింక్ చేయండి.." అని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్‌ చేసింది.

Kind attention PAN holders!

As per Income-tax Act, 1961, it is mandatory for all PAN holders, who do not fall under the exempt category, to link their PAN with Aadhaar on or before 30.06.2023.

Please link your PAN & Aadhaar today!#PANAadhaarLinking pic.twitter.com/hBxtSgRci8

— Income Tax India (@IncomeTaxIndia) June 13, 2023

లింక్ చేయకపోతే ఈ సమస్యలు తప్పవు 

  • పాన్ కార్డు పని చేయదు. (ఫలితంగా బ్యాంక్ ఖాతా తెరువాలన్నా, ఈఎంఐ రూపంలో ఏదేని వస్తువు కొనాలన్నా మీ వద్ద ఉన్న పాన్ కార్డు చెల్లుబాటు కాదు.)
  • టీడీఎస్(ట్యాక్స్‌ డిడక్షన్‌ రేట్) ఎక్కువ మొత్తంలో కట్ అవుతుంది.
  • టీసీఎస్(ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్) సైతం ఎక్కువ రేటుతో కట్టాల్సి వస్తుంది.
  • ఐటీ రిటర్న్‌ ఫైల్ చేయలేరు.
  • ఇప్పటికేపెండింగ్‌లో ఉన్న రీఫండ్‌లను స్వీకరించలేరు లేదా రిటర్న్‌లకు సంబంధించిన పెండింగ్ ప్రొసీడింగ్‌లను పూర్తి చేయలేరు.
  • ఒక వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండరాదు. రెండు లేదా అంతకంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్నట్లు తేలితే సదరు వ్యక్తిపై రూ.10,000 జరిమానా విధిస్తారు.

పాన్ - ఆధార్ లింక్ స్టేటస్ చెక్ చేసుకొండిలా.. 

  • ముందుగా ఆదాయ పన్నుశాఖ వెబ్ సైట్ www.incometax.gov.inని ఓపెన్ చేయండి.  
  • హోం పేజీలో లింక్ ఆధార్ స్టేటస్ 'Link Aadhaar Status' ఆప్షన్ ఎంచుకోండి.
  • ఇప్పుడు పాన్ నంబర్, ఆధార్ నంబర్‌ ఎంటర్ చేయండి.
  • అనంతరం కింద ఉండే వ్యూ లింక్ ఆధార్ స్టేటస్'View Link Aadhaar Status' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ పాన్‍తో ఆధార్ లింక్ అయి ఉంటే పాపప్ మెసేజ్ డిస్ ప్లే అవుతుంది. లింక్ కానియెడల కాలేదని చూపిస్తుంది.