
- రోడ్ల పైనే కూరగాయల షాపులు
- ఇబ్బంది పడుతున్న వ్యాపారులు, ప్రజలు
మెదక్, వెలుగు: జిల్లాలోని మున్సిపల్ పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి గ్రహణం పట్టింది. నిధులు మంజూరై పనులు ప్రారంభమైనప్పటికీ అసంపూర్తిగాగానే మిగిలిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాక పోవడంతో కూరగాయల వ్యాపారులు రోడ్ల మీదనే షాపులు ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో వ్యాపారులతో పాటు ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మెదక్ పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరయ్యాయి.
ముందుగా గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజీ గ్రౌండ్ పక్కన ఉన్న స్థలాన్ని ఎంపిక చేసి చదును చేశారు. అక్కడ వెజ్, నాన్ వేజ్ మార్కెట్ నిర్మాణం చేపడితే స్టూడెంట్స్కు ఇబ్బందిగా ఉంటుందని కాలేజ్ యాజమాన్యం అభ్యంతరం తెలిపింది. కోర్టుకు వెళ్లడంతో స్టే వచ్చింది. దీంతో ఇరిగేషన్ ఆఫీస్ ముందున్న స్థలాన్ని ఎంపిక చేసి పనులు మొదలుపెట్టారు. నిధులు సరిపోక పనులు పిల్లర్ల స్థాయిలోనే ఆగిపోయాయి.
రామాయంపేట పట్టణంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022లో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరయ్యాయి. అదే ఏడాది జూన్ 5న అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించినా పిల్లర్ల స్థాయిలోనే ఆగి పోయాయి. నర్సాపూర్ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి 2021 లో రూ.2 కోట్లు మంజూరయ్యాయి. 2023లో పనులు మొదలుపెట్టారు. పెరిగిన అంచనా వ్యయం కారణంగా అదనంగా రూ.4.50 కోట్లు మంజూరు కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ నిధులు మంజూరు కాలేదు. దీంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలి పోయాయి.
తూప్రాన్ పట్టణంలో
రూ.11 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు. రెండు అంతస్తులతో అన్ని హంగులతో నిర్మించినప్పటికీ నిరుపయోగంగా మారింది. నర్సాపూర్ రూట్లో పట్టణానికి దూరంగా ఉండడంతో వ్యాపారులు అక్కడ షాపుల ఏర్పాటుకు విముఖత చూపుతున్నారు. ప్రజలు కూడా కూరగాయలు, మటన్, చికెన్ కొనుగోలు కోసం అంతదూరం వెళ్లడానికి ఇష్టపడడం లేదు. దీంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిరుపయోగంగా మారింది.