హైదరాబాద్ లో రూ.94 దాటిన లీటర్ పెట్రోల్

హైదరాబాద్ లో రూ.94 దాటిన లీటర్ పెట్రోల్

దేశంలో పెట్రో బాదుడు ఆగడం లేదు. వరుసగా 12 వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఇవాళ పెట్రోల్ పై 39 పైసలు, డీజిల్ పై 37 పైసలు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 90 రూపాయల 58 పైసలు, లీటర్ డీజిల్ ధర 80 రూపాయల 97 పైసలకు చేరింది. ఈ నెలలో 12 సార్లు రేట్లు పెంచాయి చమురు కంపెనీలు.

అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా ప్రతీ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తున్నాయి చమురు కంపెనీలు. దీంతో ప్రతీ రోజు పెట్రోల్, డీజిల్ రేట్లు మారుతున్నాయి. రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ పై పన్నులు వేర్వేరుగాఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో దాదాపు 15 రోజుల కిందటే ప్రీమియం పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. ఇప్పుడు సాధారణ పెట్రోల్ ధర 100 రూపాయలు దాటింది. ఈ నెల 17న రాజస్థాన్ గంగానగర్ లో 100 రూపాయలు క్రాస్ అయింది. ఆ రోజున లీటర్ పెట్రోల్  100 రూపాయల 13 పైసలు అయింది. ఇప్పుడు రాజస్థాన్ బాటలోనే మరిన్ని రాష్ట్రాలు పయనిస్తున్నాయి. మధ్యప్రదేశ్ అనుప్పూరులో లీటర పెట్రోల్ 100 రూపాయల 96 పైసలు అయింది. డీజిల్ ధర 91 రూపాల 41 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్ 97 రూపాయలు, డీజిల్ 87 రూపాయల 69 పైసలుగా ఉంది. చెన్నైలో పెట్రోల్ 92 రూపాయల 64 పైసలు, డీజిల్ 86 రూపాయలు ఉంది. మన రాష్ట్రంలో 12 రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర మూడు రూపాయలకు పైగానే పెరిగింది. లీటర్ పెట్రోల్ 94 రూపాయల 17 పైసలు, డీజిల్ 88రూపాయల 27 పైసలకు చేరింది.

రోజు రోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో వాహనదారుల జేబుకు చిల్లు పడ్తోంది. ప్రభుత్వం జోక్యం చేసుకొని ధరలు తగ్గించాలని వారు కోరుతున్నారు.