- కేంద్రం అనుమతించిన టార్గెట్ 54 లక్షల టన్నులు పూర్తి
- రాష్ట్రంలో ఈసారి ధాన్యం దిగుబడి 148 లక్షల టన్నులు
- 80 లక్షల టన్నులకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన మంత్రి ఉత్తమ్
- లేఖలో పలు పెండింగ్ అంశాల ప్రస్తావన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం కోటా పూర్తయింది. దీంతో టార్గెట్ పెంచాలంటూ రాష్ట్ర సర్కారు తాజాగా కేంద్రాన్ని కోరింది. వానాకాలం సీజన్‌లో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం కేవలం 54 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు మాత్రమే అనుమతించింది. ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోళ్లపై సివిల్ సప్లయ్ అధికారులతో సీజన్ ప్రారంభానికి ముందు సన్నాహక సమావేశాన్ని నిర్వహించి ఈ మేరకు టార్గెట్ నిర్ణయించింది.
అయితే, ఇప్పటికే కేంద్రం ఇచ్చిన టార్గెట్పూర్తి కావడంతో రాష్ట్ర సర్కారు మరోసారి స్పందించింది. ధాన్యం సేకరణ సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అంశాలపై దృష్టి సారించింది. రాష్ట్రంలో 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లకు అనుమతించాలని తాజాగా రాష్ట్ర సివిల్ సప్లయ్స్శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లెటర్ రాశారు.
కోరింది 80 లక్షల టన్నులు..పర్మిషన్ ఇచ్చింది 54 లక్షలు టన్నులే..
వానాకాలంలో 67.30 లక్షల ఎకరాల్లో వరి సాగైనట్టు వ్యవసాయ శాఖ తన నివేదికలో వెల్లడించింది. ఈ లెక్కన ఎకరానికి సగటున 22 క్వింటాళ్ల ధాన్యం దిగుబడితో 148 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. ఇందులో కేంద్రం ప్రభుత్వం 54 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని ముందు నిర్ణయించింది.
దీనిపై గతంలోనే సివిల్ సప్లయ్ అధికారులు టార్గెట్ పెంచాలని కోరారు. అప్పుడు ఎఫ్‌సీఐ అధికారులు స్పందిస్తూ.. ‘ముందు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయండి.. ఒకవేళ ఇంకా ధాన్యం వస్తే అప్పుడు చూద్దాం’ అని అన్నట్టుగా అధికారులు పేర్కొన్నారు. అయితే, తాజాగా కేంద్రం విధించిన టార్గెట్‌లో 54.80 లక్షల టన్నులు ఇప్పటికే కొనుగోలు చేసింది. దీంతో రైతులు పండించిన మిగిలిన ధాన్యం కొనుగోలు డైలమాగా మారింది.
కేంద్రానికి పక్కా నివేదిక ఇచ్చినా తక్కువకే అనుమతి
రాష్ట్ర సర్కారు పక్కా ప్రణాళికతో వానాకాలం సీజన్‌లో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు అనుమతించాలని కేంద్రానికి నివేదికలు పంపింది. అయినా, కేంద్రం టార్గెట్ తక్కువే ఇచ్చింది. ప్రస్తుత సాగు లెక్కల ప్రకారం 80 లక్షల టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందనే అంచనాలున్నాయి.
రైతులు వానాకాలంలో పండించిన మొత్తం 148 లక్షల టన్నుల ధాన్యంలో 35 లక్షల టన్నులు మిల్లర్లు, వ్యాపారులు ప్రైవేటుగా కొనుగోలు చేసినా, మరో 30 లక్షల టన్నుల నుంచి 33 లక్షల టన్నులు రైతులు తమ అవసరాలకు నిల్వ చేసుకుంటే.. మిగిలిన 80 లక్షల టన్నులు సర్కారు కొనుగోలు చేయాల్సి వస్తుంది.
అలాంటిది.. 54 లక్షలకే పరిమితం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి ఉత్తమ్ వానాకాలం 2025–-26 సీజన్‌లో ధాన్యం సేకరణలో ఎదురవుతున్న ఆర్థిక, కార్యాచరణ సమస్యలను వివరిస్తూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని తక్షణ పరిష్కారం కోరారు. గతంలో చర్చించిన అంశాలను మరోసారి గుర్తు చేస్తూ పలు కీలక అభ్యర్థనలు చేశారు. ముఖ్యంగా గత 2024–-25 వానాకాలం సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీ కాలపరిమితిని 2026 జనవరి 31 వరకు పొడిగించాలని, రైలు రేక్‌ల లభ్యత పెంచాలని కోరారు.
‘‘ప్రస్తుత సీజన్‌లో ధాన్యం సేకరణలో ఎదురవుతున్న సమస్యలు రైతులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే కేంద్ర సహకారం అవసరం’’ అని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి జోషి నుంచి తక్షణ సానుకూల స్పందన రావాలని రాష్ట్ర వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ లెటర్‌తో రాష్ట్ర-కేంద్ర సంబంధాలలో ఆహార భద్రత అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్ర సర్కారుఅభ్యర్థనలు ఇవే..బాయిల్డ్ రైస్ టార్గెట్ పెంచాలి
2024–25 యాసంగి సీజన్‌కు కేంద్రం 35 లక్షల టన్నుల బియ్యం కేటాయించింది. ఇప్పటి వరకు ఎఫ్‌సీఐకి 17.83 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్, 1.13 లక్షల టన్నుల రా రైస్ డెలివరీ చేసింది. మిగిలిన 1.56 లక్షల టన్నుల బాయిల్డ్, 14.01 లక్షల టన్నుల రా రైస్ డెలివరీ పెండింగ్‌లో ఉంది. యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్‌కు అనువుగా ఉండటంతో అదనంగా 10 లక్షల టన్నులు కేటాయించాలని లేఖలో మంత్రి ఉత్తమ్కోరారు.
గత 2024 వానాకాలం ..సీఎంఆర్ డెలివరీ పొడిగించాలి
నవంబర్ 12న ముగిసిన గత 2024 ఏడాది వానాకాలం సీజన్ కు సంబంధించి సీఎంఆర్ డెలివరీ కాలపరిమితిని 2026 జనవరి 31 వరకు పొడిగించాలని, మిల్లర్ల వద్ద మిగిలిన 3.50 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించిన జాయింట్ వెరిఫికేషన్ రిపోర్టును సమర్పించారు. దీనిని వచ్చే నెలాఖరు వరకు పొడిగించాలని కోరారు.
అదనపు రైల్వే రేక్ లు కేటాయించాలి
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 13.5 లక్షల టన్నుల రేక్‌ల లోటు ఏర్పడింది. దీంతో ఎఫ్‌సీఐ గోడౌన్లలో బాయిల్డ్ రైస్ స్టాక్ పేరుకుపోయింది. అదనపు రేక్‌లు కేటాయించి డెలివరీలను వేగవంతం చేయాలని కోరారు.
పెండింగ్ సబ్సిడీలు విడుదల చేయాలి
గత 2014-–15 వానాకాలం సీజన్‌లో అదనపు మిల్ లెవీ రైస్‌కు 6.88 లక్షల టన్నులకు సంబంధించి రూ.1,468.95 కోట్లు, పీఎంజీకేఏవై కింద 2022 ఏప్రిల్‌లో పంపిణీ చేసిన 89,988 టన్నుల బియ్యానికి రూ.343.27 కోట్ల సబ్సిడీలు విడుదల చేయాలని కోరారు. ఈ అంశాలు గత నవంబర్ సమావేశంలో చర్చించినప్పటికీ ఇంకా పరిష్కారం కాలేదని గుర్తు చేశారు.
నిల్వ సామర్థ్యం పెంచాలి
ప్రస్తుతం స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాముల్లో 65 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం ఉంది. ధాన్యం ఉత్పత్తి పెరుగుతున్నా.. నిల్వ పెంచకపోవడంతో సమస్యలు ఎదురవు తున్నాయి. అదనంగా 15 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కల్పించి గోడౌన్లు, సైలోలు నిర్మించాలని కేంద్రాన్ని కోరారు.
