
- 36 వేల మందికి ప్రయోజనం
- సీఎం సమీక్షలో నిర్ణయం
- 60 రోజుల ప్లాన్ 30 రోజులకు కుదింపు.. సెప్టెంబర్ 6 నుంచి అమలు
- ఇకపై పంచాయతీలకు నెలకు రూ. 339 కోట్లు విడుదల
- ఒక్కో గ్రామానికి ఇన్చార్జిగా మండల స్థాయి అధికారి
రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న 36 వేల మంది సఫాయి కార్మికుల జీతాలు పెరగనున్నాయి. ఇప్పటివరకు వారికి నెలకు రూ. 1,000 నుంచి రూ.5,000 వరకు వేతనం దక్కేది. ఇక నుంచి రూ. 8,500 ఇవ్వాలని శుక్రవారం జరిగిన సమీక్షలో సీఎం నిర్ణయించారు. గ్రామాల్లో అమలు చేయాలనుకున్న 60 రోజుల యాక్షన్ ప్లాన్‌ను 30 రోజులకు కుదించారు. దీనిపై వచ్చే నెల 3న ఆయన రాజేంద్రనగర్ లోని తెలంగాణ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో సమావేశం నిర్వహించనున్నారు.
గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సఫాయి కార్మికుల జీతాన్ని పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పటివరకు ఆయా గ్రామ పంచాయతీ ఆర్థిక పరిస్థితిని బట్టి నెలకు రూ. 1000 నుంచి రూ.5000 వరకు వేతనం దక్కేది. ఇక నుంచి వారికి నెలకు రూ. 8,500కు జీతం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కలిపి 36 వేల మంది సఫాయి కార్మికులు పనిచేస్తున్నారు. వారందరికీ జీతం పెంపు ప్రయోజనం దక్కనుంది. సఫాయి కార్మికులు ఇకపై పూర్తి సమయం గ్రామ పంచాయతీ విధులకే కేటాయించాల్సి ఉంటుంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నెల 6 నుంచి అన్ని గ్రామాల్లో 30 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీన్ని తొలుత 60 రోజుల పాటు అమలు చేయాలని భావించినప్పటికీ ఇప్పుడు కుదించారు. గ్రామాల్లో అమలు చేయాల్సిన యాక్షన్ ప్లాన్‌పై శుక్రవారం ప్రగతి భవన్ లో ఏడు గంటల పాటు సీఎం కేసీఆర్ సమీక్షించారు.
యాక్షన్ ప్లాన్ అమలును పర్యవేక్షించేందుకు గ్రామానికి ఒకరు చొప్పున మండలస్థాయి అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖలో అన్ని ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు జత చేసి, నెలకు రూ.339 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలన్నారు. మండల, జిల్లా పరిషత్ లను క్రియాశీలకంగా మార్చేందుకు అవసరమైన సిఫారసులను కలెక్టర్ల నుంచి స్వీకరించి, నిబంధనలు రూపొందించాలని సీఎం నిర్ణయించారు. పచ్చదనం, పరిశుభ్రతతో పల్లెలు వెల్లివిరియాలని, ప్రణాళికా పద్ధతిలో అభివృద్ధి జరగాలని, నియంత్రిత పద్ధతిలో నిధుల వినియోగం జరగాలని, మొత్తంగా ప్రజా భాగస్వామ్యంతో గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పని చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ లక్ష్యం నెరవేర్చడానికి 30 రోజుల యాక్షన్ ప్లాన్ నాంది పలకాలని ఆకాంక్షించారు. మొదట 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించినప్పటినీ, అధికారుల నుంచి వచ్చిన సూచన మేరకు మొదటి దశలో 30 రోజుల పాటు నిర్వహించి, మరో దశ కొనసాగించాలని సీఎం నిర్ణయించారు. ‘‘పంచాయతీ రాజ్ వ్యవస్థలో గ్రామ కార్యదర్శి నుంచి జిల్లా పరిషత్ సిఇవో వరకు అన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నాం. కావాల్సినన్ని నిధులను విడుదల చేస్తున్నాం. అధికారులు, ప్రజా ప్రతినిధుల బాధ్యతలను స్పష్టంగా చట్టం పేర్కొన్నది. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకునే అధికారం కూడా చట్టం కల్పించింది” అని తెలిపారు.
3న సీఎం మీటింగ్
30 రోజుల యాక్షన్ ప్లాన్‌పై పంచాయతీరాజ్ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేసేందుకు వచ్చే నెల 3న మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్ లోని తెలంగాణ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో సీఎం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారులు, కలెక్టర్లతో పాటు డీఎఫ్‌వోలు, జడ్పీ సీఈవోలు, ఎంపీడీవోలు, డీపీవోలు, డీఎల్పీవోలు, ఎంపీవోలను ఆ సమావేశానికి ఆహ్వానించారు. సెప్టెంబర్ 4న అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం జరుగుతుంది. గ్రామాల్లో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేసే అధికారులతో సమావేశమై కలెక్టర్లు తగు సూచనలు చేస్తారు. –