భారీగా నామినేషన్లు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో న్యూస్‌ పేపరంత బ్యాలెట్‌

భారీగా నామినేషన్లు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో న్యూస్‌ పేపరంత బ్యాలెట్‌

గత ఎన్నికలతో పోలిస్తే మూడు రెట్లు పెరిగిన క్యాండిడేట్లు
‘హైదరాబాద్‌’ బరిలో 93 మంది, ‘వరంగల్’ పోటీలో 71 మంది
రెండు చోట్ల భారీగా ఇండిపెండెంట్ల నామినేషన్లు
బ్యాలెట్‌ పేపర్లపై నేడు సీఈవో శశాంక్‌ గోయల్‌ మీటింగ్

హైదరాబాద్‌‌/నల్గొండ, వెలుగు: గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. హైదరాబాద్‌‌–రంగారెడ్డి–మహబూబ్‌‌ నగర్‌‌ స్థానం నుంచి 93 మంది, నల్గొండ–ఖమ్మం–వరంగల్‌‌ సీటు నుంచి 71 మంది పోటీలో ఉన్నారు. క్యాండిడేట్లు పెద్ద సంఖ్యలో పోటీలో ఉండటంతో ఈసారి న్యూస్‌‌ పేపర్‌‌ సైజులో బ్యాలెట్‌‌ పేపర్‌‌ ముద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎన్నికల నిర్వహణపై అధికారులతో సీఈవో శశాంక్‌‌ గోయల్‌‌ శనివారం సమావేశం నిర్వహించనున్నారు. ఒక్కో బ్యాలెట్‌‌ బాక్సులో సాధారణ బ్యాలెట్‌‌ పేపర్లు 300 పడుతాయి. గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీ బ్యాలెట్‌‌ సైజ్‌‌ పెద్దగా ఉండటంతో 250 బ్యాలెట్‌‌ పేపర్లకు మించి ఒక బాక్సులో పట్టే అవకాశాలు లేవు. ఈ ఎన్నికల కోసం పెద్ద సైజు బ్యాలెట్‌‌ బాక్సులు కావాలని ఇప్పటికే సీఈవో ఆఫీసు నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాశారు.

‘హైదరాబాద్‌‌’ సీటులో 80 మంది ఇండిపెండెంట్లు

హైదరాబాద్‌‌–నల్గొండ–మహబూబ్‌‌ నగర్‌‌ సీటు నుంచి గత ఎన్నికల్లో 35 మంది పోటీకి దిగగా.. ఈసారి ఆ సంఖ్య మూడు రెట్లయ్యింది. ఏకంగా 80 మంది ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. ఇక బ్యాలెట్‌‌ పేపర్‌‌లో జి.చిన్నారెడ్డి (కాంగ్రెస్‌‌), ఎన్‌‌.రాంచందర్‌‌రావు (బీజేపీ), ఎల్‌‌.రమణ (టీడీపీ), ఎస్‌‌.వాణీదేవి (టీఆర్‌‌ఎస్‌‌) పేర్లు వరుస క్రమంలో ఉన్నాయి. ప్రొఫెసర్‌‌ నాగేశ్వర్‌‌ పేరు 50వ నంబర్‌‌లో ఉన్నట్టు ఆఫీసర్లు చెప్పారు.

‘వరంగల్‌‌’లో మూడు రెట్లు..

నల్గొండ–ఖమ్మం–వరంగల్‌‌ సీటు నుంచి గత ఎన్నికల్లో 23 మంది పోటీ చేయగా, ఇప్పుడు మూడింతల మంది ఎక్కువగా బరిలో ఉన్నారు. గుర్తింపు పొందిన పార్టీల నుంచి నలుగురు, రిజిస్టర్డ్ పార్టీల నుంచి 12 మంది, ఇండిపెండెంట్లు 55 మంది బరిలో ఉన్నారు. ఇక బ్యాలెట్‌‌ పేపర్‌‌లో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ), బి.జయసారథిరెడ్డి (సీపీఐ), పల్లా రాజేశ్వరరెడ్డి (టీఆర్ఎస్), రాములు నాయక్ (కాంగ్రెస్) పేర్లు వరుసగా ఉన్నాయి. ప్రొఫెసర్ కోదండరాం (7), గోగుల రాణిరుద్రమ రెడ్డి (10), చెరుకు సుధాకర్ (11), తీన్మార్ మల్లన్న (ఇండిపెండెంట్‌‌, సీరియల్ నంబరు 39) వరుస క్రమంలో ఉన్నారు.