రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత

రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత
  • కామారెడ్డి జిల్లా డోంగ్లీలో 5.9 డిగ్రీలు
  • ఉమ్మడి మెదక్​లో ఈ సీజన్​లోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

నెట్​వర్క్,  వెలుగు: రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. రెండుమూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో జనాలు వణికిపోతున్నారు. పొద్దునపూట పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చలి పెరుగుతుండటంతో ప్రభుత్వ హాస్టళ్లలో తలుపులు, కిటికీలు సరిగాలేక, కప్పుకునేందుకు సరిపడా దుప్పట్లు లేక స్టూడెంట్లు తిప్పలు పడుతున్నరు. 

ఆస్తమా, సైనసైటిస్​ వంటి సమస్యలు ఉన్నవాళ్లపై చలికాలం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని, గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిదని మెదక్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్​ చంద్రశేఖర్ సూచిస్తున్నారు. కాగా, కామారెడ్డి జిల్లా డోంగ్లిలో శుక్రవారం ఉదయం టెంపరేచర్ 5.9 డిగ్రీలుగా నమోదైంది. నస్రుల్లాబాద్​ మండలంలో 8.2, భిక్నూర్, దోమకొండ, రామారెడ్డి, సదాశివ నగర్, పిట్లం, గాంధారి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల్లో 9 నుంచి 13.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. సంగారెడ్డి జిల్లా న్యాల్​కల్ లో 6.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్​లో ఉమ్మడి మెదక్​ జిల్లాలో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలోని అనేక ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. ఈశాన్య దిశగా వీస్తున్న గాలులతో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో టెంపరేచర్లు​10 నుంచి 13 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి.