సర్కారు భవనాల్లోకి అద్దె బడులు!..జనవరి నెలాఖరుకల్లా షిఫ్ట్ చేయండి..విద్యాశాఖ ఆదేశం

సర్కారు భవనాల్లోకి అద్దె బడులు!..జనవరి నెలాఖరుకల్లా షిఫ్ట్  చేయండి..విద్యాశాఖ ఆదేశం
  • 155 గవర్నమెంట్ స్కూళ్లు కిరాయి ఇండ్లలోనే 
  • అందులో 105 హైదరాబాద్ జిల్లాలోనే
  • జనవరి నెలాఖరుకల్లా షిఫ్ట్  చేయాలని డైరెక్టరేట్ ఆదేశం 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న గవర్నమెంట్  స్కూళ్లను తక్షణం ఖాళీ చేయించేందుకు స్కూల్  ఎడ్యుకేషన్  అధికారులు సిద్ధమయ్యారు. ఏళ్ల తరబడి కిరాయి భవనాల్లో నడుస్తున్న బడులకు చెక్  పెడుతూ.. జనవరి నెలాఖరుకల్లా వాటిని ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని స్కూల్  ఎడ్యుకేషన్  డైరెక్టరేట్  ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా ప్రత్యామ్నాయ భవనాలను సిద్ధం చేయాలని ఆయా డీఈఓలకు స్పష్టం చేసింది. 

రాష్ట్రంలోని 16 జిల్లాల్లో మొత్తం 155 గవర్నమెంట్  స్కూళ్లు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇందులో సింహభాగం రాజధానిలోనే ఉన్నాయి. హైదరాబాద్  జిల్లాలోనే అత్యధికంగా 105 పాఠశాలలు కిరాయి భవనాల్లో నడుస్తుండగా.. మిగిలిన 15 జిల్లాల్లో 50 స్కూళ్లు ఉన్నాయి. ఇప్పటికే జనవరి 31 లోగా అద్దె భవనాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేసి, ఖాళీగా ఉన్న సర్కారు భవనాల్లోకి షిఫ్ట్ కావాలని సర్కారు ఆదేశించింది. 

దీనికి అనుగుణంగానే స్కూల్  ఎడ్యుకేషన్  అధికారులు చర్యలు చేపట్టారు. ఆయా బడులను దగ్గరలోని సర్కారు భవనాల్లోకి లేదా దగ్గర్లోని బడుల్లో ఖాళీగా గదులు ఉంటే వాటిలో షిఫ్ట్  చేసే యోచనలో జిల్లా అధికారులున్నారు. దీని ద్వారా ప్రభుత్వంపై అద్దె భారం బాగా తగ్గనున్నది. 

లోకల్ బాడీ స్కూళ్లు మరో వంద?

కేవలం గవర్నమెంట్  స్కూళ్లలోనే కాకుండా.. జిల్లా పరిషత్, మండల పరిషత్  పరిధిలోని లోకల్ బాడీ స్కూళ్లు కూడా కొన్ని జిల్లాల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని  అధికారులు చెప్తున్నారు. సుమారు 75 నుంచి వంద వరకూ ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అయితే, అవి  జిల్లా పరిషత్  ఆధీనంలో ఉండటంతో వాటి వివరాలను  విద్యా శాఖ అధికారులు సేకరిస్తున్నారు. వాటిని కూడా సొంత భవనాల్లోకి లేదా ప్రత్యామ్నాయ సర్కారు స్థలాల్లోకి మార్చే యోచనలో ఉన్నారు.

డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి గురుకుల సొసైటీ.. 

ప్రస్తుతం నాంపల్లిలో తెలంగాణ రెసిడెన్షియల్  ఎడ్యుకేషనల్  ఇన్ స్టిట్యూషన్స్  సొసైటీ (టీఆర్​ఈఐఎస్) ప్రధాన కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. సర్కారు ఆదేశంతో దీన్ని సైఫాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని స్కూల్ ఎడ్యుకేషన్  డైరెక్టరేట్  కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి మార్చాలని యోచిస్తున్నారు. ఒకే ప్రాంగణంలో విద్యా శాఖ విభాగాలు ఉంటే పర్యవేక్షణ సులభమవడంతో పాటు అద్దె కూడా ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు.