- యెస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఆర్‌బీఎల్‌లోకి భారీగా వచ్చిన ఇన్వెస్ట్‌మెంట్లు
- ఇన్సూరెన్స్‌లో 100 శాతం ఎఫ్‌డీఐతో మరిన్ని అవకాశాలు
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ సెక్టార్‌కు 2025 బాగా కలిసొచ్చింది. ఇండియాలోని ఫైనాన్షియల్ కంపెనీలు, బ్యాంకులలో వాటాలను కొనుగోలు చేయడానికి విదేశీ ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. ఈ ఏడాది బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) సెక్టార్‌లోకి సుమారు 15 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.34 లక్షల కోట్ల) విదేశీ పెట్టుబడులు వచ్చాయి.
విదేశీ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లు, సావరిన్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారు. జపనీస్ ఫైనాన్షియల్ కంపెనీ మిత్సుబిషి యూఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్ , శ్రీరామ్ ఫైనాన్స్‌లో 20శాతం వాటా కోసం 4.4 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది.
ఎమిరేట్స్ ఎన్‌బీడీ ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో 60శాతం నియంత్రణ వాటా కొనుగోలు చేయగా, యెస్ బ్యాంక్‌లో 25 శాతం వాటాను సుమిటోమో మిత్సుయి దక్కించుకుంది. ఈ డీల్స్‌ను చూస్తే భారత ఆర్థిక వ్యవస్థపై గ్లోబల్‌గా నమ్మకం పెరుగుతోందని అర్థమవుతుంది.
అప్పులివ్వడం పెరిగింది..
భారతదేశంలో క్రెడిట్ డిమాండ్ (అప్పులివ్వడం) వేగంగా పెరుగుతోంది. వినియోగం ఊపందుకోవడం, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎస్‌ఎంఈలు) ఫార్మలైజ్ అవ్వడం, డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ పెరగడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఖర్చులు ఎక్కువవ్వడంతో ఫైనాన్షియల్ కంపెనీలకు ఫుల్ డిమాండ్ ఉంది. బ్యాంకులు బ్యాలెన్స్ షీట్లు బాగుండడం కూడా కలిసొస్తోంది.
2026లోనూ దూకుడు?
ఈ ఏడాది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ బజాజ్ అలియాంజ్‌లో అలియాంజ్ వాటాను బజాజ్ గ్రూప్ కొనుగోలు చేసింది. బ్లాక్‌స్టోన్, వార్‌బర్గ్ పింకస్, ఏడీఐఏ, బెయిన్ క్యాపిటల్ వంటి ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లు, సావరిన్ ఫండ్లు ఫెడరల్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, మణప్పురం ఫైనాన్స్ వంటి సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. కొత్త సంవత్సరంలో కూడా బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్‌లోకి భారీగా ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్లు వస్తాయని, రెగ్యులేటరీ అడ్డంకులు తగ్గడమే కారణమని ఎనలిస్టులు పేర్కొన్నారు.
ఆర్‌బీఐ విదేశీ యాజమాన్యం, గవర్నెన్స్ నిబంధనలపై స్పష్టత ఇవ్వడం, పారదర్శకత పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచిందన్నారు. రిటైల్, ఎస్‌ఎంఈ లెండింగ్, టెక్నాలజీ, ప్రొడక్ట్ ఇన్నోవేషన్ వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, కన్సాలిడేషన్ పెరిగి, బలమైన సంస్థలు ముందుకు రావచ్చని అభిప్రాయపడ్డారు. ఇన్సూరెన్స్‌లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎఫ్‌డీఐ) పరిమితిని 100 శాతానికి కేంద్రం పెంచింది. దీంతో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించొచ్చని తెలిపారు.
