- ఈ ఏడాది పాలమూరు జిల్లాలో
- 5,662 కేసులు నమోదు
- గద్వాల జిల్లాలో 2,410 కేసులు
- 2025 పోలీసు శాఖ వార్షిక నివేదికలను వెల్లడించిన
- ఆయా జిల్లాల ఎస్పీలు డి.జానకి, శ్రీనివాసరావు
మహబూబ్‌నగర్ అర్బన్, గద్వాల్, వెలుగు : గతేడాదితో పోలిస్తే ఈసారి మహబూబ్‌నగర్, గద్వాల్ జిల్లాల్లో క్రైమ్ రేట్ తగ్గింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 5 శాతం, గద్వాల జిల్లాలో 11 శాతం తగ్గింది. ఆయా జిల్లాల పోలీస్ శాఖ 2025 వార్షిక నివేదికలను విడుదల చేసింది.
మహబూబ్‌నగర్ జిల్లాలో..
నిరుటితో పోలిస్తే ఈ ఏడాది మహబూబ్నగర్జిల్లాలో క్రైమ్‌రేట్ ఐదు శాతం తగ్గిందని ఎస్పీ డి.జానకి తెలిపారు. నగరంలోని జిల్లా పోలీస్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం పోలీస్ శాఖకు సంబంధించిన 2025 సంవత్సర వార్షిక నివేదికను ఎస్పీ విడుదల చేశారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా రోజూవారీ విధులతోపాటు ప్రకృతి విపత్తుల సమయంలో కూడా ప్రజలకు నిరంతర సేవలు అందించారని గుర్తుచేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కఠిన భద్రతా చర్యలు చేపట్టి ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సక్సెస్ అయ్యామన్నారు. మహిళలు, బాలికల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ షీ టీమ్స్, పోలీసు సురక్షా కళా బృందం, భరోసా కేంద్రం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
'ప్రజా భద్రత పోలీసు బాధ్యత' అనే నినాదంతో గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు, కళాశాలల్లో ప్రజలకు అవగాహన కల్పించామని తెలిపారు. నేర నియంత్రణలో భాగంగా 2024లో 5,937 కేసులు నమోదు కాగా, 2025లో 5,662 కేసులు నమోదయ్యాయన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు 2024లో 9,252 కాగా, ఈ ఏడాది 11,775 దరఖాస్తులను స్వీకరించి చర్యలు తీసుకున్నామని వివరించారు.
ఆయా కేసుల వివరాలు ఇలా..
సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల భాగంగా నిర్వహించిన ఎన్నికల తనిఖీల్లో రూ.11,08,250 క్యాష్, 1050.23 లీటర్ల లిక్కర్(విలువ రూ.6,93,858)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.7,200 విలువైన ఉచితాల పంపిణీ సామగ్రి పట్టుకున్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి తొమ్మిది కేసులు నమోదు చేసి, 458 మెమోలు జారీ చేశారు. 640 మందిని బైండోవర్ చేశారు. 73 నాకాబందీ ఆపరేషన్లతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
భరోసా కేంద్రంలో 168 కేసులు నమోదు కాగా, 119 కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించారు. సీఐఆర్పోర్టల్ ద్వారా 1,173 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. 'ఆపరేషన్ స్మైల్', 'ఆపరేషన్ ముస్కాన్' కార్యక్రమాల ద్వారా 1,059 మంది బాలురు, 17 మంది బాలికలను బాల కార్మికులుగా విముక్తి కల్పించారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా 1,608 ఎఫ్ఐఆర్ కేసులు, 2739 డీడీ, మోటారు వాహన చట్టం కేసులు సహా సహా మొత్తం 10,431 కేసులు పరిష్కరించబడ్డాయి.
ఆస్తి నేరాల రికవరీ 29.85% నుంచి 46.89%కు పెరిగింది. 2025లో 327 ఆస్తి నేర కేసులు నమోదు కాగా, 215 మందిని అరెస్ట్ చేశారు. రూ.99,83,318 విలువైన ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా 2025లో 1,475 దరఖాస్తులు స్వీకరించి 220 కేసులు నమోదు చేశారు. రూ.2,18,17,758 నష్టం జరగగా, రూ.1,98,79,364 విలువైన మొత్తాన్ని బాధితులకు తిరిగి అందించారు. గంజాయి అక్రమ రవాణాపై 32 మందిని అరెస్ట్ చేసి 11.850 కిలోల గంజాయి, 22 కిలోల ఆల్ఫాజోలం (విలువ రూ.15,23,125) స్వాధీనం చేసుకున్నారు.
పెరిగిన రోడ్డు ప్రమాదాలు..
నిరుడుకంటే ఈ ఏడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు 2024లో 235 కాగా.. ఈ ఏడాది 231 అయ్యాయి. ప్రాణాంతకం కాని ప్రమాదాలు 2024లో 255 కాగా, ఈసారి 286, నేషనల్ హైవేలపై 2024లో 425 యాక్సిడెంట్లు కాగా.. ఈసారి 475కు పెరిగాయి. ఇతర రోడ్డు రహదారుల్లో ప్రమాదాలు 2024లో 140 జరుగగా.. ఈ ఏడాది 155 యాక్సిడెంట్లు అయ్యాయి. ఆయా రోడ్డు ప్రమాదాల్లో మొత్తం నిరుడు 1,055 జరుగగా.. ఈ ఏడాది 1,103 నమోదయ్యాయి.
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు..
ఈ ఏడాది పోలీసులు డ్రంక్అండ్ డ్రైవ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. నిరుడు 2,578 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 3,245 నమోదు అయ్యాయి. 2024లో రూ.28,94,085 జరిమానా విధించగా, ఈసారి రూ.32,59,386 జరిమానా విధించారు. నిరుడు ఐదు మందికి జైలు శిక్షలు విధించగా.. ఈ ఏడాది 21 మందికి జైలు శిక్షలు విధించారు.
గద్వాల జిల్లాలోనూ తగింది..
గద్వాల, వెలుగు : జిల్లాలో గతేడాది కంటే ఈసారి క్రైమ్ రేటు తగ్గిందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఎస్పీ ఆఫీస్ లో జిల్లా పోలీస్ వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 2024లో మొత్తం 2073 కేసులు నమోదు కాగా, 2025 లో 2,410 కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. నేరాల రేటు సుమారు 11 శాతం తగ్గిందన్నారు.
ప్రజల నుంచి గతేడాది 6,359 ఫిర్యాదులు రాగా, ఈసారి 5,270 దరఖాస్తులు స్వీకరించారు. షీ టీమ్స్, పోలీస్ కళాబృందం, భరోసా కేంద్రం ద్వారా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 2024లో రోడ్డు ప్రమాదాలు 207 కాగా, 2025లో 204 కు తగ్గాయి. 2024లో రోడ్డు ప్రమాదాల్లో 133 మంది మృతి చెందగా, 2025 మంది మరణించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో 2025లో 7,056 కేసులు నమోదు చేయగా, 2024లో కేవలం 3,206 కేసులు నమోదయ్యాయి. 2025లో 33,96,060 జరిమానాలు విధించగా, 2024లో రూ.32,06,000 జరిమానా విధించారు. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా 2025లో 602 దరఖాస్తుల స్వీకరించి 92 కేసులు నమోదు చేశారు. మొత్తం నష్టం2,60,36,503 జరగగా, అందులో 47,62,561 తిరిగి ఫిర్యాదుదారులకు అందజేశారు. ఏడాది 2100 మొబైల్ ఫోన్లు బాధితులకు అందించారు.
ఆస్తి నేరాల రికవరీ శాతం 32 శాతం నుంచి 67 శాతానికి పెరిగింది. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాల ద్వారా 97 మంది బాలురు, 19 మంది బాలికలకు విముక్తి కల్పించారు. 2025లో ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు, పోక్సో కేసులో ఒకరికి 35 ఏళ్ల శిక్ష, మరొకరికి 25 ఏళ్ల శిక్ష, వరకట్న వేధింపుల కేసులో ఒకరికి ఏండేండ్ల శిక్షతోపాటు పలువురికి వివిధ కేసుల్లో శిక్షలు
విధించారు.
