మేడారంలో భక్తుల రద్దీ..వరుస సెలవులతో భారీగా తరలివస్తున్న జనం

మేడారంలో భక్తుల రద్దీ..వరుస సెలవులతో భారీగా తరలివస్తున్న జనం
  • ముందస్తు మొక్కులకు బారులు..బందోబస్తు చర్యల్లో అధికారులు

మేడారం వన దేవతల చెంత భక్తుల రద్దీ పెరిగింది. వరసగా సెలవులు కావడంతో జనం భారీగా తరలివస్తున్నారు. దీంతో సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల ముందస్తు మొక్కుల కోసం శుక్రవారం భక్తులు బారులు తీరడంతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. తలనీలాలు సమర్పించుకొని ఎత్తు బెల్లం (బంగారం) ఎత్తుకొని గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. పసుపు, కుంకుమ చీరె, సారె, గాజులు, పూలు, పండ్లు, గద్దల వద్ద సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అనంతరం మేడారం చుట్టుపక్క ప్రాంతాల్లోని వనంలోకి వెళ్లి వంటావార్పు చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రోజంతా సంతోషంగా గడిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీస్ అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. మేడారం రోడ్డు, తల్లుల గద్దెలు, జంపన్న వాగు, తదితర ప్రాంతాలు భక్తులతో నిండిపోయి ఉండడంతో ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు రద్దీ కొనసాగింది. - తాడ్వాయి, వెలుగు