కరోనాతో పెరిగిన మందుల వినియోగం

కరోనాతో పెరిగిన మందుల వినియోగం
  • ​మెడికల్ షాపులు 26 వేల నుంచి 35 వేలకు జంప్‌‌‌‌
  • స్టోర్ల సంఖ్య పెంచుతున్న కార్పొరేట్‌‌‌‌ కంపెనీలు.. ఆన్‌‌‌‌లైన్ మెడిసిన్‌‌‌‌ డెలివరీకి డిమాండ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మెడికల్ షాపుల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన రెండేండ్లలోనే 9 వేల షాపులు కొత్తగా పుట్టుకొచ్చాయి. కరోనా మహమ్మారి కారణంగా మందుల వినియోగం విచ్చలవిడిగా పెరగడమే ఇందుకు కారణమని, ఈ స్థాయిలో ఇంతకు ముందెన్నడూ మెడికల్ షాపులు రిజిస్టర్ కాలేదని డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆఫీసర్లు చెప్తున్నారు. కరోనాకు ముందు మన రాష్ట్రంలో 26 వేల మెడికల్ షాపులు ఉంటే, ఇప్పుడు వాటి సంఖ్య 35 వేలకు పెరిగాయి. హైదరాబాద్ నుంచి ములుగు వరకూ ప్రతి జిల్లాల్లోనూ కొత్త ఫార్మసీలు ఏర్పాటయ్యాయి. కరోనా వైరస్‌‌‌‌ ఎంటర్ అయినప్పటి నుంచి, ప్రతి ఇంట్లోనూ విటమిన్ ట్యాబ్లెట్లు, పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్‌‌‌‌ యూసేజ్ పెరిగింది. రోగం రాకముందే మెడిసిన్‌‌‌‌ కొని వేసుకుంటున్నారు. లాక్‌‌‌‌డౌన్ కారణంగా మిగిలిన వ్యాపారాలన్నీ దెబ్బతిన్నా, మెడికల్ రంగం మాత్రం లాభపడింది. కొత్త మెడికల్ షాపులతో పాటు కొత్త దవాఖాన్లు కూడా అందుబాటులోకి వచ్చినయి.
డెలివరీకి డిమాండ్..
కరోనాకు మునుపు అంతంత మాత్రంగా ఉన్న మెడిసిన్ హోమ్ డెలివరీ బిజినెస్‌‌‌‌, కరోనా తర్వాత విపరీతంగా పుంజుకుంది. హైదరాబాద్‌‌‌‌, కరీంనగర్, వరంగల్ వంటి సిటీల్లో ఆన్‌‌‌‌లైన్ మెడిసిన్ బుకింగ్స్ ఎక్కువగా జరగుతున్నాయి. చిన్న పట్టణాలు, మున్సిపాలిటీలు, గ్రామస్థాయి వరకూ మెడిసిన్స్​డెలివరీ చేసే సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఈ ఆన్‌‌‌‌లైన్ బిజినెస్‌‌‌‌ను ఫార్మసిస్టులు వ్యతిరేకిస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకపోయినా మెడిసిన్ డెలివరీ చేయడాన్ని తప్పుబడుతున్నారు. వాస్తవానికి షెడ్యూల్డ్ డ్రగ్స్‌‌‌‌ను ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడం నేరం. ఇప్పటికే రాష్ట్రంలో డ్రగ్స్‌‌‌‌ వినియోగం విచ్చలవిడిగా పెరిగింది. మెడిసిన్ కొనుగోలు చేసి, వాటిని డ్రగ్స్‌‌‌‌గా తయారు చేసే ముఠాలు కూడా తయారయ్యాయి. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ మెడిసిన్ డెలివరీపై ఇప్పటికైనా నిఘా పెట్టకపోతే, డ్రగ్స్‌‌‌‌ వినియోగం మరింత పెరిగే ప్రమాదముందని ఫార్మసిస్టులు హెచ్చరిస్తున్నారు.
గొలుసు కట్టుతో బేజారు..
కార్పొరేట్ కంపెనీలు కూడా తమ ఫార్మసీ స్టోర్ల సంఖ్యను పెంచుతున్నాయి. ప్రతి కిలోమీటర్‌‌‌‌‌‌‌‌కు ఓ ఫార్మసీ పెట్టే లక్ష్యంగా ముందుకు పోతున్నట్టు అపోలో ప్రకటించింది. మెడ్ ప్లస్‌‌‌‌ కూడా తన స్టోర్ల సంఖ్యను పెంచనున్నట్టు ప్రకటించింది. ఫార్మసీ రంగంలో కార్పొరేట్ ఎంట్రీతో తమ ఉపాధి దెబ్బతింటోందని ఫార్మసిస్టులు చెబుతున్నారు. డ్రగ్ కంట్రోల్ అథారిటీ నియమాల ప్రకారం ప్రతి ఫార్మసీలో రిజిస్టర్డ్‌‌‌‌ ఫార్మసిస్టు ఉండాలి. 16 గంటలు నడిచే ఫార్మసీల్లో, 24 గంటలు నడిచే ఫార్మసీల్లో ముగ్గురు ఫార్మసిస్టులు ఉండాలి. కానీ, ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. ఫార్మసీ స్టోర్లను నడుపుతున్న కార్పొరేట్ సంస్థలు రెండు లేదా మూడు స్టోర్లకు కలిపి ఒకరిద్దరు ఫార్మసిస్టులను పెడుతున్నాయి. తక్కువ వేతనాలకు పనిచేసే నాన్ ఫార్మసిస్టులను తమ స్టోర్లలో నియమించుకుంటున్నాయి. నాన్ ఫార్మసిస్టులకు ఇచ్చినట్టుగా, అరకొర వేతనాలకు పనిచేసే ఫార్మసిస్టులకు మాత్రమే అవకాశమిస్తున్నాయి. అర్హతకు తగ్గ వేతనం కోరుకుంటే, ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నయి. మరోవైపు తమ ఫార్మసీలపై సోషల్ మీడియాలో, టీవీల్లో విపరీతంగా యాడ్స్ ఇస్తూ బిజినెస్‌‌‌‌ను కార్పొరేట్ కంపెనీలు విపరీతంగా ప్రమోట్ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సొంతంగా మెడికల్ షాపులు పెట్టి నడపలేక, ఉద్యోగాలు దొరక్క ఫార్మసిస్టులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో సుమారు లక్షమంది ఫార్మసిస్టులు ఉన్నట్లు అంచనా.