చార్జీలు పెంచినా బస్సులు పెంచట్లే!

చార్జీలు పెంచినా బస్సులు పెంచట్లే!

మహబూబాబాద్, వెలుగు: బీటీ రోడ్లు ఉన్నా బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నాళ్లు ఆర్టీసీ నష్టాల్లో ఉండడం వల్లే బస్సులు నిలిపివేశామని చెప్పిన ఆఫీసర్లు.. ఇటీవల చార్జీలు పెంచినా బస్సులు పునరుద్ధరించడం లేదు. ఇప్పటికే స్కూళ్లు ప్రారంభం కాగా, కొద్దిరోజుల్లో కాలేజీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమ ఊర్లకు బస్సులు పంపాలని పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయి.

లాభాల రూట్ల వైపే మొగ్గు..
ఆర్టీసీ గతంలో మారుమూల గ్రామాలకూ బస్సులు నడిపేది. తక్కువ చార్జీలతోనే ఎక్కువ దూరం ప్రయాణించేవారు. కొద్ది నెలల కింద ఆర్టీసీ ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడంతో గ్రామాలకు బస్సులు బంద్ పెట్టింది. ఆఫీసర్ల ద్వారా అంతర్గత సర్వే నిర్వహించి, నష్టాలు వచ్చే రూట్లకు బస్సులు నిలిపివేసింది. దీంతో స్టూడెంట్లు, ప్రజలు ఎటైనా వెళ్లాలంటే ఆటోలనే ఆశ్రయించాల్సిన వస్తోంది. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, మంది అయ్యేదాక కదలకపోవడంతో తిప్పలు పడుతున్నారు. చాలా గ్రామాలకు బీటీ రోడ్లు ఉన్నా.. బస్సులు మాత్రం రావడం లేదు. కొన్ని తండాల్లో ఆటోలు కూడా లేక కాలినడకన మండలకేంద్రాలకు చేరుకుంటున్నారు.

ఆగిన రూట్లు..
గూడూరు నుంచి నెక్కొండకు బస్సు సౌకర్యం లేదు. అలాగే కొత్తగూడ మండలకేంద్రం నుంచి బత్తులపల్లి మీదుగా తాటివారివేంపల్లి, కార్లాయి గ్రామాలకు గతంలో బస్సు ఉండేది. ప్రస్తుతం ఈ రూట్​లో నడపడం లేదు. గూడూరు నుంచి నెక్కొండ వయా మదనపురం, గాజులగట్టు,  గుండెంగ, నెక్కొండకు బస్సు బంద్ అయింది. నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లి, చిన్నముప్పారం, బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామాలకు బస్సుల లేదు. కేసముద్రం మండలంలో నారాయణపురం, చిన్నగూడూరు మండలం జయరాం, మహబూబాబాద్ మండలం మల్యాల, మాధవాపురం గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. నిత్యం రద్దీగా ఉండే డోర్నకల్ మండలం వయా వెన్నారం నుంచి ఖమ్మం వరకు ఒక్క ట్రిప్ మాత్రమే నడుపుతున్నారు. కురవి మండలం నుంచి వయా తట్టుపల్లి, నేరడకు కూడా ఒక్క ట్రిప్పే వస్తుంది. మహబూబాబాద్ నుంచి సాలార్ తండా, మొగిలిచర్ల, రాజోలు, బలపాల, గోల్లచర్ల మీదుగా డోర్నకల్ వరకు కూడా ఇదే పరిస్థితి. ఒక్క రూట్​వల్ల పోయేందుకు వీలుగా ఉన్నా.. వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నర్సింహులపేట మండల కేంద్రం నుంచి తొర్రూరు వయా కొమ్ముల వంచ వరకు... తొర్రూరు మండలంలోని కంఠాయపాలెం గ్రామానికి గతంలో బస్సులు ఉండేవి. ప్రస్తుతం బస్సులు రావడం లేదు.గూడూర్​ మండల కేంద్రం నుంచి వయా గుండెంగ నుంచి నెక్కొండ మండలానికి రోజూ ఉదయం,  మధ్యాహ్నం, సాయంత్రం 3 ట్రిప్పుల బస్సు నడిచేది. రెండేళ్లుగా బంద్ చేశారు. ఆ రూట్లో గతంలో సింగిల్​ రోడ్డు ఉండేది. ప్రస్తుతం డబుల్​ రోడ్డు వేశారు. అయినా  బస్సులు లేక ప్రయాణికులు ప్రైవేటు వెహికల్స్​పై వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారు. రఘునాథ్​పల్లి మండలంలో కోడూర్​, కంచనపల్లి మీదుగా  తొర్రూర్​డిపోకు చెందిన బస్సు ఒకటి ఉదయం 9 గంటలకు హైదరాబాద్​కు  వెళ్లేది. రామన్నగూడెం, కోడూర్, గబ్బెట, కంచనపల్లి గ్రామాల నుంచి జనగామ జిల్లా కేంద్రంలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 150 నుంచి 200 వరకు  జనగామ జిల్లా కేంద్రానికి వెళ్తుంటారు. గతంలో ఎమ్మెల్యే రాజయ్యకు విన్నవిస్తే బస్సును ప్రారంభించినా అదీ మూణ్ణాళ్ల ముచ్చటగానే మారింది. ఈ రూట్​లో బస్సు నడవడం లేదు.ఎల్కతుర్తి మండలంలోని తిమ్మాపూర్​, కేశవాపూర్​ గ్రామాలకు హన్మకొండ లోకల్ డిపో నుంచి గతంలో ఓ సర్వీస్​ను 3 ట్రిప్పులు నడిపేవారు. తిమ్మాపూర్, హసన్​పర్తి మండలంలోని సీతంపేట గ్రామాల మధ్య రోడ్డు  అధ్వానంగా మారడంతో ఏడాది నుంచి సర్వీస్​  నిలిపేశారు. చిన్న గూడూర్​ మండలానికి జిల్లా కేంద్రం నుంచి వచ్చే బస్సు సర్వీస్​  గత కొన్ని రోజులుగా బంద్​ చేశారు. వరంగల్​ జిల్లా రాయపర్తి మండలంలోని కొలనుపల్లి, కొండూర్, రాయపర్తి మీదుగా హైదరాబాద్, అన్నారం బస్సు నడిచేది. కొంత కాలం క్రితం నిలిపివేసిన ఆఫీసర్లు, త్వరలో పునరుద్దరిస్తామని చెప్తున్నారు. -వరంగల్​ జిల్లా నర్సంపేట నుంచి  నెక్కొండ, పర్వతగిరి మీదుగా వర్ధన్నపేటకు బస్సు సర్వీస్​ నడిచేది. సుమారు  ఐదేళ్ల కింద  నిలిపేశారు. ఈ రూట్లో సర్వీస్​ లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్​వెహికల్స్​లో  ప్రయాణించాల్సి వస్తుంది.స్టేషన్​ఘన్​పూర్​ నుంచి తాటికొండకు 12 కిలో మీటర్లు. జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు స్టేషన్​ఘన్​పూర్​ నుంచి తాటికొండకు  రోజూ ఉదయం 7.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు 5 ట్రిప్పులు నడిచేది. ప్రయాణికులు ఎక్కువగా ఈ రూట్లో ప్రయాణిస్తలేరని ఆర్టీసీ కి నష్టం వస్తుందన్న సాకుతో 2 నెలల కింద  బస్సును రద్దు చేశారు. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

పిల్లలు ఇబ్బంది పడుతున్నరు
మా ఊర్లో ప్రైమరీ స్కూల్ మాత్రమే ఉంది. హైస్కూల్, కాలేజీలకు వెళ్లాలంటే కొత్తగూడ(15 కి.మీ) లేదా నర్సంపేట(36 కి.మీ) పోవాలి. బస్సు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నరు. ఆటోలో వెళ్తే టైంకు చేరుకుంటలేరు. అంతదూరం పోలేక కొందరు చదువు మానేస్తున్నరు. ఆర్టీసీ డీఎంకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లే
- బలిదే శ్రీనివాస్, కార్లాయి, కొత్తగూడ మండలం

సర్వీసులు పునరుద్ధరిస్తాం
నష్టాలు రావడం వల్లే కొన్ని రూట్లలో బస్సులు బంద్ పెట్టినం. ప్రజల నుంచి వినతులు వస్తే, పరిగణలోకి తీసుకుని బస్సులు వేస్తాం. ఆర్టీసీని ప్రజలు ఆదరిస్తే మేం కూడా సర్వీసులు కొనసాగిస్తాం.
- కన్నం రమేశ్​బాబు, తొర్రూరు ఆర్టీసీ డీఎం