ప్రాజెక్టుల్లో పెరిగిన విద్యుత్ ఉత్పత్తి

ప్రాజెక్టుల్లో పెరిగిన విద్యుత్ ఉత్పత్తి
  • రోజూ 31 ఎంయూల పవర్ జనరేషన్ 
  • అత్యధికంగా శ్రీశైలంలో 17.45 ఎంయూలు 
  • మిగతా ప్రాజెక్టుల్లోనూ పెరిగిన విద్యుత్ ఉత్పత్తి   
  •  ఏప్రిల్ నుంచి 770 ఎంయూల కరెంట్ 

హైదరాబాద్ :  కృష్ణానది వరద క్రమంగా పెరుగుతుండడంతో జలవిద్యుత్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి జోరుగా సాగుతోంది. కర్నాటకలోనూ భారీగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. పైనుంచి వచ్చిన నీళ్లను వచ్చినట్లుగా కిందికి  వదులుతున్నారు. దీంతో మన రాష్ట్రంలోని కృష్ణా ప్రాజెక్టులపై కరెంట్ ఉత్పత్తి భారీగా పెరిగింది. ప్రియదర్శిని జూరాల, లోయర్‌‌‌‌‌‌‌‌ జూరాల, శ్రీశైలం ఎడమ గట్టు, నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌, నాగార్జున సాగర్‌‌‌‌‌‌‌‌ లెఫ్ట్‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌, పులిచింతల, సింగూరు, నిజాంసాగర్‌‌‌‌‌‌‌‌, పోచంపాడు, పెద్దపల్లి మినీ హైడ్రో, పాలేరు మినీ ప్రాజెక్టులో కరెంట్ ఉత్పత్తి జరుగుతోంది. దీంతో రాష్ట్రంలో హైడల్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులన్నింటి నుంచి రోజుకు 31 ఎంయూలకుపైగా పవర్ జనరేషన్ అవుతోంది.   

శ్రీశైలం నుంచే సగం కరెంట్ 
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జల విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు1.58 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. విద్యుత్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి కోసం 68 వేల క్యూ సెక్కులకుపైగా నీటిని పవర్‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌ ద్వారా కిందికి వదులుతున్నారు. దీంతో శ్రీశైలంలో అత్యధికంగా రోజుకు17.45 మిలియన్‌‌‌‌‌‌‌‌ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతోంది. జులై నెలలో అన్ని హైడల్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ల్లో కలిపి 479.8 ఎంయూల కరెంట్ ఉత్పత్తి అయింది. ఇందులో ఒక్క శ్రీశైలం నుంచే 259.5 ఎంయూలు ఉత్పత్తి చేశారు. రాష్ట్రంలో తయారవుతున్న హైడల్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌లో 54 శాతం అంటే సగానికి పైగా శ్రీశైలం నుంచే వస్తోంది. ఈ నెలలో బుధవారం నాటికే మూడు రోజుల్లో అన్ని ప్రాజెక్టుల్లో కలిపి 94.10 ఎంయూల కరెంట్ ఉత్పత్తి కాగా, ఇందులో శ్రీశైలం నుంచి 51.30 ఎంయూల కరెంట్‌‌‌‌‌‌‌‌ జనరేట్‌‌‌‌‌‌‌‌ అయింది. ఇక జెన్ కోకు కరెంట్ ఉత్పత్తి ద్వారా రోజుకు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల ఆదాయం వస్తోంది.    

మిగతా ప్రాజెక్టుల నుంచి తక్కువే 
రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల్లో కలిపి 2,440 మెగావాట్ల జలవిద్యుత్ సామర్థ్యం ఉంది. అయితే, శ్రీశైలం మినహా మిగతా ప్రాజెక్టుల కెపాసిటీ చాలా తక్కువగా ఉంది. అప్పర్ జూరాలలో 4.80 ఎంయూలు, లోయర్ జూరాలలో  4.78 ఎంయూలు, నాగార్జున సాగర్​లో 2.45 ఎంయూల కరెంట్ ఉత్పత్తి అవుతోంది. మిగతా ప్రాజెక్టుల నుంచి ఇంతకంటే చాలా తక్కువే జల విద్యుత్ వస్తోంది.

ఏప్రిల్ నుంచి 770 ఎంయూలు   
రాష్ట్రంలో గత ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నెలలో 71.8, మే నెలలో 46.6,  జూన్‌‌‌‌‌‌‌‌లో 77.7 ఎంయూల కరెంటు ఉత్పత్తి జరిగింది. జులై నుంచి వర్షాలు స్టార్ట్‌‌‌‌‌‌‌‌ అయినా13వ తేదీ వరకు రోజుకు ఐదారు ఎంయూలలోపే కరెంట్ ఉత్పత్తి సాగింది. శ్రీశైలంలో జులై 14  నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వదలడంతో పవర్ జనరేషన్ వేగం పుంజుకుంది. జులై 20 వచ్చేసరికి అన్ని ప్రాజెక్టుల్లో కలిపి కరెంట్ ఉత్పత్తి 25 ఎంయూలు దాటింది. ఈ నెల 2 నాటికి అత్యధికంగా 31.84 ఎంయూల ఉత్పత్తి జరిగింది. ఆ తర్వాత రోజూ 31 ఎంయూల వరకు కరెంట్ ఉత్పత్తి అవుతోంది. మొత్తంగా అన్ని ప్రాజెక్టుల్లో కలిపి ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 770.1 ఎంయూల విద్యుత్ ఉత్పత్తి జరిగింది.