మండుతున్న ఎండలు..ఆందోళనలో జనం

మండుతున్న ఎండలు..ఆందోళనలో జనం

జంట నగరాల్లో రోజురోజుకూ మండుతున్న ఎండలతో జనం బెంబేలెత్తుతున్నారు. శనివారం నగరంలో 42.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణ ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇది 2.7 డిగ్రీలు అధికం. ఇవాళ, రేపు కూడా నగరంలో సుమారు 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇక ఈ రెండు రోజులు నగరంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. వర్షం కురిస్తే ఉష్ణోగ్రతల్లో స్వల్ప తగ్గుదల నమోదయ్యే అవకాశముందని.. లేనిపక్షంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని స్పష్టంచేశారు. రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతాయని, ఉక్కపోతతో ప్రజలు సతమతమయ్యే అవకాశముందన్నారు. ఎండలతో ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదన్నారు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మంచినీరు, గొడుగు వెంట తీసుకెళ్లాలని… కొబ్బరినీరు, మజ్జిగ, నిమ్మరసం లాంటివి తాగాలని వివరించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని వెల్లడించారు.