‘వైరల్’ హెపటైటిస్‌‌‌‌

 ‘వైరల్’ హెపటైటిస్‌‌‌‌

ప్రాణాంతక హెపటైటిస్‌‌‌‌(కాలేయ వాపు) వ్యాధి ఇండియాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో ఏటా లక్ష మందికిపైగా ఈ వ్యాధితో మరణిస్తున్నారు. దేశంలో 5.2 కోట్ల మంది హెపటైటిస్‌‌‌‌ రోగులు ఉన్నారు. మన రాష్ర్ట జనాభాలోనూ 4 శాతం మంది వైరల్ హెపటైటిస్‌‌‌‌తో బాధపడుతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఈ వ్యాధి ఎక్కువగా విస్తరిస్తున్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది. ఆ జిల్లాలోని ఐజా మండలంలో సర్వే చేయగా ప్రతి వంద మందిలో 10 నుంచి 12 మందికి హెపటైటీస్‌‌‌‌–సీ ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. హెపటైటిస్‌‌‌‌లో ఏ, బీ, సీ, డీ, ఈ అని 5 రకాలుంటాయి. ఇందులో బీ, సీ రకాలను వైరల్ హెపటైటిస్‌‌‌‌గా పిలుస్తారు. ఇవి చాలా ప్రమాదకరం. వీటి నివారణ కోసం కేంద్రం ‘నేషనల్‌‌‌‌ యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌’ను ప్రకటించింది.

రాష్ట్రంలో 49 వేల మందికి వ్యాక్సిన్‌‌‌‌…

త్వరలో మన రాష్ర్టంలో హెపటైటిస్‌‌‌‌ స్ర్కీనింగ్ ప్రారంభం కానుంది. ముందుగా 49 వేల మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్‌‌‌‌ చేయాలని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. వీరంతా నిత్యం రోగులతో ఉంటారు కాబట్టి, వారు తొందరగా వైరస్ బారిన పడే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో తొలుత వీరికి హెపటైటిస్‌‌‌‌ వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. వీరికి ముందుగా ఒక డోస్‌‌‌‌, నెల తర్వాత మరో డోస్‌‌‌‌, ఆర్నెళ్ల తర్వాత చివరి డోస్‌‌‌‌ ఇవ్వనున్నారు. ఇందుకు రూ.6 కోట్ల విలువైన వ్యాక్సిన్లను నేషనల్‌‌‌‌ హెల్త్‌‌‌‌ మిషన్‌‌‌‌లో భాగంగా కేంద్రం అందించనుంది. మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో అత్యధికంగా హెపటైటిస్‌‌‌‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ముందుగా మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, గద్వాల జిల్లాల్లోనే స్ర్కీనింగ్‌‌‌‌ ప్రారంభించాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. గర్భిణులు, రక్త మార్పిడి చేయించుకునే డయాలసిస్‌‌‌‌, తలసేమియా పేషెంట్లు, ట్రక్‌‌‌‌ డ్రైవర్లు, హెచ్‌‌‌‌ఐవీ, టీబీ పేషెంట్లకు రక్ష పరీక్షలు చేయనున్నారు.

ఐజాలో నూటికి 10 మంది…

మహబూబ్‌ నగర్‌ జిల్లా ఐజా మండలంలో 2016లో సర్వే చేశాం. ప్రతి వంద మందిలో 10నుంచి 12 మందికి హెపటైటిస్‌ సీ ఉన్నట్టు గుర్తించాం. సాధారణంకంటే ఇది చాలాఎక్కువ. రాష్ర్టంలో హెపటైటిస్‌ వేగంగా విస్తరిస్తోంది. ప్రభుత్వం స్ర్కీనింగ్ చేసి,ఉచితంగా మందులిందిస్తే ఎంతో మందికి మేలు జరుగుతుంది.- డాక్టర్‌‌‌‌‌‌‌‌ సోమశేఖర్‌‌‌‌‌‌‌‌   సీనియర్ గ్యాస్ర్టో ఎంటరాలజిస్ట్‌‌‌‌