IND vs AUS: చితక్కొట్టిన జోష్ ఇంగ్లిస్.. ఇండియా ముందు భారీ లక్ష్యం

IND vs AUS: చితక్కొట్టిన జోష్ ఇంగ్లిస్.. ఇండియా ముందు భారీ లక్ష్యం

హైదరాబాద్‌ను వర్షం ముంచెత్తితే.. పొరుగు రాష్ట్రం ఏపీని బౌండరీల వర్షం ముంచెత్తింది. గురువారం రాజశేఖర రెడ్డి స్టేడియం(వైజాగ్) వేదికగా ఇండియాతో జరుగుతోన్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. పూనకం వచ్చినట్లు ఎడా పెడా బౌండరీలు బాదారు. ముఖ్యంగా ఆసీస్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్(110) వీర విహారం చేశాడు. భారత యువ కెరటాలను తుత్తునియలు చేస్తూ కెరీర్ లో తొలి సెంచరీ నమోదు చేశాడు.

జోష్ ఇంగ్లిస్(110; 50 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ కు తోడు స్టీవ్ స్మిత్(52; 41 బంతుల్లో 8 ఫోర్లు) కూడా బ్యాట్ ఝుళిపించడంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఎప్పుడో ఏడాదికో.. రెండేళ్లకోసారి తెలుగు గడ్డపై జరిగే మ్యాచ్ ను మన అభిమానులు సంతోషంగా చూడలేకపోయారు. అంత ఏకపక్షంగా ఇన్నింగ్స్ సాగింది.

ప్రసిద్ కృష్ణా, రవి బిష్ణోయ్ హాఫ్ సెంచరీలు

ఆసీస్ బ్యాటర్లకు పోటీగా మన యువ కెరటాలు ప్రసిద్ కృష్ణా(50), రవి బిష్ణోయ్(54) అర్ధ శతకాలు నమోదు చేశారు. పోటీ పడి పరుగులు సమర్పించుకున్నారు. అలా అని మిగిలిన బౌలర్లు గొప్పేం కాదు. అర్షదీప్ దీప్ తన నాలుగు ఓవర్లలో 10.20 ఎకానమీతో 41 పరుగులు సమర్పించుకోగా.. అక్సర్ పటేల్ 8 ఎకానమీతో 32 పరుగులు ఇచ్చాడు.