IND vs AUS: కుర్రాళ్లు కుమ్మేశారు.. రెండో టీ20 మనదే

IND vs AUS: కుర్రాళ్లు కుమ్మేశారు.. రెండో టీ20 మనదే

40 ఓవర్లు.. 486 పరుగులు.. తిరువనంతపురం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టీ20 పరుగుల ప్రవాహాన్ని తలపించింది. మొదట భారత కుర్రాళ్లు కుమ్మేస్తే.. అనంతరం ఛేదనలో ఆసీస్ బ్యాటర్లు అదే రీతిలో బదులిచ్చారు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం ఏకపక్షమైనా మధ్యలో కాసేపు ఉత్కంఠ రేకెత్తించింది. తొలుత భారత జట్టు 235 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో ఆసీస్ 191 పరుగులు చేసింది.

భయపెట్టిన స్టోయినిస్, టిమ్ డేవిడ్

236 పరుగుల భారీ ఛేదనలో ఆసీస్ 58 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఇక మ్యాచ్ ముగిసింది అనుకున్న సమయాన మార్కస్ స్టోయినిస్- టిమ్ డేవిడ్ జోడి భారత అభిమానులను భయపెట్టారు. ఓవర్‌కు 15 నుంచి 20 పరుగుల చొప్పున కొడుతూ మ్యాచ్‌పై ఆసక్తి రేకెత్తించారు. అయితే సరైన సమయంలో బిష్ణోయ్ ఈ జోడీని విడగొట్టడంతో మ్యాచ్ భారత్ వశం అయ్యింది. టిమ్ డేవిడ్(37; 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టోయినిస్(45; 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), మాథ్యూ వేడ్(42 నాటౌట్; 23 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బిష్ణోయ్, ప్రసిద్ క్రిష్ణ చెరో మూడు వికెట్లు పడగొట్టగా..   అర్షదీప్, అక్సర్ పటేల్, ముఖేష్ కుమార్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.

జైశ్వాల్, కిషన్, రుతురాజ్ జోరు

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. యశస్వి జైస్వాల్(53; 25 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (52; 41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లు), ఇషాన్ కిషన్(52; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకాల మోత మోగించారు. చివరలో సూర్యకుమార్ యాదవ్(19; 10 బంతుల్లో 2 సిక్స్‌లు) రింకూ సింగ్(31 నాటౌట్; 9 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లు) కూడా బ్యాట్ ఝులిపించడంతో భారత్.. ఆసీస్ ఎదుట భారీ  టార్గెట్ నిర్ధేశించగలిగింది.

2-0 ఆధిక్యం

ఈ విజయంతో భారత జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో 2-0 ఆధిక్యంలోకి నిలిచింది. ఇక బర్సపరా క్రికెట్ స్టేడియం(గౌహతి) వేదికగా ఈ ఇరు జట్ల మధ్య మంగళవారం(నవంబర్ 28) మూడో టీ20 జరగనుంది.