IND vs AUS: దంచికొట్టిన కుర్రాళ్లు.. ఆస్ట్రేలియా టార్గెట్ 236

IND vs AUS: దంచికొట్టిన కుర్రాళ్లు.. ఆస్ట్రేలియా టార్గెట్ 236

వరల్డ్ కప్ 2023 చేజారింది.. అందుకు ఆసీస్‌పై తీర్చుకోవాలి.. అనే కసి, పట్టుదల భారత యువ జట్టులో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కాదంటే ఆ కొట్టుడేంటి..! రెండ్రోజుల క్రితం విశాఖ సాగర తీరాన భారత కుర్ర బ్యాటర్లు కుమ్మేసిన ఘటన మరవకముందే.. తిరువనంతపురం వేదికగా మరోసారి అలాంటి విధ్వంసం చోటుచేసుకుంది. 

ఆదివారంగ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా ఆసీ‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత యువ బ్యాటర్లు చెలరేగి ఆడారు. కుర్ర జట్టని తక్కువ అంచనా వేసిన ఆసీస్ బౌలర్లను తునాతునకలు చేశారు. యశస్వి జైస్వాల్(53; 25 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (52; 41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లు), ఇషాన్ కిషన్(52; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకాలమోత మోగించారు. 

చివరలో సూర్యకుమార్ యాదవ్(19; 10 బంతుల్లో 2 సిక్స్‌లు) రింకూ సింగ్(31 నాటౌట్; 9 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లు) మెరుపులు కూడా తోడవ్వడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ విధ్వంసం చూశాక వరల్డ్ కప్ జట్టులో వీరున్నా అయిపోయేది అని అభిమానులు నిట్టూరుస్తున్నారు.