IND vs ENG: ఉప్పల్‍లో భారత స్పిన్నర్ల జోరు.. స్వల్ప స్కోరుకే ఇంగ్లాండ్ ఆలౌట్ 

IND vs ENG: ఉప్పల్‍లో భారత స్పిన్నర్ల జోరు.. స్వల్ప స్కోరుకే ఇంగ్లాండ్ ఆలౌట్ 

ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 246 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లాండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే వచ్చింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు బెన్ డకెట్(35), జాక్ క్రాలీ(20) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. భారత పేస్ ద్వయం మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలను ధీటుగా ఎదుర్కొంటూ వేగంగా పరుగులు చేశారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ 11 ఓవర్లోనే వికెట్ కోల్పోకుండా  53 పరుగులు చేసింది. ఆ దశలో ఎంట్రీ ఇచ్చిన భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజా తమ మాయాజాలంతో ఇంగ్లీష్ బ్యాటర్ల పని పట్టారు. కేవలం 5 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను కష్టాల్లోకి నెట్టారు.

ఆ సమయంలో సీనియర్ ప్లేయర్లు జో రూట్(29), బెయిర్ స్టో(37) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. అయితే స్పిన్నర్లు మరోసారి చెలరేగడంతో ఇంగ్లాండ్ 137 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఇక 200లోపే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగుస్తుందనుకున్నప్పటికీ.. బెన్ స్టోక్స్(70) అడ్డుపడ్డాడు. టెయిలండర్ల సాయంతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పుతూ జట్టును గట్టెక్కించాడు.

భారత బౌలర్లలో అశ్విన్, జడేజా మూడేసి వికెట్లు తీసుకోగా.. అక్సర్ పటేల్, బుమ్రా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.