- పంత్, శ్రేయస్‌కు చోటు.. హార్దిక్, బుమ్రాకు రెస్ట్
న్యూఢిల్లీ: హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వన్డేల్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ నెల 11 నుంచి సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం అతన్ని జట్టులోకి తీసుకున్నారు. శనివారం సమావేశమైన సెలెక్షన్ కమిటీ ఈ సిరీస్ కోసం మొత్తం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు సిరాజ్‌ను పక్కనబెట్టారు.
అయితే టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్‌లో రెస్ట్ ఇవ్వడంతో మళ్లీ సిరాజ్‌ను వన్డే సెటప్‌లోకి తీసుకొచ్చారు. గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్‌కు జట్టులో చోటు కల్పించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో అతను ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 6న హిమాచల్ ప్రదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో ముంబై తరఫున అతను బరిలోకి దిగనున్నాడు.
ఈ మ్యాచ్ తర్వాత బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) ఫిట్‌నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తేనే వైస్ కెప్టెన్ హోదాలో కివీస్‌తో సిరీస్‌లో ఆడనున్నాడు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఒక మ్యాచ్‌లో పది ఓవర్లు బౌలింగ్ చేయడానికి సీవోఈ నుంచి అనుమతి లభించలేదు. దాంతో కివీస్‌తో సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయలేదు.
టీ20 వరల్డ్ కప్‌కు ముందు రిస్క్ తీసుకోవద్దని సెలెక్టర్లు భావిస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ‘శ్రేయస్ అందుబాటులో ఉండటం బీసీసీఐ సీవోఈ ఇచ్చే ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుంది. పాండ్యా ఇంకా పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడం లేదు. అందుకే అతన్ని తీసుకోలేదు. ప్రస్తుతానికి అతని పని భారాన్ని అంచనా వేస్తున్నాం’ అని బీసీసీఐ పేర్కొంది.
నితీష్‌కు చాన్స్.. రుతురాజ్‌కు నో..
సౌతాఫ్రికాతో సిరీస్‌లో రాణించిన రుతురాజ్ గైక్వాడ్‌ను సెలెక్టర్లు కరుణించలేదు. శుభ్‌మన్, శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో అతను నాలుగో ప్లేస్‌లో బ్యాటింగ్‌కు దిగి రాయ్‌పూర్ మ్యాచ్‌లో 83 బాల్స్‌లోనే 105 రన్స్ చేశాడు. అయితే ప్రతి స్థానానికి విపరీతమైన పోటీ నెలకొని ఉండటంతో రుతురాజ్‌ను పక్కనబెట్టక తప్పలేదు.
టీ20 వరల్డ్ కప్ జట్టుకు దూరమైన శుభ్‌మన్ గిల్‌కు మళ్లీ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఇక విజయ్ హజారే ట్రోఫీలో మెరిసిన డ్యాషింగ్ హిట్టర్ రిషబ్ పంత్ టీమ్‌లో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌ను తీసుకున్న సెలెక్షన్ కమిటీ రెండో వికెట్ కీపర్‌గా పంత్‌కు అవకాశం ఇచ్చింది.
సీనియర్ల రాక నేపథ్యంలో గత సిరీస్‌లో భాగమైన తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్‌కు చోటు దక్కలేదు. సిరాజ్‌తో పాటు హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. పేస్ ఆల్‌రౌండర్‌గా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని తీసుకున్నారు.
స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌తో పాటు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అవకాశం లభించింది. ఈ నెల 11, 14, 18 తేదీల్లో వరుసగా వడోదర, రాజ్‌కోట్, ఇండోర్‌లో మూడు వన్డేలు జరుగుతాయి. దాంతో ఒకే ఫార్మాట్‌లో ఆడుతున్న రోహిత్, కోహ్లీని చూసేందుకు ఫ్యాన్స్ స్టేడియాలకు పోటెత్తుతారని అంచనా వేస్తున్నారు.
ఇండియా టీమ్
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ (ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.
