పాక్‌తో మ్యాచులంటే ఇండియాకు వణుకుపుట్టేది: పాక్ మాజీ క్రికెటర్

పాక్‌తో మ్యాచులంటే ఇండియాకు వణుకుపుట్టేది: పాక్ మాజీ క్రికెటర్

ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇరుదేశాల అభిమానులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల కళ్లన్నీ ఈ మ్యాచ్ వైపే ఉంటాయి. బంతికి బంతికి ఫలితం మారుతున్న క్షణాన.. మైదానంలో చోటుచేసుకునే భావోద్వేగ ఘటనలు వర్ణనా తీతం. తమ జట్టే గెలవాలని ప్రార్థించని అభిమాని ఉండరు. అంతటి క్రేజ్ ఇండియా- పాక్ మ్యాచ్ సొంతం. 

 ద్వైపాక్షిక సిరీసుల్లో పాక్‌దే పైచేయి

ఇప్పటివరకూ ఈ ఇరు జట్లు ద్వైపాక్షిక సిరీసుల్లో 203 సార్లు తలపడగా.. పాకిస్తాన్ అత్యధికంగా 88 సార్లు విజయం సాధించింది.  భారత్ 73 మ్యాచుల్లో గెలుపొందగా.. 42 మ్యాచులు డ్రాగా ముగిశాయి. ఈ ఇరు జట్ల మధ్య టెస్టుల్లో జయాపజయాలలో పెద్దగా తేడా లేనప్పటికీ.. వన్డే ఫార్మాట్ లో మాత్రం పాక్‌దే పైచేయి. భారత్ కంటే 18 మ్యాచుల్లో అధికంగా విజయం సాధించింది. 

  • టెస్టులు(59): ఇండియా - 9; పాక్ - 12; డ్రా - 38
  • వన్డేలు(132): ఇండియా - 55; పాక్ - 73; ఫలితం తేలనివి - 4
  • టీ20లు(12): ఇండియా 9; పాక్ - 3

ఈ లెక్కలు చూసుకొని పాక్ మాజీ దిగ్గజం అబ్దుల్ రజాక్ భారత జట్టుపై నోరు పారేసుకున్నారు. 197-98 సంవత్సరాల్లో పాక్‌తో మ్యాచులంటే ఇండియాకు భయం పుట్టేదని తెలిపారు.

'ఇరు జట్ల ఆటగాళ్లకు ఒకరిపై మరొకరికి ఒకరికి గౌరవం ఉంది. స్నేహభావం కూడా ఉంది. కానీ భారత జట్టు.. పాకిస్తాన్‌తో మ్యాచులు ఆడటం లేదు. ఇప్పుడే కాదు.. 1997-98 వరకు భారత జట్టు ఎక్కువ మ్యాచులు ఆడలేదు. అందుకు కారణం.. మా జట్టు బలంగా ఉండటమే. మాతో ఎప్పుడూ మ్యాచ్ ఆడినా ఓడిపోతూనే ఉండేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇది 2023 కదా. ఇప్పుడు ఏ జట్టు చిన్నది కాదు.. పెద్దది కాదు. ఆరోజు ఎవరు బాగా ఆడతారన్నదే ముఖ్యం. ఇకనైనా మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. పాత ఆలోచనలు వదిలేసి ద్వైపాక్షిక సిరీసులు ఆడాలి..' అని రజాక్ చెప్పుకొచ్చారు.

వరల్డ్ కప్ ఈవెంట్లలో భారత్‌దే పైచేయి

ఐసీసీ ఈవెంట్లలో మాత్రం భారత్‌కు ఎదురులేదు. ఈ ఇరు జట్లు వరల్డ్ కప్ మ్యాచుల్లో ఇప్పటివరకూ 14 సార్లు తలపడగా.. టీమిండియా పన్నెండింటిలో విజయం సాధించింది. పాక్ ఒకే ఒక్క మ్యాచులో గెలుపొందింది.

  • వన్డే వరల్డ్ కప్ (7): ఇండియా(7)
  • టీ20 వరల్డ్ కప్(7) - ఇండియా(5); పాక్(1); టై -1

ప్రస్తుతం ఈ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ద్వైపాక్షిక సిరీసులు జరగడం లేదు. కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి. ఇక వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇండియా -పాక్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.