ఆపరేషన్ తిలక్.. తొమ్మిదోసారి ఆసియా కప్‌‌ సొంతం

ఆపరేషన్ తిలక్.. తొమ్మిదోసారి ఆసియా కప్‌‌ సొంతం

 

  • టీమిండియాను గెలిపించిన హైదరాబాదీ తిలక్‌‌‌‌ వర్మ
  • ఫైనల్లో 5 వికెట్లతో పాక్​పై థ్రిల్లింగ్ విక్టరీ.. తొమ్మిదోసారి ఆసియా కప్‌‌ సొంతం.. రాణించిన కుల్దీప్‌‌‌‌
 
 

ఇండియా క్రికెట్ ఫ్యాన్స్‌‌కు దసరా ముందే వచ్చేసింది. ఆసియాలో తమకు తిరుగే లేదని టీమిండియా మరోసారి నిరూపించుకుంది.  అత్యద్భుత ఆటతో.. అజేయ జైత్రయాత్రను కొనసాగిస్తూ..  దాయాది జట్టు పాకిస్తాన్‌‌ను మూడు వారాల్లోమూడోసారి మట్టికరిపిస్తూ..  ఆసియా కప్‌‌లో తొమ్మిదోసారి ట్రోఫీ సొంతం చేసుకుంది.
ఇండియా–పాక్‌‌  ఫైనల్ ఎలా ఉండాలని సగటు అభిమాని కోరుకుంటాడో అలానే సాగింది ఈ పోరు..! అనూహ్య మలుపులు తిరుగుతూ ఉర్రూతలూగించింది. ఆధిపత్యం చేతులూ మారుతూ తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది.  తొలి పది  ఓవర్లలో బ్యాటింగ్‌‌లో ఓ రేంజ్‌‌లో విజృంభిస్తున్న పాక్‌‌ను ఇండియా స్పిన్నర్లు చుట్టేశారు. 180 స్కోరు పక్కా అనుకుంటే 150 కూడా దాటకుండా పడగొట్టేశారు. 147 రన్స్‌‌ చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌ ఇండియాకు నల్లేరు మీద నడకే అనుకుంటే.. నాలుగు ఓవర్లు తిరిగే సరికి టాప్‌‌–3 బ్యాటర్లు పెవిలియన్‌‌ బాట పట్టేశారు. పాక్ చేతిలో ఓడిపోతే ఎలా అన్న భయం మెల్లగా మొదలైంది. హార్ట్‌‌బీట్ అమాంతం పెరిగింది. అప్పుడొచ్చాడు మన హైదరా‘బాద్‌‌షా’ తిలక్ వర్మ. క్రికెట్ వరల్డ్‌‌లోనే అతి పెద్ద మ్యాచ్‌‌లో .. అత్యంత ఒత్తిడిలోనూ నిర్భయంగా.. అద్భుతంగా ఆడుతూ  పాక్‌‌ బౌలింగ్‌‌ను చీల్చి చెండాడాడు. ఇటుకా ఇటుకా పేరుస్తూ తన కెరీర్‌‌‌‌లో చిరకాలం నిలిచిపోయే ఇన్నింగ్స్‌‌తో  జట్టును గెలిపించి హీరో అయ్యాడు.

దుబాయ్‌‌‌‌: మిషన్ ఆసియా కప్‌‌ను టీమిండియా సక్సెస్‌‌ఫుల్‌‌గా ముగించింది. మెగా టోర్నీలో తొమ్మిదోసారి ట్రోఫీ సొంతం చేసుకుంది. టాపార్డర్ తడబడినా  మన హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ ( 53 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 నాటౌట్‌‌‌‌) అపద్బాంధవుడై ఆదుకున్న వేళ ఆదివారం జరిగిన హై ఓల్టేజ్ ఫైనల్లో ఇండియా 5 వికెట్ల తేడాతో పాక్‌‌‌‌ను ఓడించింది.  టాస్ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన పాక్ 19.1 ఓవర్లలో  146 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. ఓపెనర్లు సాహిబ్జదా ఫర్హాన్ (44 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57), ఫఖర్ జమాన్ (35 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 46) రాణించగా.. చివరి ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే పరిమితం అయ్యారు.  కుల్దీప్ యాదవ్ (4/30), మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (2/30), పొదుపుగా బౌలింగ్ చేసిన అక్షర్ పటేల్ (2/26) ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌‌‌‌ను పేకమేడలా కూల్చారు. బుమ్రా (2/25) కూడా రెండు వికెట్లతో మెరిశాడు. అనంతరం తిలక్‌‌‌‌ అద్భుత పోరాటంతో ఇండియా 19.4  ఓవర్లలో 150/5 స్కోరు చేసి గెలిచింది. శివం దూబే (22 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 33), సంజూ శాంసన్ (24) కూడా రాణించారు.  

ఓపెనర్ల ధనాధన్‌‌‌‌.. కుల్దీప్ మ్యాజిక్‌‌‌‌

తొలి 74 బాల్స్‌‌‌‌లో 113 రన్స్‌‌‌‌ ఒకే వికెట్‌‌‌‌..  తర్వాతి 39 బాల్స్‌‌‌‌లో 33 రన్స్ 9 వికెట్లు!  పాక్‌‌‌‌ బ్యాటింగ్ సాగిన తీరిది. కుల్దీప్ యాదవ్ ముందుండి నడిపించగా..ఇండియా స్పిన్ త్రయం చేసిన మ్యాజిక్‌‌‌‌తో పాక్‌‌‌‌ తక్కువ స్కోరుకే పరిమితం అయింది. టాస్ ఓడిన పాక్  తొలుత  ఇన్నింగ్స్‌‌‌‌ను అద్భుతంగా ప్రారంభించింది. పవర్ ప్లేలో ఇండియా బౌలర్లపై పాక్ ఓపెనర్లు సాహిబ్జదా ఫర్హాన్, ఫఖర్ జమాన్ పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ముఖ్యంగా ఫర్హాన్  తన విధ్వంసకర ఫామ్‌‌‌‌ను కొనసాగిస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దాంతో పవర్ ప్లే ముగిసేసరికి పాక్ 45 రన్స్ చేసింది. ఆ తర్వాత కూడా వీరి జోరు తగ్గలేదు. కుల్దీప్‌‌‌‌ను లక్ష్యంగా చేసుకుని చెరో సిక్స్ బాదిన ఈ జోడీ తొలి వికెట్‌‌‌‌కు 85 రన్స్ కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలో ఫర్హాన్ ఇండియాపై  వరుసగా రెండో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. వరుణ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో భారీ షాట్‌‌‌‌కు యత్నించి ఫర్హాన్ ఔటైన తర్వాత సైమ్ ఆయుబ్ (14)తో కలిసి ఫఖర్ జమాన్ ధాటిని కొనసాగించాడు. ఒక దశలో 113/1 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచిన పాక్‌‌‌‌ ఈజీగా 180 స్కోరు చేసేలా కనిపించింది.  కానీ అక్కడి నుంచే ఇండియా స్పిన్నర్లు కథను మార్చేశారు. బంతుల వేగాన్ని తగ్గించి, తెలివైన లైన్లతో పాక్ బ్యాటర్లను ఉచ్చులోకి లాగారు. తొలి స్పెల్‌‌‌‌లో నిరాశపరిచిన కుల్దీప్ తన రెండో స్పెల్‌‌‌‌లో విశ్వరూపం చూపించాడు. ప్రమాదకరంగా మారుతున్న సైమ్ ఆయుబ్‌‌‌‌ను పెవిలియన్ పంపి పాక్  పతనానికి తెరలేపాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి కూడా వికెట్ల వేటలో కలిశారు. కుదురుకున్న ఫఖర్ జమాన్‌‌‌‌తో పాటు, హుస్సేన్ తలత్ (1), మహ్మద్ హారిస్ (0) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు.  తన చివరి ఓవర్లో కుల్దీప్..  కెప్టెన్ సల్మాన్ అలీ (8), షాహీన్ షా (0), ఫహీమ్ అష్రఫ్ (0) ముగ్గురినీ  ఔట్ చేసి పాక్ నడ్డి విరిచాడు. చివర్లో జస్‌‌‌‌ప్రీత్ బుమ్రా మిగిలిన పని పూర్తిచేశాడు. గత మ్యాచ్ ప్రవర్తనకు బదులు తీర్చుకున్నట్లుగా హారిస్ రవూఫ్‌‌‌‌ (6)ను అద్భుతమైన యార్కర్‌‌‌‌తో బౌల్డ్ చేసి కూలిపోతున్న విమానంలా సైగ చేస్తూ పెవిలియన్‌‌‌‌కు పంపాడు.  అతని బౌలింగ్‌‌‌‌లోనే  నవాజ్ (6).. రింకూకు క్యాచ్ ఇవ్వడంతో  మరో ఐదు బాల్స్ మిగిలుండగానే పాక్ ఇన్నింగ్స్ ముగిసింది.

టాప్ ఢమాల్.. తిలక్ తడాఖా

పాక్‌‌‌‌ మిడిలార్డర్ బ్యాటర్లు తడబడితే.. చిన్న టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో ఇండియా అనూహ్యంగా ఆరంభంలోనే  ఇబ్బంది పడింది. స్కోరు బోర్డుపై 20 రన్స్ చేరేలోపే టాప్‌‌‌‌–3 బ్యాటర్లు వెనక్కు వచ్చేశారు.  భీకర ఫామ్‌‌‌‌లో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ (5) ఆఖరాటలో ఫెయిలయ్యాడు.  రెండో ఓవర్లో  ఫహీమ్ అష్రఫ్  స్లో బాల్‌‌‌‌ను సిక్స్‌‌‌‌ కొట్టేందుకు ట్రే చేసి రవూఫ్‌‌‌‌కు క్యాచ్ ఇచ్చాడు. టోర్నీలో పేవల ఫామ్‌‌‌‌ను కొనసాగించిన కెప్టెన్ సూర్యకుమార్ (1).. షాహీన్ బౌలింగ్‌‌‌‌లో కెప్టెన్ సల్మాన్‌‌‌‌కు చిక్కి నిరాశ పరిచాడు. ఈ డబుల్ షాక్స్ నుంచి తేరుకునేలోపే అష్రఫ్ మరో దెబ్బకొట్టాడు. నాలుగో ఓవర్లో మిడాన్ మీదుగా షాట్ ఆడిన శుభ్‌‌‌‌మన్ గిల్ (12).. రవూఫ్ పట్టిన చురుకైన క్యాచ్‌‌‌‌కు పెవిలియన్ చేరడంతో ఇండియా 20/3తో కష్టాల్లో పడింది. ఈ టైమ్‌‌‌‌లో హైదరాబాదీ తిలక్ వర్మ, సంజూ శాంసన్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. ఫహీమ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో 4, 6తో తిలక్ ఛేజింగ్‌‌‌‌కు కాస్త జోష్ తీసుకురాగా.. పవర్ ప్లేను ఇండియా 36/3తో ముగించింది.  ఫీల్డింగ్ మారిన తర్వాత  స్పిన్నర్లు నవాజ్‌‌‌‌, అబ్రార్‌‌‌‌‌‌‌‌, సైమ్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో 10 ఓవర్లకు ఇండియా 58/3తో నిలిచింది.   12 రన్స్ వద్ద అబ్రార్ బౌలింగ్‌‌‌‌లో ఇచ్చిన సింపుల్ క్యాచ్‌‌‌‌ను తలత్‌‌‌‌  డ్రాప్ చేయడంతో శాంసన్‌‌‌‌కు లైఫ్ లభించింది. డ్రింక్స్ బ్రేక్ తర్వాత అబ్రార్ బౌలింగ్‌‌‌‌లో తిలక్‌‌‌‌.. సైమ్ ఓవర్లో శాంసన్ భారీ సిక్స్‌‌‌‌లు కొట్టి ఛేజింగ్‌‌‌‌కు జోష్ తెచ్చారు. కానీ, అబ్రార్ ఓవర్లో శాంసన్ ఔటవడంతో నాలుగో వికెట్‌‌‌‌కు    రన్స్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ ముగిసింది. ఈ టైమ్‌‌‌‌లోకి క్రీజులోకి వచ్చిన శివం దూబే, తిలక్ సమన్వయ లోపంతో ఇబ్బంది పడ్డారు. తిలక్‌‌‌‌ ఓ  రనౌట్ నుంచి కూడా తప్పించుకున్నాడు.  చివరి 36 బాల్స్‌‌‌‌లో ఇండియాకు 64 రన్స్ అవసరం అవగా.. ఒత్తిడి పెరిగ్గా దూబే, తిలక్ ఒక్కసారిగా రెచ్చిపోయారు. వెంటవెంటనే  చెరో సిక్స్, ఫోర్ కొట్టి స్టేడియాన్ని హోరెత్తించారు. ఈ క్రమంలో తిలక్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.  సమీకరణం 24 బాల్స్‌‌‌‌లో 36 రన్స్‌‌‌‌గా మారగా.. పాక్‌‌‌‌పై ప్రెజర్ పెరిగింది. 17వ ఓవర్లో షాహీన్ ఆరు రన్సే ఇచ్చినా.. రవూఫ్ బౌలింగ్‌‌‌‌లో దూబే భారీ సిక్స్ కొట్టడంతో మ్యాచ్ ఇండియా చేతుల్లోకి వచ్చేసింది. 19వ ఓవర్లో లాస్ట్ బాల్‌‌‌‌కు దూబే ఔటవడంతో కాస్త టెన్షన్ రేగింది.  రవూఫ్ వేసిన చివరి ఓవర్లో తిలక్ భారీ సిక్స్‌‌‌‌, రింకూ సింగ్ (4 నాటౌట్‌‌‌‌) ఫోర్‌‌‌‌‌‌‌‌తో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.

సంక్షిప్త స్కోర్లు

పాకిస్తాన్‌‌‌‌: 19.1 ఓవర్లలో  146 ఆలౌట్‌‌‌‌ (ఫర్హాన్ 57, ఫఖర్ జమాన్ 46, కుల్దీప్ యాదవ్ 4/30, చక్రవర్తి (2/30).
ఇండియా: 19.4  ఓవర్లలో 150/5 (తిలక్ 69 నాటౌట్‌‌‌‌, దూబే 33, ఫహీమ్ అష్రఫ్ 3/39)