
గౌహతి: ఓవైపు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరీ.. మరోవైపు డెత్ ఓవర్స్‌లో సరైన బౌలర్ లేని లోటు.. మధ్యలో వరల్డ్‌కప్‌కు రెండు వారాలే మిగిలి ఉన్న నేపథ్యంలో ఇండియా.. సౌతాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్‌కు రెడీ అయ్యింది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి స్వదేశంలో సఫారీలపై తొలి సిరీస్‌ను పట్టేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. దీంతో పాటు ఈ మ్యాచ్ తర్వాత రోహిత్‌సేన మరో టీ20 మాత్రమే ఆడి ఆసీస్ ఫ్లైట్ ఎక్కేస్తుంది. కాబట్టి వీలైనంతగా ఈ రెండు మ్యాచ్‌ల్లోనే ఫైనల్ ఎలెవన్‌పై స్పష్టమైన అంచనాకు రావాలని అటు కోచ్ ద్రవిడ్, ఇటు కెప్టెన్ రోహిత్ భావిస్తున్నారు.
ఆసీస్ వెళ్లే బౌలర్ ఎవరు?
ఊహించని విధంగా వెన్ను నొప్పితో బుమ్రా మెగా టోర్నీకి దూరం కావడంతో సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బుమ్రా ప్లేస్‌లో ఉమేశ్, సిరాజ్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు. కానీ ఈ ఇద్దరూ వరల్డ్‌కప్ టీమ్‌లో లేరు. అయితే ఈ రెండు టీ20ల్లో ఈ ఇద్దరిలో ఎవర్ని పరీక్షించాలన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతున్నది. వరల్డ్ కప్ స్టాండ్ బైలో ఉన్న షమీ.. ఈ సిరీస్‌కు అందుబాటులో లేడు. తొలి టీ20లో రాణించిన దీపక్ చహర్ కూడా వరల్డ్ కప్ టీమ్ స్టాండ్ బైలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తర్వాతి రెండు మ్యాచ్‌లు ఆడే బౌలర్లు ఎవరు? వాళ్లలో ఆసీస్‌కు వెళ్లే వారు ఎవరు? ఈ ప్రశ్నలకు రాహుల్ అండ్ కో తక్షణమే సమాధానం వెతకాల్సి ఉంది. తొలి టీ20లో అర్ష్‌దీప్ సింగ్, చహర్ సూపర్ బౌలింగ్ చేశారు. కానీ ఇప్పుడు భువనేశ్వర్ వస్తే వీరిలో ఎవర్ని తప్పిస్తారు. ఆసియా కప్‌లో భువీ స్లాగ్ ఓవర్స్‌లో ఫెయిలయ్యాడు. సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకొచ్చినా కుదురుకోవడానికి టైమ్ పడుతుంది. హర్షల్ పటేల్ ఫామ్‌లోకి రావాల్సి ఉంది. కాబట్టి రాబోయే రెండు మ్యాచ్‌లు టీమిండియాకు అత్యంత కీలకంగా మారాయి. ఇక బ్యాటింగ్‌లో ఇండియాకు పెద్ద సమస్యలే లేవు. ఓపెనర్లలో రాహుల్, రోహిత్ కొద్దిగా చెలరేగితే చాలు. మిడిలార్డర్‌లో కోహ్లీ, సూర్యకుమార్ ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేసినా చాలు. రిషబ్ పంత్, సూపర్ ఫినిషర్ దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్ లోయర్ ఆర్డర్‌ను చూసుకుంటారు. స్పిన్నర్లుగా చహల్, అశ్విన్‌పై నమ్మకం పెట్టొచ్చు.
లెక్క సరిచేస్తారా?
మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓడిన సౌతాఫ్రికా ప్రతీకారేచ్ఛతో ఉంది. స్టార్లు అందుబాటులో ఉన్నా.. బ్యాటింగ్‌లో ఫెయిల్ కావడం వాళ్లను దెబ్బతీసింది. దీంతో పెద్దగా మార్పుల్లేకుండానే బరిలోకి దిగి లెక్క సరి చేయాలని భావిస్తోంది. డికాక్, కెప్టెన్ బవుమా ఇచ్చే ఓపెనింగ్‌పైనే సఫారీల టార్గెట్ ఆధారపడి ఉంటుంది. రోసోవ్, స్టబ్స్ వైఫల్యం టీమ్‌పై తీవ్రమైన ప్రభావం చూపింది. మిల్లర్, పార్నెల్ ఫర్వాలేదనిపించినా భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. స్పిన్నర్ కేశవ్ మహారాజ్ బ్యాటర్‌గా రాణిస్తుండటం సానుకూలాంశం. బౌలింగ్‌లో రబాడ, నోర్జ్ సత్తా చాటాల్సి ఉంది. స్పిన్నర్లు శంసి, కేశవ్ వికెట్లు తీయాల్సిన బాధ్యతను మరుస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే సఫారీ టాప్ ఆర్డర్ శక్తికి మించి కష్టపడాలి.