
నెట్వర్క్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మువ్వన్నెల జెండా రెపరెపలతో మెరిసిపోయింది. వాడవాడలా స్వాతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. నిజామాబాద్‌లో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, కామారెడ్డిలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించి అధికారికవేడుకల్లో జిల్లా ప్రగతిని నివేదించారు.
ప్రగతిపథంలో కామారెడ్డి : కోదండరెడ్డి
కామారెడ్డి జిల్లా ప్రగతిపథంలో ముందుకెళ్తోందని రాష్ర్ట వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డిలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన మాట్లాడారు. రేషన్ కార్డుల పంపిణీ ద్వారా ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు భరోసా కల్పించిందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, సన్న బియ్యం , మహాలక్ష్మీ వంటి స్కీమ్‌ల ద్వారా పేదలకు మేలు కలిగిందన్నారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం బిల్లు తెచ్చిందని గుర్తుచేశారు. జిల్లాలో కొత్తగా 15,302 మందికి తెల్ల రేషన్ కార్డులిచ్చామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల జిల్లాలో రూ. 167 కోట్ల మేర లబ్ధిచేకూరిందన్నారు. 11,818 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయ్యాయన్నారు. భూ భారతి సదస్సుల ద్వారా రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు శకటాలను ప్రదర్శిచాయి. ఉత్తమ సేవలందించిన వారికి కోదండరెడ్డి ప్రశంసాపత్రాలు అందించారు.
సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం : నిరంజన్
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి పౌరుడికి కూడు, గూడు, గుడ్డకు ప్రభుత్వం భరోసా ఇస్తోందని బీసీ కమిషన్‌చైర్మన్ నిరంజన్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రేషన్ కార్డులకు సన్న బియ్యం పంపిణీ చేయడం ద్వారా పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా చేసిందన్నారు. జిల్లాలో 4,03,510 రేషన్ కార్డులున్నాయన్నారు.
రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని, జిల్లాలో మహిళలకు రూ. 30.73 కోట్ల మేరకు వంటగ్యాస్ సబ్సిడీ ఇచ్చామన్నారు. గృహజ్యోతి స్కీమ్కింద ఉచిత విద్యుత్ పథకం కింద రూ.165 కోట్ల లబ్ది చేకూరిందన్నారు.ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను సన్మానించారు. స్టూడెంట్స్ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, భూపతిరెడ్డి, పైడి రాకేశ్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులు ఉన్నారు.