విడదీయరాని బంధం మనది

విడదీయరాని బంధం మనది
  • ఎల్లప్పుడూ మీ వెంటే ఉన్నాం: మాక్రన్ 
  • ఇండియన్లకు కంగ్రాట్స్: బోరిస్

వాషింగ్టన్/లండన్: ఇండియా, అమెరికా విడదీయరాని భాగస్వామ్య దేశాలని, రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకూ 75 ఏండ్లు అయ్యాయని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు. ఇండియా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘40 లక్షల మంది ఇండియన్ అమెరికన్ లు సహా ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ లు 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవాలను జరుపుకొంటున్నారు. వారితో అమెరికా కూడా జతకలిసింది. మహాత్మాగాంధీ సత్యం, అహింస సిద్ధాంతాలతో చూపిన బాటలో ఇండియా సాగిస్తున్న ప్రజాస్వామ్య ప్రస్థానాన్ని అమెరికా కూడా గౌరవిస్తోంది. అంతర్జాతీయ భద్రత, మానవాళి స్వేచ్ఛ కోసం ఇండియా, అమెరికా ఇకముందూ కలిసికట్టుగా పనిచేస్తాయి. చట్టబద్ధమైన శాంతి, ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో రెండు దేశాల భాగస్వామ్యం కొనసాగుతుంది” అని బైడెన్ పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా ఇండియన్లకు 
ఇండిపెండెన్స్ డే గ్రీటింగ్స్ తెలిపారు. 

మన ఫ్రెండ్షిప్ మరింత పెరగాలె: ఆల్బనీస్ 

ఇండియాతో ఫ్రెండ్షిప్, కోఆపరేషన్ మరింత పెరగాలని కోరుకుంటున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ఆకాంక్షించారు. స్వాతంత్ర్యం తర్వాత ఇండియా గణనీయ విజయాలు సాధించిందన్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్,  ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రన్ కూడా ఇండియన్లకు, ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రియమైన దోస్త్ మోడీ, ప్రియమైన ఇండియన్లకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంలో.. ఫ్రాన్స్ ఎల్లప్పుడూ మీకు మద్దతుగా నిలబడిందన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలి” అని మాక్రన్ ట్వీట్ చేశారు. ఇండియాకు మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్, సింగపూర్ ఫారిన్ మినిస్టర్ వివియన్ బాలక్రిష్ణన్ కూడా 
శుభాకాంక్షలు తెలిపారు.