స్వాతంత్ర్య వజ్రోత్సవాలను సక్సెస్ చేయాలి

స్వాతంత్ర్య వజ్రోత్సవాలను సక్సెస్ చేయాలి
  • తెలంగాణను చూసి కేంద్రం తెలివి తెచ్చుకోవాలని హితవు

హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాష్ట్రంలో  57 సంవత్సరాలు పైబడిన వారు, ఇతరులు కలుపుకొని కొత్తగా 10లక్షల మందికి పింఛన్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల  స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సన్నాహాక సమావేశంలో మంత్రి మాట్లాడారు. గత నాలుగేళ్లుగా కొత్తగా పింఛన్లు ఇవ్వలేదని, ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన ప్రకారం.. 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. వీటిని పంద్రాగస్టు నుంచి పంపిణీ చేస్తామన్నారు. జనగామ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు శుభపరిణామం అన్నారు. 

వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలి..

ప్రతి ఒక్కరిలో దేశభక్తి రగిలేలా స్వాతంత్ర్య వజ్రోత్సవాలు నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. ప్రభుత్వం సూచించిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 1945 ఫిబ్రవరి 5న జాతిపిత మహాత్మాగాంధీ ఓరుగల్లు రైల్వే స్టేషన్, అజంజాహీ మిల్లుకు వచ్చారని, ఇది గుర్తుండిపోయేలా ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని, రైల్వే స్టేషన్ ముందు గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని కలెక్టర్​కు సూచించారు. పంద్రాగస్టు సందర్భంగా ఆయా  జిల్లాల్లో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి అవార్డులు, ప్రశంసా పత్రాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, గోపి, శివలింగయ్య, సీపీ తరుణ్ జోషి, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, జడ్పీ చైర్మన్లు సుధీర్ కుమార్, గండ్రజ్యోతి, కుడా చైర్మన్ సుందర రాజ్, బల్దియా కమిషనర్ ప్రావీణ్య ఉన్నారు.

తెలంగాణను చూసి బుద్ధి తెచ్చుకోవాలె.. 

పాలకుర్తి, వెలుగు: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి, కేంద్రం తెలివి తెచ్చుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎద్దేవా చేశారు. ఆదివారం పాలకుర్తిలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. చేనేతలపై జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ రైతు బీమా లాగే చేనేత బీమాను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చేనేత సంక్షేమం కోసం బడ్జెట్​లో రూ.1200 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు. చేనేత వస్త్రాలను ప్రజలు ఆదరించాలని కోరారు.