
న్యూఢిల్లీ: ఏఐ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఫ్రాక్టల్ అనలిటిక్స్ మార్కెట్‌లో లిస్ట్ అవ్వడానికి మొదటి అడుగు వేసింది. ఐపీఓ ద్వారా రూ. 4,900 కోట్లను సమీకరించడానికి సెబీకి డాక్యుమెంట్లు అందజేసింది. ఐపీఓకు వస్తున్న మొదటి ఏఐ కంపెనీగా గుర్తింపు పొందింది. ఈ పబ్లిక్ ఇష్యూలో రూ. 1,279.3 కోట్ల వరకు ఫ్రెష్ ఇష్యూతోపాటు, ప్రస్తుత పెట్టుబడిదారుల నుంచి రూ. 3,620.7 కోట్ల విలువైన ఓఎఫ్ఎస్ ఉంటుంది. ఓఎఫ్ఎస్ ద్వారా క్వినాగ్ బిడ్కో లిమిటెడ్ రూ. 1,462.6 కోట్ల విలువైన వాటాను, టీపీజీ ఫెట్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 1,999.6 కోట్లు, సత్య కుమారి రెమలా, రావు వెంకటేశ్వర రెమలా రూ. 29.5 కోట్లు, జీఎల్‌ఎమ్ ఫ్యామిలీ ట్రస్ట్ రూ. 129 కోట్ల విలువైన వాటాలను అమ్మనున్నాయి.
ఫ్రాక్టల్ రూ. 255.8 కోట్ల వరకు ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్ ద్వారా సేకరించే అవకాశం ఉంది. ఫ్రెష్ఇష్యూ నుంచి వచ్చే ఆదాయాన్ని దాని అనుబంధ సంస్థ ఫ్రాక్టల్ యూఎస్ఏలో పెట్టుబడి పెట్టడానికి, అప్పులు తిరిగి చెల్లించడానికి, భారతదేశంలో కొత్త ఆఫీసులను ఏర్పాటు చేయడానికి, ఆర్ అండ్ డీ కోసం ఉపయోగిస్తారు. 2000లో శ్రీకాంత్ వెలమకన్ని, ప్రణయ్ అగర్వాల్ స్థాపించిన ఫ్రాక్టల్ ఎమ్ఎన్సీలకు క్లయింట్‌గా పనిచేస్తుంది. వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి డేటా- ఆధారిత ఇన్సైట్లు, ఎండ్ -టు- ఎండ్ ఏఐ సొల్యూషన్లను అందిస్తుంది.