WTC Points Table: వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగియడంతో 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు చేరాలన్న టీమిండియా (Team India) ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వెల్లింగ్టన్‌లో గెలిచి ఉంటే భారత్‌కు కొంత వెసులుబాటు ఉండేది. కానీ ఆ మ్యాచ్ డ్రా కావడంతో టీమిండియా పాయింట్ల శాతం (PCT) 50.00%కి పడిపోయింది. ప్రస్తుతం భారత్ 12 టెస్టుల్లో 5 విజయాలు, 4 ఓటములు, 3 డ్రాలతో 4వ స్థానంలో కొనసాగుతోంది. ఇకపై ఒక్క మ్యాచ్‌లో తడబడినా ఇండియా ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
భారత్ ముందు 6 టెస్టులు.. గరిష్ట PCT 66.67 శాతం మాత్రమే:
* ప్రస్తుత WTC సైకిల్‌లో భారత్‌కు ఇంకా 6 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి: నవంబర్ 27 నుంచి క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌తో 2వ టెస్టు, అలాగే వచ్చే ఏడాది జనవరి చివరి నుంచి మార్చి ఆరంభం వరకు స్వదేశంలో ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్.
* 6/6 గెలిస్తేనే గరిష్ట శాతం: వెల్లింగ్టన్ డ్రాకు ముందు భారత్ గరిష్టంగా 70.37 శాతం PCT సాధించే అవకాశం ఉండేది. ఇప్పుడు అది 66.67 శాతానికి పడిపోయింది. ఈ 66.67 శాతం అందుకోవాలంటే ఇండియా మిగిలిన 6 టెస్టుల్లో 6 మ్యాచ్‌లూ గెలవాల్సిందే.
ఒకవేళ పాయింట్లు కోల్పోతే పరిస్థితి ఏంటి?
* 5 విజయాలు + 1 డ్రా = 62.96%
* 5 విజయాలు + 1 ఓటమి = 61.11%
* 4 విజయాలు + 2 డ్రాలు = 59.26%
* క్రైస్ట్‌చర్చ్ టెస్టు చావోరేవో: నవంబర్ 27వ తేదీన ప్రారంభమయ్యే క్రైస్ట్‌చర్చ్ టెస్టు భారత్‌కు అత్యంత కీలకం. ఇందులో గెలిస్తే ప్రత్యర్థి న్యూజిలాండ్‌కు 12 పాయింట్లు దక్కకుండా అడ్డుకోవడమే కాకుండా భారత్ 66.67 శాతం ఆశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ క్రైస్ట్‌చర్చ్ టెస్టు డ్రా అయితే, ఆసీస్‌ను 5–0తో క్లీన్‌స్వీప్ చేసినా భారత్ గరిష్టంగా 62.96% దగ్గరే ఆగిపోతుంది. ఓడితే 61.11 శాతానికి పడిపోతుంది.
ఆసీస్‌పై 4–1తో విజయం.. కివీస్ పాయింట్లు కోల్పోతేనే ఫైనల్ బెర్త్:
* పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా (75.00%)కు బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, శ్రీలంకలతో షెడ్యూల్ ఉండటంతో ఆ జట్టు ఫైనల్ బెర్త్ దాదాపు ఖాయమైనట్లే.. ఇక మిగిలిన ఒక్క ఫైనల్ బెర్త్ కోసం ఆస్ట్రేలియా (69.23%), న్యూజిలాండ్ (66.67%), భారత్ (50.00%) మధ్య తీవ్ర పోటీ నెలకొంది:
* ఆస్ట్రేలియాకు చెక్ పెట్టాలంటే: స్వదేశంలో జరిగే 5 టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియాను టీమిండియా కనీసం 4–1 తేడాతో ఓడించాలి.. అప్పుడు ఆసీస్ తమ సొంతగడ్డపై కివీస్‌ను క్లీన్‌స్వీప్ చేసినా 63.6 శాతం వద్దే ఆగిపోయి రేసు నుంచి తప్పుకుంటుంది.
* న్యూజిలాండ్ సమీకరణం: ఒకవేళ భారత్ క్రైస్ట్‌చర్చ్‌లో గెలిచి 66.67 శాతం సాధించినా, న్యూజిలాండ్ తన మిగిలిన 8 టెస్టుల్లో 6 విజయాలు సాధిస్తే భారత్‌ను దాటేస్తుంది (5 విజయాలు, 3 డ్రాలు సాధిస్తే టై అవుతుంది). శ్రీలంక, పాకిస్థాన్‌లపై కివీస్ గెలిచే అవకాశం ఉన్నందున, ఆస్ట్రేలియా గడ్డపై న్యూజిలాండ్ ఆడే 4 టెస్టుల సిరీస్ ఫలితం భారత్ భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది.
