
న్యూఢిల్లీ: వెస్టిండీస్ బ్యాటర్ల నుంచి అద్భుత పోరాట పటిమ ఎదురైనా.. మూడ్రోజుల్లో ముగుస్తుందనుకున్న ఆట ఐదో రోజుకు చేరుకున్నా.. రెండో టెస్టులో ఇండియా విజయం అంచున నిలిచింది. కరీబియన్లను మరోసారి పడగొట్టి.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసేందుకు 58 రన్స్ దూరంలో ఉంది. నిర్జీవమైన పిచ్‌పై ఇండియా బౌలర్ల సహనానికి విండీస్ బ్యాటర్ల నుంచి అనూహ్య పరీక్ష ఎదురైనప్పటికీ, చివరకు ఆతిథ్య జట్టుదే పైచేయి అయింది. కరీబియన్ టీమ్ ఇచ్చిన 121 రన్స్ చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో నాలుగో రోజు, సోమవారం ఆట ముగిసే సమయానికి ఇండియా 63/1తో నిలిచింది.
యశస్వి జైస్వాల్ (8) ఔటైనా.. సాయి సుదర్శన్ (30 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (25 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు జాన్ క్యాంప్‌బెల్ (199 బాల్స్‌లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 115), షై హోప్ (214 బాల్స్‌లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 103) సెంచరీలతో సత్తా చాటడంతో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్ )లో 390 రన్స్‌కు ఆలౌటైంది. జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్) ఫిఫ్టీతో మెప్పించాడు. ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
సెంచరీలతో పోరాటం
ఫాలో-ఆన్ ఆడుతూ ఓవర్‌నైట్ స్కోరు 173/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ నాలుగో రోజు గొప్పగా పోరాడింది. ముఖ్యంగా క్యాంప్‌బెల్, షై హోప్ సెంచరీలతో ఇండియా బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. మూడో రోజే క్రీజులో పాతుకుపోయిన ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 177 రన్స్ భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. ఏమాత్రం స్పందించని ఫిరోజ్ షా కోట్లా పిచ్‌పై ఇండియా స్పిన్నర్లు, పేసర్లు వికెట్లు తీయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
దాంతో తన జోరును కొనసాగించిన క్యాంప్‌బెల్ కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు జడేజా అతడిని ఎల్బీ చేయడంతో భారీ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది. 252/3తో విండీస్ లంచ్‌కు వెళ్లగా.. బ్రేక్ నుంచి వచ్చిన వెంటనే రెండో కొత్త బాల్ అందుబాటులోకి రావడంతో మ్యాచ్ స్వరూపం మారింది. సెంచరీ పూర్తి చేసుకొని ప్రమాదకరంగా మారిన హోప్‌ను సిరాజ్ పెవిలియన్‌కు పంపి విండీస్‌ను దెబ్బకొట్టాడు.
ఆ తర్వాత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విజృంభించి వెస్టిండీస్ లోయర్-మిడిల్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. అతని ధాటికి ఇమ్లాచ్ (12), రోస్టన్ ఛేజ్ (40), పియెరీ (0) పెవిలియన్ చేరగా.. జోమెల్ వారికన్ (3)ను బుమ్రా ఔట్ చేశాడు. దాంతో ఓ దశలో 293/4తో పటిష్టంగా కనిపించిన విండీస్ 311/9తో డీలా పడింది.
అయితే, మ్యాచ్ నాలుగో రోజే ముగుస్తుందనుకున్న తరుణంలో, ఆఖరి వికెట్‌కు జస్టిన్ గ్రీవ్స్, జైడెన్ సీల్స్ (32) అసాధారణంగా ప్రతిఘటించారు. పదో వికెట్‌కు 79 రన్స్ జోడించి ఇండియా బౌలర్లను విసుగు పుట్టించారు. టీ బ్రేక్ తర్వాత చివరకు బుమ్రా బౌలింగ్‌లో సీల్స్.. సుందర్‌కు క్యాచ్ ఇవ్వడంతో విండీస్ పోరాటం ముగిసింది.
ఇండియా జాగ్రత్తగా...
చిన్న టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా, నాలుగో రోజే మ్యాచ్‌ను ముగించాలని భావించింది. కానీ, యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడే ప్రయత్నంలో త్వరగా ఔటయ్యాడు. వెంటవెంటనే రెండు ఫోర్లు కొట్టిన అతను వారికన్ బౌలింగ్‌లో ఫిలిప్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, మరో ఓపెనర్ సాయి సుదర్శన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి, రోజును ముగించారు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్: 518/5 డిక్లేర్డ్.
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 248 ఆలౌట్. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 118.5 ఓవర్లలో 390 ఆలౌట్ (క్యాంప్‌బెల్ 115, షై హోప్ 103, బుమ్రా 3/44, కుల్దీప్ 3/104);
ఇండియా రెండో ఇన్నింగ్స్ (టార్గెట్ 121): 18 ఓవర్లలో 63/1 (సుదర్శన్ 30 బ్యాటింగ్, రాహుల్ 25 బ్యాటింగ్, వారికన్ 1/15).
రాహుల్.. నొప్పితో విలవిల
ఛేజింగ్ మూడో ఓవర్లో జైడెన్ సీల్స్ వేసిన బాల్ అనూహ్యంగా బౌన్స్ అయి గజ్జల భాగంలో తగలడంతో కేఎల్ రాహుల్ తీవ్రమైన నొప్పికి గురయ్యాడు. తను మోకాళ్లపై కూలబడటంతో అంతా ఆందోళన చెందారు. వెంటనే ఫిజియో కమలేష్ జైన్ వచ్చి రాహుల్‌ను పరిశీలించాడు. అయినా రాహుల్ ధైర్యంగా బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అంతకుముందు లంచ్ బ్రేక్ తర్వాత వరుసగా ఆరు ఓవర్ల స్పెల్ వేసిన సిరాజ్ తీవ్రంగా అలసిపోయి డగౌట్‌లో కూర్చోగా సపోర్ట్ స్టాఫ్ అతని తలపై ఐస్ ప్యాక్ పెట్టి.. కాళ్లకు మసాజ్ చేశారు.