ఐక్యరాజ్యసమితి నిర్దేశిత సుస్థిరాభివృద్ధి లక్ష్యాల(ఎస్డీజీ) సాధనలో భారతదేశం మొదటిసారి తొలి 100 స్థానాల్లో చోటు దక్కించుకున్నది. గత ఏడాది 109వ ర్యాంకు సాధించిన మన దేశం ఈసారి 99వ ర్యాంకుతో 10 స్థానాలను మెరుగుపరుచుకున్నది. యూఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ 10వ సుస్థిర అభివృద్ధి నివేదిక వివరాలను జూన్ 24న ప్రకటించింది. మరోవైపు ప్రపంచ స్థాయిలో ఎస్డీజీ పురోగతి నిలిచిపోయిందని, 2015లో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఆమోదించిన 17 లక్ష్యాల్లో 17 శాతం మాత్రమే సాధ్యమవుతాయని నివేదిక రూపకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సంఘర్షణలు, వ్యవస్థాపరమైన లోపాలు, పరిమిత ఆర్థిక వనరులు తదితర అంశాలు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఎస్డీజీ పురోగతికి ఆటంకం కలిగిస్తున్నాయని నివేదిక పేర్కొన్నది.
ఎస్డీజీ ముఖ్యాంశాలు
- ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ దేశాలు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఎస్డీజీ సూచీలో తొలి 20 స్థానాల్లో 19 ఐరోపా దేశాలు ఉన్నాయి.
 - 2030 నాటికి ఎస్డీజీని చేరుకోవడంలో మొత్తం 193 దేశాల పురోగతిని పాయింట్లు, దానికి అనుగుణంగా స్థానాల రూపంలో నివేదిక వెల్లడించింది.
 - ఈ ఏడాది ఎస్డీజీ సూచీలో 67 పాయింట్లతో భారత్ 99వ స్థానంలో నిలిచింది.
 - చైనా 74.4 పాయింట్లతో 67వ స్థానంలో, అమెరికా 75.2 పాయింట్లతో 44వ స్థానంలో ఉన్నాయి.
 - భారత్ సమీప ద్వీప దేశాలైన మాల్దీవులు 53వ స్థానంలో, శ్రీలంక 98వ స్థానంలో నిలిచింది.
 - పొరుగు దేశాలైన భూటాన్ 70.5 పాయింట్లతో 74వ స్థానంలో, నేపాల్ 68.6 పాయింట్లతో 85వ స్థానంతో భారత్ కంటే ముందు ఉన్నాయి.
 - బంగ్లాదేశ్63.9 పాయింట్లతో 114వ స్థానంలో, పాకిస్తాన్ 57 పాయింట్లతో 140వ స్థానంతో మన దేశం కంటే వెనుకబడ్డాయి.
 
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు
2015లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రపంచ దేశాలు ఆమోదించిన 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంతర్భాగం. ఇందులో మొత్తం 17 లక్ష్యాలు, 169 ఉప లక్ష్యాలు ఉన్నాయి. పేదరికం, ఆకలిని నిర్మూలించడం, ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం, పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకుని ఎవరినీ వెనుకబడనీయవద్దు అనే సూత్రంతో ప్రపంచ దేశాలు ముందుకు సాగాలని లక్ష్యాలు నిర్దేశిస్తున్నాయి.
సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్, ఎస్డీజీ సూచీ
ఐక్యరాజ్యసమితికి చెందిన సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ప్రతి సంవత్సరం సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్టును విడుదల చేస్తుంది. ఇది 17 లక్ష్యాల ఆధారంగా వివిధ దేశాల పురోగతిని విశ్లేషించి, స్కోర్, ర్యాంకును కేటాయిస్తుంది. ఇది దేశాల పనితీరును అంచనా వేయడానికి ఒక ముఖ్యమైన అంతర్జాతీయ సాధనంగా పనిచేస్తుంది.
భారత్ ప్రదర్శన
2025, జూన్లో విడుదలైన తాజా సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశం తన పనితీరును గణనీయంగా మెరుగుపరుచుకున్నది.
ర్యాంకు: 167 దేశాల్లో భారత్ 99వ ర్యాంకు సాధించింది. చరిత్రలో తొలిసారిగా భారత్ టాప్–100 దేశాల జాబితాలోకి ప్రవేశించడం కీలక మైలురాయి. భారతదేశం 100కి 67.0 స్కోరును సాధించింది.
గత పనితీరుతో పోలిక: గత సంవత్సరాలతో పోలిస్తే ఇది చెప్పుకోదగ్గ పురోగతి. 2024లో 109వ ర్యాంకు, 2023లో 112వ ర్యాంకు, 2022లో 121వ ర్యాంకులో ఉన్న భారత్ స్థిరమైన ప్రగతిని సాధిస్తూ ముందుకు సాగుతున్నదని ఇది సూచిస్తుంది.
