ప్రతిపక్ష నేతల నిర్బంధం ప్రజాస్వామ్యానికి ముప్పు

ప్రతిపక్ష  నేతల నిర్బంధం ప్రజాస్వామ్యానికి ముప్పు
  • కేజ్రీవాల్‌‌ అరెస్ట్‌‌కు నిరసనగా ఇందిరా పార్క్‌‌ వద్ద నిరాహార దీక్షలు

ముషీరాబాద్, వెలుగు: ప్రతిపక్ష నేతలను నిర్బంధించడం ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు అని ఇండియా కూటమి నేతలు అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను బీజేపీ రాజకీయ ఆయుధాలుగా వాడుకుంటోందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం, కేసులు పెట్టడం, అరెస్ట్‌‌ చేయడం ప్రధాని మోదీ నియంతృత్వానికి నిదర్శనం అన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌ అరెస్ట్‌‌ను నిరసిస్తూ ఆప్‌‌ తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరా పార్క్‌‌ ధర్నా చౌక్‌‌ వద్ద సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్‌‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్‌‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌‌, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్. బాలమల్లేశ్‌‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, ఆర్‌‌ఎస్‌‌పీ ప్రధాన కార్యదర్శి జానకీరాం, కాంగ్రెస్ నాయకులు వినోద్‌‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేజ్రీవాల్‌‌పై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకొని, జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌‌ చేశారు.

కేజ్రీవాల్‌‌ కారణంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి నష్టం తప్పదని భయపడే ఆయనను అరెస్ట్‌‌ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్‌‌ కేసులో ఉన్న ఆప్‌‌ నేతలపై ఈడీ, సీబీఐ ఒక్క సాక్ష్యాన్ని కూడా చూపించలేకపోయిందన్నారు. లిక్కర్‌‌ కేసులోనే అరెస్ట్‌‌ అయిన మద్యం వ్యాపారి శరత్‌‌ చంద్రారెడ్డి బీజేపీ నుంచి రూ. 55 కోట్ల ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయగానే ఎలాంటి షరతులు లేకుండా బెయిల్ ఇప్పించారని ఆరోపించారు.

ప్రధాని మోదీ తన నియంతృత్వ చర్యలతో ప్రతిపక్ష లీడర్లను నిర్బంధిస్తే ఊరుకునేది లేదని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. దీక్షల్లో ఆప్‌‌ రాష్ట్ర కోర్‌‌ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్, ఎంఏ. మజీద్, మహిళా విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హేమ జిల్లోజు, నర్సింగ్‌‌ యమున గౌడ్‌‌, అధికార ప్రతినిధి జావేద్‌‌ షరీఫ్‌‌ పాల్గొన్నారు.