పాట్నా: బిహార్‌లో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఇండియా కూటమి హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో ప్రతి కుటుంబంలో ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ ఇస్తామని ప్రకటించింది. మంగళవారం పాట్నాలో మహాఘట్బంధన్ మేనిఫెస్టోను కాంగ్రెస్ సీనియర్ లీడర్ పవన్ ఖేరా, కూటమిలోని ఇతర పార్టీల నేతలతో కలిసి సీఎం క్యాండిడేట్, ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ విడుదల చేశారు.
‘బిహార్ కా తేజస్వీ ప్రాణ్’ పేరుతో 32 పేజీల్లో 25 ముఖ్యమైన అంశాలతో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ చట్టం తీసుకొస్తం. ఈ స్కీమ్‌ను 20 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం. ప్రతి కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం” అని వెల్లడించారు.
తాము కొత్త బిహార్‌ను నిర్మిస్తామని పేర్కొన్నారు. పవన్ ఖేరా మాట్లాడుతూ.. ‘‘మేమే ఫస్ట్ సీఎం క్యాండిడేట్‌ను ప్రకటించాం. మేనిఫెస్టో కూడా మేమే ఫస్ట్ ఇచ్చాం. దీన్ని బట్టి బిహార్ గురించి మేమెంత సీరియస్‌గా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు” అని అన్నారు. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ చీఫ్ ముఖేశ్ సహానీ మాట్లాడుతూ.. ‘‘మేం ఈరోజు కొత్త బిహార్ కోసం సంకల్ప పత్రాన్ని విడుదల చేశాం. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం” అని పేర్కొన్నారు.
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివీ..
- ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్.
- ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ.
- రాష్ట్రంలో వక్ఫ్ సవరణ చట్టం అమలు నిలుపుదల.
- జీవికా దీదీలుగా పని చేస్తున్నోళ్లందరూ పర్మనెంట్. నెలకు రూ.30 వేల జీతం.
- కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులందరు కూడా పర్మనెంట్.
- ‘మాయ్ బెహిన్ మాన్ యోజన’ కింద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం.
- బోధ్ గయాలోని బుద్ధుడి ఆలయాల నిర్వహణ బౌద్ధ కమ్యూనిటీకి అప్పగింత.
బిహార్‌లో నిరుద్యోగ తాండవం: తేజస్వీ
బిహార్‌లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిందని ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. దీని గురించి ఎన్డీయే సర్కార్‌కు ఎలాంటి బాధ లేదని ఫైర్ అయ్యారు. ‘‘సారణ్ జిల్లాలో ప్రతిరోజూ మర్డర్లు, దొపిడీలు, దొంగతనాలు, కిడ్నాప్‌లు జరుగుతున్నాయి. కానీ సీఎం నితీశ్ కుమార్ మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదు. కనీసం బాధితులను కలిసి పరామర్శించడం లేదు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేకుండా పోయింది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము అధికారంలోకి రాగానే లా అండ్ ఆర్డర్‌ను కట్టుదిట్టం చేస్తామని తేజస్వీ చెప్పారు. ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం సారణ్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో తేజస్వీ యాదవ్ మాట్లాడారు. రాష్ట్రంలో యువత నిరుద్యోగ సమస్యతో, జనం ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. విద్య, వైద్యం, ఉద్యోగాలు, సాగునీటి సౌలతులు కల్పించే ప్రభుత్వం కావాలని బిహార్ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
