పాక్ వంకర బుద్ధి!.. కాల్పుల విరమణకు ఒప్పుకుని.. మళ్లీ ఫైరింగ్

పాక్ వంకర బుద్ధి!.. కాల్పుల విరమణకు ఒప్పుకుని.. మళ్లీ ఫైరింగ్
  • సామాన్య ప్రజలే లక్ష్యంగా కాల్పులు, డ్రోన్ అటాక్స్ 
  • జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్​పైకి డ్రోన్లు 
  • శ్రీనగర్​లో మళ్లీ సైరన్ల మోత.. బ్లాకౌట్ 
  • భారీగా పేలుడు, కాల్పుల శబ్దాలు వినిపించాయన్న ఒమర్ అబ్దుల్లా 
  • ఎయిర్ డిఫెన్స్ అలర్ట్.. అన్ని చోట్లా పాక్ డ్రోన్ల కూల్చివేత 

న్యూఢిల్లీ: పాకిస్తాన్ మళ్లీ తన వంకరబుద్ధిని బయటపెట్టుకుంది. కాల్పుల విరమణకు అంగీకరించి కొన్ని గంటలు కూడా గడవకముందే ఒప్పందానికి తూట్లు పొడిచి మళ్లీ దాడులకు తెగబడింది. పాక్ బలగాలు సాధారణ పౌరులనే టార్గెట్​గా చేసుకుని రాత్రిపూట ఎల్ఓసీ నుంచి పెద్ద ఎత్తున కాల్పులు జరిపాయి. శనివారం సాయంత్రం కాల్పుల విరమణకు అంగీకరించినట్టు ప్రకటన చేసిన పాక్.. ఆ తర్వాత కొన్ని గంటలకే మళ్లీ కుక్కతోక వంకర అన్నట్టుగా సరిహద్దు వెంబడి కాల్పులు జరుపుతూ, డ్రోన్ దాడులకు పాల్పడింది. దాదాపు మూడు గంటలపాటు జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలపై మళ్లీ కాల్పులు, డ్రోన్ దాడులు చేసింది. జమ్మూకాశ్మీర్​లోని శ్రీనగర్​తోపాటు పంజాబ్​లోని అమృత్​సర్, రాజస్థాన్​లోని జైసల్మేర్, పోఖ్రాన్ పైకి పాక్ డ్రోన్​లు రాగా, వాటిని మన బలగాలు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ తో పేల్చేశాయి. శ్రీనగర్ లో మళ్లీ సైరన్ మోతలు మోగాయి. సిటీ అంతా బ్లాకౌట్ విధించారు. వైష్ణోదేవి యాత్ర బేస్ క్యాంప్ వద్ద కూడా డ్రోన్ యాక్టివిటీ కనిపించడంతో ఆ ప్రాంతంలో బ్లాకౌట్ ప్రకటించారు. 

బారాముల్లాలో ఓ డ్రోన్​ను కూల్చేశారు. సాంబా, రాజౌరీ సెక్టార్లలోనూ డ్రోన్​లను కూల్చేశారు. పంజాబ్​లో అమృత్​సర్, గురుదాస్ పూర్, ఫిరోజ్​పూర్, పఠాన్​కోట్, హోషియార్​పూర్, జలంధర్, ఫరీద్ కోట్​లలో డ్రోన్ లను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో లైట్లు ఆఫ్​ చేశారు. పాక్ బలగాలు ఎల్ఓసీ వెంబడి మళ్లీ కాల్పులు జరిపాయి. జమ్మూలోని అఖ్నూర్, రాజౌరీ, ఆర్ఎస్ పురా సెక్టార్స్​లో ఆర్టిలరీ షెల్లింగ్​కు పాల్పడ్డాయి. గుజరాత్​లోని కచ్ జిల్లాలోనూ పాక్ డ్రోన్లు కనిపించాయి. అన్ని చోట్లా పాక్ దాడులను మన బలగాలు దీటుగా తిప్పికొట్టాయని అధికారులు వెల్లడించారు.  భారత్, పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ముందుగా శనివారం సాయంత్రం ప్రకటించారు. సాయంత్రం 5 గంటల నుంచే సీజ్ ఫైర్ అమలులోకి వచ్చిందన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే భారత్, పాక్ విదేశాంగ శాఖలు కూడా కాల్పుల విరమణకు అంగీకరించినట్టుగా వేర్వేరుగా ప్రకటనలు చేశాయి. తమ గగనతలాన్ని ఓపెన్ చేస్తున్నామని కూడా పాక్ ప్రకటించింది. కానీ కాల్పుల విరమణకు ఒప్పుకున్నామని ప్రకటించిన కొన్ని గంటలకే రాత్రిపూట మళ్లీ కాల్పులకు, డ్రోన్ దాడులకు తెగబడింది. కాగా, ట్రంప్ ప్రకటన తర్వాత మన విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడారు.‘‘మధ్యాహ్నం భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ)కు పాక్ డీజీఎంఓకు కాల్ చేశారు. ఆయా అంశాలపై చర్చించిన అనంతరం ఇరుపక్షాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయి. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి భూతలం, గగనతలం, సముద్రతలంపై కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది” అని ప్రకటించారు. రెండు దేశాల డీజీఎంఓల మధ్య 12వ తేదీన మరోసారి చర్చలు కూడా జరుగుతాయన్నారు.    

సీజ్ ఫైర్ తర్వాత ఇదేంటీ?: ఒమర్ అబ్దుల్లా  

శ్రీనగర్ అంతటా మళ్లీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని శనివారం రాత్రి జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. ‘‘కాల్పుల విరమణకు ఒప్పుకున్న తర్వాత మళ్లీ ఇదేమిటి? శ్రీనగర్ అంతటా పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి” అని ఆయన ట్వీట్ చేశారు. ‘‘కాల్పుల విరమణ లేదు. శ్రీనగర్ సిటీ నడిబొడ్డున మళ్లీ ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు యాక్టివేట్ అయ్యాయి” అని పేర్కొన్నారు. ఆ తర్వాత కొన్ని నిమిషాలకు శ్రీనగర్ వాసులు కూడా అనేక మంది సిటీపైకి డ్రోన్లు వస్తున్న వీడియోలను ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. శ్రీనగర్ పైకి వస్తున్న డ్రోన్లను యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ లతో మన బలగాలు పేల్చివేస్తుండగా.. రాత్రిపూట ఆకాశంలో మంటలతో భారీ పేలుళ్లు జరగడం ఆ వీడియోల్లో కనిపించింది. 

బీఎస్ఎఫ్ ఎస్ఐ మృతి

ఎల్ఓసీ నుంచి పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్ఐ మహ్మద్ ఇంతియాజ్ మృతిచెందారు. శనివారం జమ్మూ జిల్లాలోని ఆర్ఎస్ పురా బార్డర్ ఔట్ పోస్టుకు ఆయన నాయకత్వం వహించారని, పాక్ జవాన్ల కాల్పులకు దీటుగా ఎదురుకాల్పులు జరుపుతుండగా బుల్లెట్లు తగిలి మరణించారని ఈ మేరకు బీఎస్ఎఫ్​‘ఎక్స్’లో ప్రకటించింది.  

ఇకపైనా టెర్రరిజాన్ని సహించబోం: జైశంకర్ 

భారత్, పాక్ సైనిక చర్య, కాల్పులు నిలిపివేయడంపై ఒక అంగీకారానికి వచ్చాయని విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు. కాల్పుల విరమణపై ట్రంప్ ప్రకటన తర్వాత జైశంకర్ శనివారం సాయంత్రం ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా ఇండియా రాజీలేని పోరాటం చేస్తుంది. ఇదే విషయాన్ని నిరంతరం తేల్చిచెప్తున్నాం. ఇకపైనా టెర్రరిజానికి వ్యతిరేకంగా ఇదే వైఖరి ఉంటుంది” అని ఆయన స్పస్టం చేశారు. కాగా, ఇండియా స్పందన ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగానే ఉంటుందని అంతకుముందు జైశంకర్ చెప్పారు. శనివారం మధ్యాహ్నం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఫోన్ లో మాట్లాడానని, భారత్ స్పందన బాధ్యతాయుతంగానే ఉంటుందని స్పష్టం చేశానని ఆయన తెలిపారు.    

పాక్​ది దుర్మార్గపు చర్య: విక్రమ్ మిస్రీ 

కాల్పుల విరమణకు ఒప్పుకున్న కొన్ని గంటలకే పాకిస్తాన్ ఆ ఒప్పందానికి తూట్లు పొడిచిందని భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ ఫైర్ అయ్యారు. ఇది దుర్మార్గపు చర్య అని అన్నారు. శనివారం రాత్రి ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ బలగాలు సరిహద్దు పొడవునా కాల్పులు జరుపుతున్నాయని, మన బలగాలు దీటుగా తిప్పికొడుతున్నాయని చెప్పారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్​లో బ్లాకౌట్స్ ప్రకటించామన్నారు. పాక్​ ఉల్లంఘనలు నిలువరించేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిపారు. ‘‘డీజీఎంఓ ఒప్పందాన్ని ఉల్లంఘించడం సరికాదు. దీనికి పాక్ బాధ్యత వహించాలి. కాల్పుల విరమణ పాటించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ దేశానికి సూచించాం” అని మిస్రీ తెలిపారు.

మేం శాంతి కోసమే పని చేస్తాం: పాక్ విదేశాంగ మంత్రి  

ట్రంప్ ప్రకటన తర్వాత శనివారం సాయంత్రం పాక్ విదేశాంగ మంత్రి, డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ కూడా స్పందించారు. భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆయన ‘ఎక్స్’లో ప్రకటన చేశారు. పాకిస్తాన్ ఎల్లప్పుడూ శాంతి కోసం కృషి చేస్తుందని, తన సార్వభౌమత్వం విషయంలో రాజీపడకుండానే ప్రాంతీయ భద్రతకు కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.