టెర్రరిజానికి మద్దతిచ్చేవాళ్లను ఆ టెర్రరిజమే కాటేస్తుంది..పాక్, చైనాపై భారత్ ఫైర్

టెర్రరిజానికి మద్దతిచ్చేవాళ్లను ఆ టెర్రరిజమే కాటేస్తుంది..పాక్, చైనాపై భారత్ ఫైర్
  • పహల్గామ్​ దాడికి కారణమైన టీఆర్​ఎఫ్​ను ఓ దేశం వెనుకేసుకొచ్చింది
  • ఆ దేశాన్ని మరో దేశం సమర్థించేందుకు ప్రయత్నించింది
  • నామ్​ మీటింగ్​లో పరోక్షంగా పాక్​, చైనాపై భారత్​ ఫైర్​

కంపాలా: ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని, దాన్ని కలిసికట్టుగా అంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాన్​ అలైన్డ్​ మూవ్​మెంట్​ (నామ్ –అలీన ఉద్యమం​) సదస్సులో భారత్​ పిలుపునిచ్చింది. టెర్రరిజానికి మద్దతిచ్చేవాళ్లు, దాన్ని ప్రోత్సహించేవాళ్లు, ఆ టెర్రరిజం చేతుల్లోనే దెబ్బతింటారని హెచ్చరించింది. క్లైమెట్​ చేంజ్​, ఆర్థిక వృద్ధి, టెక్నాలజీ, ట్రేడ్​, టారిఫ్​ సహా అన్ని అంశాల్లో ఉమ్మడిగా ముందుకు సాగుదామని నామ్​ సభ్య దేశాలకు సూచించింది.

 ఉగాండాలోని కంపాలాలో జరుగుతున్న నామ్​ 19వ నామ్​ మిడ్​టర్మ్​ మినిస్టీరియల్​ మీటింగ్​లో భారత్​ తరఫున విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్​సింగ్ మాట్లాడారు. దశాబ్దాలుగా భారత్​ బార్డర్​ టెర్రరిజాన్ని ఎదుర్కొంటున్నదని, ఈ ఏడాది ఏప్రిల్​ 22న జమ్మూకాశ్మీర్​లోని పహల్గామ్​లో అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారని ఆయన అన్నారు. 

ఉగ్రవాదులకు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారికి భారత్​ తగిన గుణపాఠం చెప్పిందని పేర్కొన్నారు.  ‘‘పహల్గామ్​ ఉగ్రదాడి ఘటన యూఎన్​ సెక్యూరిటీ కౌన్సిల్​లో చర్చకు వచ్చినప్పుడు ఓ సభ్య దేశం.. దాడికి పాల్పడ్డ ది రెసిస్టెన్స్​ ఫ్రంట్ (టీఆర్​ఎఫ్​)​ అనే ఉగ్రవాద సంస్థను రక్షించేందుకు ప్రయత్నించింది.. మరో దేశం ఆ దేశాన్ని సమర్థించేందుకు ప్రయత్నించింది” అని పరోక్షంగా పాకిస్తాన్​, చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

‘‘ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవాళ్లను, దాన్ని దాచి పెట్టాలనుకునే వాళ్లను.. ఆ ఉగ్రవాదమే కాటేస్తుంది. టెర్రరిజాన్ని అంతమొందించేందుకు అంతర్జాతీయ స్థాయిలో ఐక్యంగా ముందుకు సాగాలి. ఉగ్రవాదాన్ని అంతం చేసే ఉద్యమంలో నామ్​లోని ప్రతి సభ్య దేశం కలిసి ముందుకు సాగాలి. సవాళ్లను గుర్తించి ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలి. భారత్​ ఎప్పుడూ ప్రపంచ శాంతిని కోరుకుంటుంది” అని తెలిపారు. 

భారతదేశం నామ్​ సూత్రాలకు, విలువలకు కట్టుబడి ఉందని.. భాగస్వామ్య దేశాలతో కలిసి ముందుకు సాగుతున్నదని ఆయన తెలిపారు. ప్రస్తుతం నామ్​లో 120 సభ్యదేశాలు ఉన్నాయి. మరో 18 అబ్జర్వ్​ కంట్రీస్​, 10 అబ్జర్వ్​ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి.

పాలస్తీనా సమస్యకు ప్రత్యేక దేశమే పరిష్కారం 

పాలస్తీనా సమస్యకు ప్రత్యేక దేశమే ఆచరణీయ మార్గమని భారత్​ మరోసారి తేల్చిచెప్పింది. స్వయం నిర్ణయాధికారం, స్వాత్రంత్యం కోసం పాలస్తీనా ప్రజలు చేస్తున్న పోరాటానికి భారత్​ తన మద్దతును కొనసాగిస్తుందని కేంద్ర మంత్రి కీర్తివర్ధన్​ సింగ్​ స్పష్టం చేశారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని, శాంతి నెలకొనాలని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు.