
- మెయిల్, పార్సిల్ సర్వీసులూ నిలిపివేత.. మన పోర్టుల్లో పాక్ షిప్పులకు ఎంట్రీ కూడా బంద్
- రాజస్తాన్‌లో హద్దు దాటిన పాక్ జవాన్.. అదుపులోకి తీసుకున్న మన బీఎస్ఎఫ్
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లోకి ఉగ్రమూకలను ఎగదోసి నరమేధానికి పాల్పడటమే కాకుండా బార్డర్లో కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్‌కు కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. దాయాది దేశం నుంచి అన్ని రకాల దిగుమతులను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. పాక్‌లో ఉత్పత్తి అయ్యే లేదా ఎగుమతి అయ్యే అన్ని వస్తువులనూ డైరెక్ట్‌గా లేదా ఇన్ డైరెక్ట్‌గా దిగుమతి చేసుకోవడాన్ని లేదా రవాణా చేయడాన్నీ నిషేధిస్తున్నట్టు ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్ టీ) శుక్రవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
అలాగే పాక్ నుంచి ఎయిర్, సర్ఫేస్ రూట్లలో నిర్వహిస్తున్న మెయిల్, పార్సిల్ సర్వీసులనూ బ్యాన్ చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. భారత పోర్టుల్లోకి పాక్ జెండాలు ఉన్న షిప్పులనూ నిలిపి ఉంచేందుకు ఇకపై అనుమతి లేదని వెల్లడించింది. పాకిస్తాన్ నుంచి ఇతర దేశాలకు వెళ్తున్న లేదా ఇతర దేశాల నుంచి పాక్ కు వెళ్తున్న షిప్పులకు భారత పోర్టుల్లో ఎంట్రీ ఉండదని తేల్చిచెప్పింది. ఈ మూడు రకాల నిషేధాలు తక్షణమే అమలులోకి వచ్చాయని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ అమలులో ఉంటాయని పేర్కొంది. దేశ భద్రత, పబ్లిక్ పాలసీ ప్రయోజనార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకున్న కొన్ని వస్తువుల దిగుమతులకు మాత్రమే మినహాయింపు ఉంటుందని వెల్లడించింది.
వేటికి మినహాయింపు ఇవ్వాలన్నది ఆయా సందర్భాలను బట్టి ఒక్కో కేసును వేర్వేరుగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని వివరించింది. అలాగే ఇండియన్ జెండా ఉన్న షిప్పులు ఏవీ పాక్ పోర్టుల్లోకి వెళ్లకూడదని కూడా కేంద్రం ఆదేశించింది. దేశ ఆస్తులు, కార్గో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ భద్రత కోసం, భారత షిప్పింగ్ ప్రయోజనం కోసం మర్చంట్ షిప్పింగ్ యాక్ట్, 1958 ప్రకారం.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఒకవేళ మినహాయింపులు అవసరమైతే పరిశీలించి అనుమతి జారీ చేస్తామని పేర్కొంది.
ఇండియాపై నో ఎఫెక్ట్..
భారత్ నుంచి పాకిస్తాన్‌కు 2021–22లో 513.82 మిలియన్ డాలర్లు, 2022–23లో 627.1 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అయ్యాయి. పాకిస్తాన్ నుంచి భారత్ కు కేవలం 2.54 మిలియన్ డాలర్లు, 20.11 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులు మాత్రమే దిగుమతి అయ్యాయి. అలాగే 2024 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్యలో మన దేశం నుంచి పాక్ కు 447.65 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి కాగా, ఆ దేశం నుంచి కేవలం 0.42 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులు మాత్రమే దిగుమతి అయ్యాయి. పాక్ నుంచి దిగుమతి అయిన వాటిలో ఫిగ్స్, తులసి, రోజ్ మేరీ ఉత్పత్తులు, కొన్ని కెమికల్స్, హిమాలయన్ పింక్ సాల్ట్ వంటివి ఉన్నాయి.
అయితే, భారత్ నుంచి అనేక వస్తువులను డైరెక్ట్ గా లేదా థర్డ్ కంట్రీ ద్వారా ఇన్ డైరెక్ట్ గా పాక్ దిగుమతి చేసుకుంటోంది. పాక్ నుంచి మాత్రం భారత్‌కు అతికొద్ది వస్తువులు మాత్రమే వస్తున్నాయి. పాక్ నుంచి దిగుమతులను ఆపేయడం వల్ల ఒక్క హిమాలయన్ పింక్ సాల్ట్‌కు తప్ప మిగతా ఏ వస్తువుకూ ఇబ్బంది లేదని నిపుణులు చెప్తున్నారు.
మన నేవీ త్రిశూల శక్తి ప్రదర్శన
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత్ ఏ క్షణమై నా యుద్ధం ప్రకటించే సంకేతాలు కనిపిస్తుండడంతో త్రివిధ దళాలు సిద్ధమవుతున్నాయి. శుక్రవారం గంగా ఎక్స్‌ప్రెస్‌వే పై వాయుసేన ఫైటర్ జెట్స్ గర్జించగా.. శనివారం ఇండియన్ నేవీ తన త్రిశూల శక్తిని ప్రదర్శించింది. షిప్, సబ్‌మెరైన్, హెలికాప్టర్‌తో సముద్రంలో గస్తీ కాస్తున్న ఫొటోను నేవీ షేర్ చేసింది.
ఇందులో ఐఎన్‌ఎస్ కోల్‌కతా, ధ్రువ్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్), స్కార్పీన్ తరగతికి చెందిన జలాంతర్గామి ఉన్నాయి. ‘‘ఇది ఇండియన్ నేవీ త్రిశూల శక్తి.. సముద్రం పైన.. కింద.. అలల మీదుగా’’ అని అర్థం వచ్చేలా ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. ‘ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎలా అయినా” అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది.