
- విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోవడంతో ముగ్గురిపై బ్యాటింగ్ భారం
(వెలుగు స్పోర్డ్స్ డెస్క్) : విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒక దశాబ్దానికి పైగా టీమిండియా టెస్టు జట్టుకు మహాస్తంభాలుగా నిలిచారు. బ్యాటర్లుగానే కాకుండా నాయకులుగా ఎన్నో గొప్ప విజయాలు అందించారు. ఇప్పుడు ఈ ఇద్దరూ లేకుండా ఒక దశాబ్దం తర్వాత టీమిండియా అత్యంత కఠినమైన ఇంగ్లండ్ టూర్‌కు సిద్ధమైంది. ఐదు టెస్టుల సిరీస్ ఈనెల 20 నుంచి జరిగే తొలి మ్యాచ్‌తో షురూ అవుతోంది. కోహ్లీ, రోహిత్ వంటి లెజెండ్స్ టెస్ట్ జట్టులో లేని ఈ తరుణంలో ఇండియా బ్యాటింగ్ భవిష్యత్తు ఇప్పుడు యువ భుజాలపై పడ్డాయి. ఈ కీలక సమయంలో ముగ్గురు ఆటగాళ్లు - కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్‌లోని కఠిన పరిస్థితులలో ఇండియా బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలవనున్నారు.
నిలకడ కోసం కేఎల్ నిరీక్షణ
33 ఏండ్ల కేఎల్ రాహుల్ ప్రస్తుత జట్టులో అత్యంత ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాటర్. ఇంగ్లండ్‌పై 13 టెస్టుల్లో 3 సెంచరీలతో సహా 955 రన్స్ చేసిన రాహుల్‌లో టన్నుల కొద్దీ టాలెంట్ ఉంది. కానీ, ఇప్పటికే ఎంతో దూరం వెళ్లాల్సిన అతను నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నాడనేది అంతే వాస్తవం. ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత, వరుస వైఫల్యాలతో నిరాశపరచడం అతనికి అలవాటు. 2018లో ఓవల్ గ్రౌండ్లో ఇండియా 121/5 స్కోరుతో కష్టాల్లో ఉన్నప్పుడు అతను సాధించిన 149 రన్స్ ఇన్నింగ్స్ చారిత్రాత్మకం.
కానీ అదే సిరీస్‌లోని మిగిలిన 9 ఇన్నింగ్స్‌ల్లో 152 రన్సే చేశాడు. 2021 టూర్లోనూ ఇదే రిపీటైంది. లార్డ్స్‌లో అతని అద్భుతమైన 129 రన్స్ ఇన్నింగ్స్ ఇండియాకు గొప్ప విజయాన్ని అందించగా ఆ తర్వాత వరుసగా సింగిల్-డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఇంగ్లండ్ గడ్డపై రాహుల్ సగటు (34.11) అతని స్థాయికి తగింది కాదు. ఈ సిరీస్ అతనికి చివరి అవకాశం కావచ్చు. కేవలం మెరుపులు మెరిపించే ఆటగాడు అనే ముద్రను చెరిపేసి, జట్టుకు నమ్మకమైన మిడిలార్డర్ బ్యాటర్‌గా మారతాడో లేదో చూడాలి.
డ్యుయల్ రోల్లో గిల్ హిట్టవుతాడా?
ఒక ఆటగాడిగా ఇంకా ఎదుగుతున్న దశలోనే ఇంగ్లండ్‌లో ఇండియా టెస్ట్ జట్టుకు కెప్టెన్సీ చేపట్టడం అనే కఠినమైన బాధ్యతను శుభ్‌మన్ గిల్ స్వీకరించాడు. ఇది తనపై మామూలు భారం కాదు. స్వదేశంలో అతని టెస్టు సగటు 42.03 బాగానే ఉంది. కానీ, విదేశాల్లో (29.50) మాత్రం తేలిపోతున్నాడు. పైగా, ఇంగ్లండ్‌లో ఆడిన 3 టెస్టుల్లో కేవలం 14.66 సగటుతో 88 రన్స్ మాత్రమే చేశాడు. దాంతో ఈ సిరీస్ అతని బ్యాటింగ్ టెక్నిక్కే కాకుండా మానసిక స్థైర్యానికి పెద్ద పరీక్ష అవుతుంది. తను క్రీజులో ఎంతసేపు నిలబడతాడన్న దానికంటే ఒత్తిడిలో జట్టును ఎలా నడిపిస్తాడన్న దానిపైనే అందరి దృష్టి ఉంటుంది.
కెప్టెన్సీ భారం అతని బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతుందా లేక అదనపు బాధ్యతతో మరింత రాటుదేలుతాడా అనేది ఈ సిరీస్‌లో తేలిపోనుంది. ఏదేమైనా మోడ్రన్ గ్రేట్స్ కోహ్లీ, రోహిత్ ఇద్దరూ లేకుండా 2011 తర్వాత ఇండియా ఆడుతున్న తొలి పూర్తి స్థాయి టెస్ట్ సిరీస్ ఇది. ఈ నేపథ్యంలో రాహుల్, జైస్వాల్, గిల్ వ్యక్తిగత పెర్ఫామెన్స్ మాత్రమే కాకుండా వారి సమష్టి కృషి జట్టుకు అత్యంత కీలకం కానుంది. ఈ ముగ్గురి బ్యాట్ల నుంచి వచ్చే రన్స్ ఈ సిరీస్ ఫలితాన్నే కాకుండా ఇండియా టెస్ట్ టీమ్ భవిష్యత్ దిశను కూడా నిర్దేశిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
డేరింగ్ బ్యాటర్ జైస్వాల్‌కు స్వింగ్ సవాల్
కేఎల్‌కు పూర్తి భిన్నంగా 23 ఏండ్ల యశస్వి జైస్వాల్ డేరింగ్, డాషింగ్ ఆటతీరుతో టెస్ట్ క్రికెట్లోకి దూసుకొచ్చాడు. బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ఇండియా టాప్ స్కోరర్‌గా నిలిచిన అతను ఇప్పుడు రోహిత్ గైర్హాజరీలో సీనియర్ ఓపెనర్‌గా అతను టూర్‌కు వస్తున్నాడు. ఇండియాలో ఆడిన 10 మ్యాచ్‌ల్లో 60.61 సగటుతో రాణించినప్పటికీ ఈ టూర్ అతని కెరీర్లోనే అతిపెద్ద సవాల్ కానుంది. స్వింగ్ అయ్యే డ్యూక్ బాల్స్, ఇంగ్లండ్ సీమర్ల లాంగ్ స్పెల్స్ జైస్వాల్ టెక్నిక్కు, సహనానికి అసలైన పరీక్ష పెడతాయి. కష్ట సమయంలో సలహా ఇచ్చేందుకు క్రీజులో మరోవైపు కోహ్లీ, రోహిత్ వంటి దిగ్గజాలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ స్వింగ్ సవాలును జైస్వాల్ ఎలా అధిగమిస్తాడన్న దానిపైనే సిరీస్‌లో ఇండియా శుభారంభం ఆధారపడి ఉంది.