
తిరువనంతపురం: తొలి ఓవర్ ఆరో బాల్‌కే ఫస్ట్ వికెట్.. తర్వాతి ఓవర్‌లో నాలుగు బాల్స్ తేడాలో మూడు వికెట్లు.. మూడో ఓవర్‌లో మళ్లీ ఓ వికెట్.. మ్యాచ్ మొదలైన తొలి పది నిమిషాల్లో ఇండియా పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ (3/32), దీపక్ చహర్ (2/24) సృష్టించిన విధ్వంసం ఇది. దీంతో 9 రన్స్‌కే 5 కీలక వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా.. తొలి టీ20లో ఘోరంగా చతికిలపడిన వేళ.. టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా సౌతాఫ్రికా 20 ఓవర్లలో 106/8 స్కోరే చేసింది. కేశవ్ మహారాజ్ (35 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 41), మార్‌క్రమ్ (25), పార్నెల్ (24) రాణించారు. తర్వాత ఇండియా 16.4 ఓవర్లలో 110/2 స్కోరు చేసి గెలిచింది. కేఎల్ రాహుల్ (56 బాల్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 నాటౌట్), సూర్యకుమార్ (33 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 నాటౌట్) ఫిఫ్టీలు చేశారు. అర్ష్‌దీప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రెండో మ్యాచ్ గువాహతిలో 2న జరుగుతుంది.
15 బాల్స్‌కే 5 వికెట్లు
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్ నిర్ణయం సరైందేనని తొలి ఓవర్‌లోనే రుజువైంది. ఇన్నింగ్స్ ఆరో బాల్‌కే చహర్.. కెప్టెన్ బవూమ (0)ను డకౌట్ చేశాడు. ఆపై రెండో ఓవర్‌లో అర్ష్‌దీప్ ఘోరమైన దెబ్బ కొట్టాడు. రెండు, ఐదు, ఆరో బాల్‌కు వరుసగా డికాక్ (1), రొసోవ్ (0), మిల్లర్ (0)ను పెవిలియన్‌కు చేర్చాడు. ఓ ఫుల్ లెంగ్త్ బాల్ డికాక్ వికెట్లను పడగొడితే.. సూపర్ ఔట్ స్వింగర్ రొసోవ్‌ను.. మరో ఇన్ స్వింగర్ మిల్లర్‌ను దెబ్బకొట్టింది. తర్వాతి ఓవర్లో చహర్... స్టబ్స్(0)ను వెనక్కి పంపడంతో ప్రొటీస్ 15 బాల్స్‌లోనే 9/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రెండు ఫోర్లతో మార్‌క్రమ్, సిక్స్‌తో పార్నెల్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ, బౌలింగ్ ఛేంజర్‌గా వచ్చిన హర్షల్ (2/26).... 8వ ఓవర్‌లో మార్‌క్రమ్‌ను ఔట్ చేయడంతో ఆరో వికెట్‌కు 33 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయ్యింది. ఇక్కడి నుంచి కేశవ్ మహారాజ్ ఇన్నింగ్స్‌కు పెద్ద దిక్కుగా మారాడు. కానీ మిడిల్ ఓవర్స్‌నూ స్పిన్నర్లు అశ్విన్ (0/8), అక్షర్ పటేల్ (1/16) కట్టడి చేయడంతో రన్‌రేట్ మందగించింది. 16వ ఓవర్‌లో అక్షర్.. పార్నెల్‌ను ఔట్ చేశాడు. తర్వాతి రెండు ఓవర్లలో 11 రన్స్ రాగా, 19వ ఓవర్‌లో కేశవ్ 4, 6, 4తో 17 రన్స్ రాబట్టడంతో స్కోరు 100 దాటింది. లాస్ట్ ఓవర్‌లో హర్షల్... కేశవ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
కోహ్లీ, రోహిత్ ఫెయిల్..
చిన్న టార్గెట్‌ను ఇండియా స్లోగా ఛేదించింది. రోహిత్ (0), కోహ్లీ (3) ఫెయిలైనా.. రాహుల్, సూర్య నెమ్మదిగా ఆడి లక్ష్యాన్ని అందుకున్నారు. మొదట సింగిల్స్, డబుల్స్‌కే పరిమితమైన ఈ జోడీ.. తర్వాత గేర్ మార్చింది. సూర్య వరుస సిక్సర్లతో జోష్ పెంచడంతో.. పవర్‌ప్లేలో 17/1 ఉన్న స్కోరు 10 ఓవర్లకు 47/2కు చేరింది. తర్వాత సూర్య రెండు ఫోర్లు, కేఎల్ రెండో సిక్సర్‌తో బ్యాట్ ఝుళిపించారు. 13వ ఓవర్‌లో సూర్య సిక్సర్ కొట్టాడు. 15వ ఓవర్‌లో రాహుల్ దీనిని రిపీట్ చేశాడు. ఆ వెంటనే సూర్య మూడు ఫోర్లు కొట్టి ఫిఫ్టీ కంప్లీట్ చేశాడు. రాహుల్ సిక్సర్‌తో ఫిఫ్టీ అందుకుని లాంఛనం పూర్తి చేశాడు.