దంచికొట్టిన స్మృతి, షెఫాలీ.. నాలుగో టీ20లో ఇండియా విజయం.. 30 రన్స్‌‌‌‌ తేడాతో లంక ఓటమి

దంచికొట్టిన స్మృతి, షెఫాలీ.. నాలుగో టీ20లో ఇండియా విజయం.. 30 రన్స్‌‌‌‌ తేడాతో లంక ఓటమి
  • రాణించిన రిచా, అరుంధతి, వైష్ణవి
  • చామరి, హాసిని, ఇమేషా పోరాటం వృథా

తిరువనంతపురం: శ్రీలంకతో జరిగిన నాలుగో టీ20లో ఇండియా అమ్మాయిలు పరుగుల వరద పారించారు. స్మృతి మంధాన (48 బాల్స్‌‌‌‌లో 11 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 80), షెఫాలీ వర్మ (46 బాల్స్‌‌‌‌లో 12 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 79), రిచా ఘోష్‌‌‌‌ (16 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 40 నాటౌట్‌‌‌‌) బ్యాట్లు ఝుళిపించడంతో.. ఆదివారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో ఇండియా 30 రన్స్‌‌‌‌ తేడాతో లంకపై గెలిచింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో టీమిండియా 4–0 ఆధిక్యంలో నిలిచింది. టాస్‌‌‌‌ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 221/2 స్కోరు చేసింది. తర్వాత లంక 20 ఓవర్లలో 191/6 స్కోరు చేసింది. కెప్టెన్‌‌‌‌ చామరి ఆటపట్టు (52) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. స్మృతికి ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన ఐదో టీ20 మంగళవారం ఇదే వేదికపై జరుగుతుంది. 

తొలి వికెట్‌‌‌‌కు 162 పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌
ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియాకు ఓపెనర్లు మంధాన, షెఫాలీ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి ఓవర్‌‌‌‌లోనే రెండు ఫోర్లతో స్మృతి టచ్‌‌‌‌లోకి రాగా, తర్వాతి ఓవర్‌‌‌‌లో షెఫాలీ కూడా బౌండ్రీ కొట్టింది. ఈ ఇద్దరు పోటీ పడి ఫోర్లు దంచడంతో పవర్‌‌‌‌ప్లేలో ఇండియా 61/0 స్కోరు చేసింది. ఫీల్డింగ్‌‌‌‌ పెరిగిన తర్వాత లంక బౌలర్ల పుంజుకున్నట్లు కనిపించారు. 7, 8 ఓవర్లలో 7 రన్సే ఇచ్చి కాస్త కట్టడి చేశారు. కానీ  ఈ ఇద్దరు తర్వాత మళ్లీ జోరందుకున్నారు. సింగిల్స్‌‌‌‌తో పాటు వీలైనప్పుడల్లా బౌండ్రీలు బాదారు. దాంతో ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌లో ఇండియా స్కోరు 85/0కి పెరిగింది. ఈ క్రమంలో 30 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ మార్క్‌‌‌‌ను అందుకున్న షెఫాలీ 11 ఓవర్‌‌‌‌లో 4, 6, 4తో రెచ్చిపోయింది.

12వ ఓవర్‌‌‌‌లో స్మృతి కూడా 4, 6, 4తో 35 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీని పూర్తి చేసింది. 13, 14వ ఓవర్‌‌‌‌లో ఇద్దరు కలిసి 4, 4, 6, 4, 4తో 29 రన్స్‌‌‌‌ దంచారు. 15వ ఓవర్‌‌‌‌లో స్మృతి రెండో సిక్స్‌‌‌‌ కొట్టగా, తర్వాతి ఓవర్‌‌‌‌లో షెఫాలీ ఫోర్‌‌‌‌ కొట్టి వికెట్‌‌‌‌ ఇచ్చుకుంది. ఫలితంగా తొలి వికెట్‌‌‌‌కు 162 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. మరో నాలుగు బాల్స్‌‌‌‌ తర్వాత స్మృతి కూడా వెనుదిరిగింది. ఈ దశలో వచ్చిన రిచా ఘోష్‌‌‌‌, హర్మన్‌‌‌‌ కూడా బ్యాట్లు ఝుళిపించారు. రెండు ఫోర్లతో మొదలుపెట్టిన ఘోష్‌‌‌‌ 19వ ఓవర్‌‌‌‌లో 6, 6, 4, 6తో 23 రన్స్‌‌‌‌ దంచింది. చివర్లో హర్మన్‌‌‌‌ 6, 4 రాబట్టింది. మూడో వికెట్‌‌‌‌కు 53 రన్స్‌‌‌‌ జోడించడంతో ఇండియా భారీ టార్గెట్‌‌‌‌ను నిర్దేశించింది. 

లంక చివరి వరకు..
భారీ ఛేజింగ్‌‌‌‌లోనూ లంక చివరి వరకు పోరాడింది. తొలి ఓవర్‌‌‌‌లో మూడు ఫోర్లు కొట్టిన హాసిని పెరీరా (33) తర్వాత మరో రెండు రాబట్టింది. మధ్యలో చామరి 4, 6, 4తో రెచ్చిపోయింది. నాలుగో ఓవర్‌‌‌‌లో మరో రెండు ఫోర్లు కొట్టిన హాసిని ఆరో ఓవర్‌‌‌‌లో ఔటైంది. దాంతో తొలి వికెట్‌‌‌‌కు 59 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో ఇమేషా దులానీ (29) స్ట్రయిక్‌‌‌‌ రొటేట్‌‌‌‌ చేసినా చామరి బౌండ్రీలు కొట్టడం ఆపలేదు. దాంతో పవర్‌‌‌‌ప్లేలో 60/1 స్కోరు చేసిన లంక ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌లో 95/1తో నిలిచింది. 12వ ఓవర్‌‌‌‌లో రెండో సిక్స్‌‌‌‌ కొట్టిన చామరి 34 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసింది. కానీ 13వ ఓవర్‌‌‌‌లో లాస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌కు వెనుదిరగడంతో  రెండో వికెట్‌‌‌‌కు 57 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది.

6, 4తో ఖాతా తెరిచిన హర్షిత సమరవిక్రమ (20) ఉన్నంతసేపు వేగంగా ఆడింది. 15 ఓవర్లలో స్కోరు 139/2కి చేరింది. అయితే 8 బాల్స్‌‌‌‌ తేడాలో ఈ ఇద్దరూ ఔట్‌‌‌‌ కావడంతో లంక 147/4తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ టైమ్‌‌‌‌లో కావిషా దిల్హారి (13), నీలాక్షిక సిల్వ (23 నాటౌట్‌‌‌‌) బ్యాట్లు ఝుళిపించారు. చకచకా బౌండ్రీలు బాదుతూ ఐదో వికెట్‌‌‌‌కు 23 రన్స్‌‌‌‌ జోడించి విజయంపై ఆశలు రేకెత్తించారు. కానీ 19వ ఓవర్‌‌‌‌లో కావిషా ఔట్‌‌‌‌ కావడంతో లంక మళ్లీ కష్టాల్లో పడింది. చివర్లో రష్మిక (5), నీలాక్షిక, కౌశిని (5 నాటౌట్‌‌‌‌) ఫోర్లు బాదినా టార్గెట్‌‌‌‌ను చేరుకోలేకపోయారు.  

సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 20 ఓవర్లలో 221/2 (స్మృతి 80, షెఫాలీ 79, రిచా 40*, నిమాషా 1/40, మల్షా 1/32). శ్రీలంక: 20 ఓవర్లలో 191/6 (చామరి 52, హాసిని 33, అరుంధతి 2/42, వైష్ణవి 2/24). 

1 ఇండియా తరఫున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్‌‌‌‌ స్మృతి మంధాన (80). హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ కౌర్‌‌‌‌ (78)ని అధిగమించింది. 4విమెన్స్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో 10 వేల రన్స్‌‌‌‌ చేసిన నాలుగో బ్యాటర్‌‌‌‌గా స్మృతి మంధాన (10,053) రికార్డులకెక్కింది. మిథాలీ రాజ్‌‌‌‌ (10,868), సుజీ బేట్స్‌‌‌‌ (10,652), చార్లెట్‌‌‌‌ ఎడ్వర్డ్స్‌‌‌‌ (10,273) ముందున్నారు.

ఇండియా తరఫున ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌‌‌‌ మంధాన. అయితే ఇన్నింగ్స్‌‌‌‌ పరంగా అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌‌‌‌ మంధాన (281). మిథాలీ రాజ్‌‌‌‌ (291), ఎడ్వర్డ్స్‌‌‌‌ (308), బేట్స్‌‌‌‌ (314) తర్వాతి ప్లేస్‌‌‌‌ల్లో ఉన్నారు. 162 విమెన్స్‌‌‌‌ టీ20ల్లో ఇండియా తరఫున ఏ వికెట్‌‌‌‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. గతంలో మంధాన-షెఫాలీ పేరు మీదే ఉన్న 143 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ను అధిగమించారు.