- ఖర్గే నివాసంలో జరిగిన మాక్ పార్లమెంటులో తీర్మానం
- సభాపతిగా మాజీ స్పీకర్ మీరా కుమార్
- తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే
- సీఈసీపై ఆరు అభియోగాలు మోపిన సమావేశం
- దేశ ద్రోహం కింద జ్ఞానేశ్ ను విచారించాలని డిమాండ్
- హాజరైన సోనియా, రాహుల్, ప్రియాంక, కేసీ, సీఎం రేవంత్
- బీజేపీ గెలుపు కోసం 13.2 కోట్ల ఓట్లు గల్లంతు చేశారని ఆరోపణ
- ఫారం-6 మార్పు, ఈసీఐ సాఫ్ట్వేర్ దుర్వినియోగంపై ఆగ్రహం
న్యూ ఢిల్లీ: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై ఇండియా కూటమి శనివారం ‘ప్రజా అభిశంసన’ తీర్మానం చేసింది. ఢిల్లీ రాజాజీ మార్గ్‌లోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో నమూనా పార్లమెంట్ నిర్వహించింది. జాతీయ గీతాలాపనతో మొదలైన ఈ కార్యక్రమానికి లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షత వహించారు. జ్ఞానేశ్ కుమార్‌పై ఆరు అభియోగాలతో ఖర్గే తీర్మానం ప్రవేశపెట్టి, ఆయనను పదవి నుంచి తొలగించాలని, దేశద్రోహం కింద విచారించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్), ‘ఓట్ చోరీ’ ఆరోపణలపై నిరసనగా దీన్ని నిర్వహించారు. జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా అభిశంసన ముసాయిదా తీర్మానాన్ని ఖర్గే చదివి వినిపించారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు. దాన్ని నేడు ప్రమాదంలోకి నెట్టారు. ప్రధాని మోదీ, అమిత్ షా ఆదేశాలతోనే సీఈసీ పని చేస్తున్నారు’’ అని ఆయన మండిపడ్డారు.
దేశంలో 60 శాతానికి పైగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమిగా తాము ఈ తీర్మానం చేస్తున్నామంటూ జ్ఞానేశ్ కుమార్‌పై 6 అభియోగాలను మోపారు. మీరాకుమార్ మాట్లాడుతూ..‘‘ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతైన వారిలో తీవ్ర ఆవేదన ఉంది. వారి తరఫున మాట్లాడేందుకే ఈ సభ” అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ నాయకులు ప్రియాంక గాంధీ, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్‌తోపాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎస్పీ ఎంపీలు అవధేశ్ ప్రసాద్, ధర్మేంద్ర యాదవ్, టీఎంసీ ఎంపీలు సౌగతా రాయ్, డెరెక్ ఓబ్రియన్, దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ఇండియా కూటమి ర్యాలీకి అనుమతి
ఢిల్లీ వేదికగా ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ మహా ర్యాలీకి ఢిల్లీ పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నవంబర్ 1న రాంలీలా మైదానంలో సభ నిర్వహించుకునేందుకు అనుమతి మంజూరు చేసినట్టు శనివారం అధికారికంగా ప్రకటించారు. అయితే, కన్నాట్ ప్లేస్-మింటో రోడ్ జంక్షన్ నుంచి మైదానం వరకు తలపెట్టిన పాదయాత్రకు మాత్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు.
శుక్రవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ కార్యక్రమంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మింటో రోడ్ -కన్నాట్ ప్లేస్ నుంచి భారీ పాదయాత్ర మొదలై రాంలీలా మైదానానికి చేరుకుంటుందని, ప్రజలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ మార్చ్‌పై న్యూఢిల్లీ లేదా సెంట్రల్ జిల్లా పోలీసులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, దరఖాస్తు కూడా చేసుకోలేదని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. నిబంధనలు ఉల్లంఘించి పాదయాత్ర చేపడితే నేతలను అడ్డుకుంటారా? లేదా? అన్నదానిపై పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
వ్యక్తిగత కక్ష లేదు: ఖర్గే
సీఈసీపై తమకు వ్యక్తిగత కక్ష ఏమీ లేదని ఖర్గే అన్నారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రి నేరుగా ఇచ్చే ఆదేశాల ప్రకారమే జ్ఞానేశ్ కుమార్ ఎన్నికల సంఘాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. 2014 నుంచి అధికారంలో కొనసాగేందుకు బీజేపీ అన్ని మార్గాలనూ వాడుకుందని, పార్టీలను చీల్చిందని, ప్రభుత్వాలను కూల్చిందని, ఎలక్టోరల్ బాండ్లు తెచ్చిందని, ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలను ఉపయోగించుకుందని విమర్శించారు. ‘ఓట్ చోరీ’పై రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి జవాబు రాలేదన్నారు. ఇది డమ్మీ పార్లమెంట్ కాదని, సీఈసీపై ప్రజల అభిశంసన అని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా అన్నారు.
మళ్లీ అభిశంసన తీర్మానం: మీరా కుమార్
పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలోనే ఈ సభ ఏర్పాటు చేశామని మీరా కుమార్ ప్రారంభోపన్యాసంలో చెప్పారు. ఓటర్ల తొలగింపుపై కూటమి లేవనెత్తిన ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు రాలేదన్నారు. జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించేందుకు అభిశంసన తీర్మానం తేవడంపై ఇండియా కూటమి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కూటమి పార్టీల ప్రతినిధులు తమ వాదనలు వినిపించేలా, పౌర సమాజ ప్రతినిధులు, ఎస్ఐఆర్ బాధితులు సాక్ష్యాలు చెప్పేలా ఏర్పాట్లు చేశారు.
ఓడిపోయి సొంత పార్లమెంటా: బీజేపీ
ప్రతిపక్ష ఇండియా కూటమి మాక్ సెషన్‌పై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ గాంధీ ప్రజల్లో గెలవలేక తనకిష్టమైన రీతిలో సొంత పార్లమెంట్ పెట్టుకుని కూర్చున్నారని పార్టీ అధికార ప్రతినిధి గురు ప్రకాశ్ పాశ్వాన్ ఎద్దేవా చేశారు. ‘‘ఇది మాక్ పార్లమెంట్ కాదు.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ప్రజల్లో గందరగోళం సృష్టించడానికే ఈ డ్రామాలు ఆడుతున్నారు’’ అని ఆయన మండిపడ్డారు.
ఇందిరా గాంధీ దేశానికే ఆదర్శం
నివాళులర్పించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
న్యూఢిల్లీ, వెలుగు: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశానికి అందించిన సేవలు, ఆమె ధైర్యసాహసాలు, దార్శనిక నాయకత్వం నేటి తరానికి ఆదర్శమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు శనివారం ఘన నివాళులర్పించారు. ‘గరీబీ హఠావో’ నినాదంతో పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఇందిరాగాంధీ.. అసైన్డ్ భూములు, ఇండ్ల కేటాయింపు వంటి చర్యలతో పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. సామాజిక న్యాయం, పేదల సాధికారతకు ఆమె తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. అమెరికా వంటి శక్తిమంతమైన దేశాల ఒత్తిళ్లకు తలొగ్గకుండా, భారతదేశం స్వతంత్రంగా వ్యవహరించే సత్తా కలిగిన దేశమని ప్రపంచానికి చాటిచెప్పిన ధైర్యవంతమైన నాయకురాలని కొనియాడారు.
సీఈసీపై ఆరు అభియోగాలు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 కల్పించిన ఓటు హక్కు తీవ్ర ప్రమాదంలో పడిందని తీర్మానం ప్రవేశపెడుతూ ఖర్గే అన్నారు. జ్ఞానేశ్ కుమార్‌పై ఆయన మోపిన ఆరు అభియోగాలు ఇవి:
- దేశవ్యాప్తంగా, రాష్ట్రాల్లో ఎన్నికలను
- ప్రభావితం చేసేందుకు కుట్ర పన్నారు.
- ఓటర్ల జాబితాల నుంచి 13.2 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించారు.
- పార్లమెంట్‌కు తెలియకుండా, దాని పర్యవేక్షణ లేకుండా ఫారం–6ను మార్చేశారు.
- ఈసీఐనెట్ ద్వారా ఓటర్ల జాబితాలను తన గుప్పిట్లోకి తీసుకున్నారు.
- కీలక నిర్ణయాల నుంచి మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్లను దూరం పెట్టారు.
- ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు.
ప్రత్యేక సెషన్లో చర్చిద్దాం: అమిత్ షా
ఓటర్ల జాబితా వివాదంపై పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో చర్చకు రావాలని రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సవాల్ విసిరారు. సీఈసీని తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు ఈ ఏడాది ఏప్రిల్‌లో లోక్‌సభ, రాజ్యసభల్లో నోటీసులు ఇవ్వగా, వాటిని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ తిరస్కరించారు. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిని తొలగించే విధానంలోనే సీఈసీని తొలగించాల్సి ఉంటుంది. ఇందుకు పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేక మెజార్టీతో తీర్మానం ఆమోదించాల్సి ఉంటుంది.
